KPR Agro
-
కేపీఆర్ మిల్- క్యాస్ట్రాల్ ఇండియా అదుర్స్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 204 పాయింట్లు క్షీణించి 40,318కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11,843 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో టెక్స్టైల్స్ రంగ కంపెనీ కేపీఆర్ మిల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది(2020) క్యూ3(జులై- సెప్టెంబర్)లో లూబ్రికెంట్స్ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా మెరుగైన పనితీరును చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. కేపీఆర్ మిల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేపీఆర్ మిల్ రూ. 113 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 88 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 74 శాతం జంప్‌చేసి రూ. 906 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1 శాతం బలపడి 22.21 శాతానికి చేరాయి. యూఎస్, తదితర మార్కెట్ల నుంచి టెక్స్‌టైల్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. దీంతో రూ. 250 కోట్ల పెట్టుబడితో 4.2 కోట్ల దుస్తుల వార్షిక సామర్థ్యం కలిగతిన యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఆర్ మిల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 15 శాతం దూసుకెళ్లింది. రూ. 784ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం ఎగసి రూ. 730 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో క్యాస్ట్రాల్ ఇండియా నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 205 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4 శాతం పెరిగి రూ. 883 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ. 288 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 3.9 శాతం బలపడి 28.77 శాతానికి ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి 9 నెలల్లో రూ. 624 కోట్ల నికర నగదును ఆర్జించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.5 శాతం దూసుకెళ్లి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. -
త్వరలో ఐపీవోకు కేపీఆర్ ఆగ్రో!
విభజన తర్వాత ఏపీ నుంచి తొలి ఐపీవో సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న తొలి కంపెనీగా కేపీఆర్ ఆగ్రో కెమ్ (గతంలో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌గా పిలిచేవారు) రికార్డులకు ఎక్కనుంది. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం కేంద్రంగా పనిచేస్తున్న కేపీఆర్ ఆగ్రో త్వరలో ఐపీవోకి రానుంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే రెండు నెలలలోపే ఐపీవోకి రానున్నట్లు ఈ వ్యవహారంతో నేరుగా సంబంధమున్న వ్యక్తి ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు. ఐపీవో ద్వారా 50 లక్షల షేర్లను జారీ చేసి, రూ.180 కోట్ల వరకూ సమీకరించాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు కంపెనీకి గత నెలలో సెబీ కూడా అనుమతి మంజూరు చేసింది. ఇష్యూ ద్వారా వచ్చిన నిధులతో మహారాష్ట్ర, తమిళనాడుల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. ప్రస్తుతం కేపీఆర్ ఆగ్రోకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో యూనిట్లున్నాయి. పంటలను కాపాడే కెమికల్స్, పంటల ఎదుగుదలకు ఉపయోగపడే న్యూట్రియెంట్ ఉత్పత్తులు, విత్తనాలను కేపీఆర్ ఆగ్రో ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఐపీవో ద్వారా వచ్చిన నిధులతో కంపెనీకి ఉన్న రుణాలను కూడా తీర్చనుంది. 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ. 600 కోట్ల టర్నోవర్ నమోదు చేసిన కంపెనీ ఈ ఏడాది వ్యాపారం రూ. 800 కోట్లు దాటుతుందని అం చనా వేస్తోంది. కిసాన్ సేవా కేంద్రాలను మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో ఏర్పాటు చేయనుంది.