
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కంపెనీ ప్రమోటర్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ తాజాగా జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌లో 5.8 శాతం వాటా విక్రయించింది. బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం వీటి విలువ రూ. 1,460 కోట్లు. అనుబంధ సంస్థ టౌ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా ఒక్కో షేరుకి రూ. 1,625 సగటు ధరలో 89.83 లక్షలకుపైగా షేర్లను అమ్మివేసింది.
ఈ లావాదేవీ తదుపరి కేకేఆర్ వాటా 53.66 శాతం నుంచి 47.88 శాతానికి క్షీణించింది. కొటక్ మహీంద్రా ఎంఎఫ్ రూ. 200 కోట్లు వెచ్చించి 0.8 శాతం వాటాకు సమానమైన 12.3 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జేబీ కెమికల్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.2% పతనమై రూ. 1,604 వద్ద ముగిసింది.