
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) లేఆఫ్‌లలో మరో పరిణామం చోటుచేసుకుంది. బలవంతపు తొలగింపులపై ఇన్ఫోసిస్ ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తలుపులు తట్టారు. ఇన్ఫోసిస్ తమను అన్యాయంగా తొలగించిందని (Layoffs), తిరిగి విధుల్లోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు పీఎంవోకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ లో సామూహిక తొలగింపులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరుతూ కర్ణాటక లేబర్ కమిషనర్ కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండో నోటీసు పంపింది. పీఎంవోకు పలు ఫిర్యాదులు అందాయని, కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర కార్మిక అధికారులను కోరింది. అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్)కు సమాచారం అందించింది.
700 మంది తొలగింపు
గత రెండున్నరేళ్లలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియమించుకున్న సుమారు 700 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న తొలగించింది. వీరు 2023 అక్టోబర్‌లోనే విధుల్లోకి చేరారు. అంతర్గత మదింపు కార్యక్రమంలో బాధిత ఉద్యోగులు విఫలమయ్యారని పేర్కొంటూ ఇన్ఫోసిస్ తొలగింపులను సమర్థించుకుంది. వీరిలో పనితీరు సంబంధిత సమస్యల కారణంగా 350 మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులు అంతర్గత మదింపుల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా పరీక్షల్లో క్లిష్టత స్థాయిని పెంచారని, దీంతో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇన్ఫోసిస్ స్పందన
ఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్ఫోసిస్ తన వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ టెస్టింగ్ ప్రక్రియలను మూల్యాంకన విధాన పత్రంలో పొందుపరిచామని, ట్రైనీలందరికీ ముందస్తుగా తెలియజేశామని తెలిపింది.
ఇన్ఫోసిస్ లో చేరే ప్రతి ట్రైనీ కంపెనీలో తమ అప్రెంటిస్ షిప్ ను అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపుతారని గుర్తు చేసింది. శిక్షణ ఖర్చును పూర్తిగా ఇన్ఫోసిస్ భరిస్తోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment