
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరికొంత మందిని తొలగించింది. అంతర్గత మదింపులో ఉత్తీర్ణలు కాలేదంటూ ఇన్ఫోసిస్ మార్చి 26న తమ మైసూరు క్యాంపస్ నుండి 30-45 మంది ట్రైనీలను తొలగించినట్లు వార్తా సంస్థ మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. అయితే తొలగింపునకు గురైన ట్రైనీలకు మరో ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన ట్రైనీలకు ప్రత్యామ్నాయ కెరీర్ మార్గంగా ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) లో ఉద్యోగాల కోసం 12 వారాల శిక్షణను అందించేందుకు ముందకు వచ్చింది. ఇదే మైసూరు క్యాంపస్‌కు చెందిన సుమారు 350 మంది ట్రైనీలను తొలగించిన రెండు నెలల తర్వాత ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీపీఎం కోర్సును ఎంచుకున్న వారికి ఈ శిక్షణను స్పాన్సర్ చేస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది.
"మీ ఫైనల్ అసెస్‌మెంట్ ఫలితాలను వెల్లడిస్తున్నాం. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహ నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్మెంట్ అవకాశాలు ఇచ్చినప్పటికీ మీరు 'ఫౌండేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'లో అర్హత ప్రమాణాలను చేరుకోలేకపోయారు" అని ట్రైనీలకు పంపిన మెయిల్స్‌లో కంపెనీ పేర్కొంది.
ఎక్స్‌గ్రేషియాగా నెల జీతం
తొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక నెల జీతాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తోంది. దీంతో పాటు రిలీవింగ్ లెటర్లను అందిస్తోంది. ఇక బీపీఎం మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడని వారికి మైసూరు నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యం కల్పించి, వారి స్వగ్రామానికి ప్రామాణిక ప్రయాణ భత్యం అందిస్తుంది. అవసరమైతే, ట్రైనీలు బయలుదేరే తేదీ వరకు మైసూరులోని ఎంప్లాయీ కేర్ సెంటర్లో ఉండవచ్చు. క్యాంపస్ నుంచి వెళ్లాలనుకునే ట్రైనీలు మార్చి 27లోగా తమ ప్రయాణ, వసతి ప్రాధాన్యతలను సమర్పించాలని ఇన్ఫోసిస్ కోరింది.
ఇన్ఫోసిస్‌కు క్లీన్ చిట్
మరోవైపు ట్రైనీల తొలగింపునకు సంబంధించి ఇన్ఫోసిస్ ఎలాంటి కార్మిక చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని కర్ణాటక కార్మిక శాఖ డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చింది. ‘వారంతా కేవలం ట్రైనీలు మాత్రమే. కొందరు మూడు నెలల శిక్షణ మాత్రమే తీసుకున్నారు. దీనిని లేఆఫ్ అనలేం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ కార్మిక చట్టాలు వర్తించవు. రెగ్యులర్ ఉద్యోగాలకు మాత్రమే లేఆఫ్ వర్తిస్తుంది. ఇక్కడ యజమాన్యం-ఉద్యోగి సంబంధం అస్సలు ఉండదు. వారంతా ఉద్యోగులు కాదు, అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు' అని అధికారుల నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.