
ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌కి సంబంధించిన టీమ్‌లు, డ్రైవర్లు, ఇతరత్రా వివరాలన్నీ అభిమానులకు సమగ్రంగా అందించేలా ’ఫార్ములా ఈ–స్టాట్స్ సెంటర్’ను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆవిష్కరించింది. తొలి ఎలక్ట్రిక్ ఎఫ్‌ఐఏ ప్రపంచ కాంపిటీషన్ అయిన ‘ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్’తో భాగస్వామ్యం ద్వారా కంపెనీ దీన్ని రూపొందించింది.
సంక్లిష్టమైన డేటాను సరళతరంగా అందించేందుకు, అభిమానులు–చాంపియన్‌షిప్ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ–స్టాట్స్ సెంటర్ ఉపయోగపడుతుందని ఇన్ఫీ తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత ’ఇన్ఫోసిస్ టొపాజ్’ సొల్యూషన్‌తో దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించింది. దీనితో ఫ్యాన్స్.. వివిధ సీజన్లవ్యాప్తంగా తమ అభిమాన డ్రైవర్లు, టీమ్‌ల పనితీరును ట్రాక్ చేయొచ్చని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డాడ్స్ తెలిపారు.
ఆసక్తికరమైన క్యూరేటెడ్ ప్రశ్నలతో ట్రెండింగ్ బబుల్ చాట్ ఫార్మాట్‌ను ఉపయోగించి ప్రస్తుత, గత సీజన్లలో డ్రైవర్లు, జట్ల గణాంకాలను ప్రదర్శించడం ద్వారా ఇది యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్ సంక్లిష్టమైన డేటాను సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఫార్ములా ఈ సెంట్రల్ డేటా పూల్‌ను ఇన్ఫోసిస్ గూగుల్ క్లౌడ్ కు తరలించి తద్వారా ఫార్ములా ఈ మార్కెటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్రీడా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సురక్షితమైన ఏర్పాటు చేసింది.