
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.
ఎన్‌ఎస్‌ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్‌ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్ బిజినెస్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్‌కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్ ఇండియా బలపడింది.
10 బిలియన్ డాలర్లు..
క్యాస్ట్రాల్ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్ విభాగం విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్ లూబ్రికెంట్స్ యూనిట్‌తో క్యాస్ట్రాల్ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్‌కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
2023లో 2.65 బిలియన్ డాలర్లకు వాల్వోలైన్‌ను అరామ్‌కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్ బిజినెస్‌ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్‌కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment