త్వరలో ఐపీవోకు కేపీఆర్ ఆగ్రో!
విభజన తర్వాత ఏపీ నుంచి తొలి ఐపీవో
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి స్టాక్ మార్కెట్లో నమోదవుతున్న తొలి కంపెనీగా కేపీఆర్ ఆగ్రో కెమ్ (గతంలో కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌గా పిలిచేవారు) రికార్డులకు ఎక్కనుంది. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం కేంద్రంగా పనిచేస్తున్న కేపీఆర్ ఆగ్రో త్వరలో ఐపీవోకి రానుంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే రెండు నెలలలోపే ఐపీవోకి రానున్నట్లు ఈ వ్యవహారంతో నేరుగా సంబంధమున్న వ్యక్తి ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు.
ఐపీవో ద్వారా 50 లక్షల షేర్లను జారీ చేసి, రూ.180 కోట్ల వరకూ సమీకరించాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు కంపెనీకి గత నెలలో సెబీ కూడా అనుమతి మంజూరు చేసింది. ఇష్యూ ద్వారా వచ్చిన నిధులతో మహారాష్ట్ర, తమిళనాడుల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. ప్రస్తుతం కేపీఆర్ ఆగ్రోకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో యూనిట్లున్నాయి. పంటలను కాపాడే కెమికల్స్, పంటల ఎదుగుదలకు ఉపయోగపడే న్యూట్రియెంట్ ఉత్పత్తులు, విత్తనాలను కేపీఆర్ ఆగ్రో ఉత్పత్తి చేస్తుంది.
అలాగే ఐపీవో ద్వారా వచ్చిన నిధులతో కంపెనీకి ఉన్న రుణాలను కూడా తీర్చనుంది. 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ. 600 కోట్ల టర్నోవర్ నమోదు చేసిన కంపెనీ ఈ ఏడాది వ్యాపారం రూ. 800 కోట్లు దాటుతుందని అం చనా వేస్తోంది. కిసాన్ సేవా కేంద్రాలను మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో ఏర్పాటు చేయనుంది.