పబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవో(IPO)లో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు.
దేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్‌డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్‌కంటే మూడు రోజులు ముందుగా లావాదేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: స్టార్టప్స్‌కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులు
నిధుల దుర్వినియోగం
కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దుర్వినియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్‌ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్‌స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్‌వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment