కేపీఆర్‌ మిల్‌- క్యాస్ట్రాల్‌ ఇండియా అదుర్స్‌ | KPR Mill- Castrol India jumps on july- september results | Sakshi
Sakshi News home page

కేపీఆర్‌ మిల్‌- క్యాస్ట్రాల్‌ ఇండియా అదుర్స్‌

Published Wed, Oct 28 2020 12:17 PM | Last Updated on Wed, Oct 28 2020 12:17 PM

KPR Mill- Castrol India jumps on july- september results - Sakshi

స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 204 పాయింట్లు క్షీణించి 40,318కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11,843 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో టెక్స్‌టైల్స్‌ రంగ కంపెనీ కేపీఆర్‌ మిల్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది(2020) క్యూ3(జులై- సెప్టెంబర్‌)లో లూబ్రికెంట్స్‌ దిగ్గజం క్యాస్ట్రాల్‌ ఇండియా మెరుగైన పనితీరును చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

కేపీఆర్‌ మిల్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో కేపీఆర్‌ మిల్‌ రూ. 113 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 88 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 74 శాతం జంప్‌చేసి రూ. 906 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1 శాతం బలపడి 22.21 శాతానికి చేరాయి. యూఎస్‌, తదితర మార్కెట్ల నుంచి టెక్స్‌టైల్స్‌కు మంచి డిమాండ్‌ కనిపిస్తున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో రూ. 250 కోట్ల పెట్టుబడితో 4.2 కోట్ల దుస్తుల వార్షిక సామర్థ్యం కలిగతిన యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఆర్‌ మిల్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం దూసుకెళ్లింది. రూ. 784ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం ఎగసి రూ. 730 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్‌ 75 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

క్యాస్ట్రాల్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్‌)లో క్యాస్ట్రాల్‌ ఇండియా నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 205 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4 శాతం పెరిగి రూ. 883 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ. 288 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 3.9 శాతం బలపడి 28.77 శాతానికి ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి 9 నెలల్లో రూ. 624 కోట్ల నికర నగదును ఆర్జించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్‌ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9.5 శాతం దూసుకెళ్లి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement