ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy) కుటుంబం సంపద ఒక్క రోజులో రూ.1900 కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో శుక్రవారం (జనవరి 17) నాడు ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయి రూ. 1,812.70 వద్ద ముగిశాయి. ఈ భారీ తగ్గుదలతో మూర్తి కుటుంబం నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 1,900 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. అమ్మకాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.54 లక్షల కోట్లకు పడిపోయింది.
4.02 శాతం వాటా
సెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో సమిష్టిగా 4.02 శాతం వాటాను నారాయణ మూర్తి కుటుంబం కలిగి ఉంది. ఇందులో మూర్తి 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన సతీమణి సుధా మూర్తికి 0.92 శాతం, వారి కుమారుడు రోహన్ మూర్తికి 1.62 శాతం వాటా ఉంది. ఇక వారి కుమార్తె, యూకే (UK) మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి 1.04 శాతం, నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తి 0.04 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం నాటి క్షీణత తర్వాత కంపెనీలో మూర్తి కుటుంబం హోల్డింగ్‌ల విలువ రూ. 30,334 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటి రూ. 32,236 కోట్లతో పోలిస్తే గణనీయమైన నష్టాన్ని ప్రతిబింబిస్తోంది.
లాభాలు బాగున్నా..
ఇన్ఫోసిస్ బలమైన త్రైమాసిక ఆదాయాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ కల్లోలం ఏర్పడింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ.6,806 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను 4.5-5 శాతానికి సవరించింది. ఇది దాని వ్యాపార పథంలో విశ్వాసాన్ని సూచిస్తోంది.
ఇదీ చదవండి: విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!
బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ, స్టాక్ క్షీణత విస్తృత పరిశ్రమ సవాళ్లు, మార్కెట్ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళనలను తెలియజేస్తోంది. 1,812.70గా ఉన్న స్టాక్ విలువ ఐటీ రంగంలో రానున్న ఎదురుగాలి గురించిన భయాందోళనలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న ముఖ్యమైన వాటా కంపెనీ వారసత్వంలో వారి కీలక పాత్రను తెలియజేస్తోంది. ఐటీ రంగంలోని కీలక పరిణామాలు, ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని అంచనా వేయడానికి డీల్ పైప్‌లైన్‌ను నిశితంగా పర్యవేక్షించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment