Castrol India
-
కేపీఆర్ మిల్- క్యాస్ట్రాల్ ఇండియా అదుర్స్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 204 పాయింట్లు క్షీణించి 40,318కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11,843 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో టెక్స్టైల్స్ రంగ కంపెనీ కేపీఆర్ మిల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది(2020) క్యూ3(జులై- సెప్టెంబర్)లో లూబ్రికెంట్స్ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా మెరుగైన పనితీరును చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేపీఆర్ మిల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేపీఆర్ మిల్ రూ. 113 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 88 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 74 శాతం జంప్‌చేసి రూ. 906 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1 శాతం బలపడి 22.21 శాతానికి చేరాయి. యూఎస్, తదితర మార్కెట్ల నుంచి టెక్స్‌టైల్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో రూ. 250 కోట్ల పెట్టుబడితో 4.2 కోట్ల దుస్తుల వార్షిక సామర్థ్యం కలిగతిన యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఆర్ మిల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 15 శాతం దూసుకెళ్లింది. రూ. 784ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం ఎగసి రూ. 730 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో క్యాస్ట్రాల్ ఇండియా నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 205 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4 శాతం పెరిగి రూ. 883 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ. 288 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 3.9 శాతం బలపడి 28.77 శాతానికి ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి 9 నెలల్లో రూ. 624 కోట్ల నికర నగదును ఆర్జించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.5 శాతం దూసుకెళ్లి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. -
Q4- బీహెచ్ఈఎల్, క్యాస్ట్రాల్ వీక్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో విదేశీ మార్కెట్లలో మళ్లీ చమురు ధరలు పతనంకాగా.. దేశీయంగా స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లు పతనమై 33,281కు చేరగా.. నిఫ్టీ 150 పాయింట్లు పడిపోయి 9,822 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఎంఎన్ఎసీ.. క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. బీహెచ్ఈఎల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో విద్యుత్ పరికరాల కంపెనీ బీహెచ్ఈఎల్ రూ. 1532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 681 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 54 శాతం క్షీణించి రూ. 4594 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో రూ. 1278 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించగా.. తాజా త్రైమాసికంలో రూ. 708 కోట్ల ఇబిటా నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీహెచ్ఈఎల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 30 దిగువన ట్రేడవుతోంది. క్యాస్ట్రాల్ ఇండియా లూబ్రికెంట్స్, స్పెషాలిటీ ప్రొడక్టుల దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ1(జనవరి-మార్చి)లో 32 శాతం తక్కువగా రూ. 125 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 29 శాతం వెనకడుగుతో రూ. 688 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 41 శాతం నీరసించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు తొలుత 5 శాతం పతనమై రూ. 116కు చేరింది. ప్రస్తుతం రికవరై 1 శాతం నష్టంతో రూ. 121 దిగువన ట్రేడవుతోంది. -
క్యాస్ట్రాల్ ఇండియాలో వాటా విక్రయించిన బీపీ
డీల్ విలువ రూ.2,075 కోట్లు న్యూఢిల్లీ: క్యాస్ట్రాల్ ఇండియాలో 11.5 శాతం వాటాను ఇంగ్లండ్‌కు చెందిన బీపీ కంపెనీ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.365 చొప్పున 5.68 కోట్ల షేర్లను(11.5 శాతంవాటా)ను దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విక్రయించామని బీపీ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ విలువ రూ.2,075 కోట్లని వివరించింది. ఈ వాటా విక్రయాన్ని సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు నిర్వహించాయి. ఈ డీల్ కారణంగా క్యాస్ట్రాల్ ఇండియా ఉద్యోగులు, వినియోగదారులు, ప్రస్తుత కాంట్రాక్టులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డడ్లీ చెప్పారు. వృద్ధికి అవకాశాలున్న భారత్ తమకు కీలకమైన మార్కెటని, భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని బీపీ ఇండియా హెడ్ శశి ముకుందన్ చెప్పారు. గతేడాది మంచి పనితీరు కనబరిచామని క్యాస్ట్రాల్ ఇండియా ఎండీ ఒమర్ డోర్‌మెన్ చెప్పారు. నికర లాభం 30 శాతం వృద్ధితో రూ.615 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. క్యాస్ట్రాల్ ఇండియాలో బీపీ సంస్థకు 70.92 శాతం వాటా ఉంది. వాటా విక్రయ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేర్ బీఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ.373 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
జిల్లెట్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.4,133 టార్గెట్ ధర: రూ.4,515 ఎందుకంటే: ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అనుబంధ సంస్థ జిల్లెట్ ఇండియా- బ్లేడ్లు, రేజర్లు, ఓరల్ కేర్, పోర్టబుల్ విద్యుత్ ఉత్పత్తులు అందిస్తోంది. బ్లేడులు, రేజర్లు, టాయిలెట్ ఉత్పత్తులను జిల్లెట్ బ్రాండ్ కింద, టూత్ బ్రష్‌లు, ఇతర ఓరల్ కేర్ ఉత్పత్తులను ఓరల్-బి బ్రాండ్ కింద, డ్యురాసెల్ బ్రాండ్ కింద బ్యాటరీలను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు రూ. 427 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 17 శాతం వృద్ధితో రూ.498 కోట్లకు పెరిగాయి. నికర లాభం రూ.110 కోట్ల నుంచి 234 శాతం వృద్ధితో రూ.367 కోట్లకు పెరిగింది. స్థూల లాభం 239 శాతం వృద్ధి సాధించింది. గ్రూమింగ్ పోర్ట్‌ఫోలియో విభాగం 13 శాతం, ఓరల్ కేర్ వ్యాపార విభాగం 26 శాతం, పోర్టబుల్ పవర్ బిజినెస్ విభాగం 29 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నికర లాభం 16 శాతం చొప్పున వృద్ధి సాధించగలవని ఆశిస్తున్నాం. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35 గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.41గానూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.4,515 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను కొనొచ్చని సూచిస్తున్నాం. క్యాస్ట్రాల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 467 టార్గెట్ ధర: రూ.611 ఎందుకంటే: వాహన, పారిశ్రామిక రంగాలకు అవసరమైన ఇంజిన్ ఆయిల్స్, గ్రీజు తదితర లూబ్రికెంట్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. భారత వాహన లూబ్రికెంట్ మార్కెట్లో అగ్రశ్రేణి కంపెనీ. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు వాహన విభాగం విక్రయాలు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో కంపెనీ ఆదాయం 6% వృద్ధి మాత్రమే సాధించి రూ.859 కోట్లకు పెరిగింది. పారిశ్రామిక విభా గం విక్రయాలు మాత్రం అంచనాలను మిం చాయి. ఇబిటా మార్జిన్ 24 శాతం పెరిగింది. నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.132 కోట్లకు చేరింది. గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక పరిస్థితి బాగా ఉండకపోవడంతో కంపెనీ అమ్మకాలు కూడా మందగమనంగానే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటంతో కంపెనీ అమ్మకాలు 5 శాతం పెరుగుతాయని అంచనా. కంపెనీ ఉత్పత్తులకు ముడి పదార్థంగా ముడి చమురు అనుబంధ పదార్ధాలను ఉపయోగిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో కంపెనీ మార్జిన్లు పెరగవచ్చు. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడుతుండడడం, వాహన అమ్మకాలు పుంజుకోనుండడం... సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.