![here are some ipo listing companies for fund raising](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/ipo01.jpg.webp?itok=TCCcVq3F)
హెక్సావేర్ టెక్ @ రూ.674–708
జైపూర్: ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ.674–708 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ రేపు(12న) ప్రారంభమై 14న ముగియనుంది. దీనిలో భాగంగా ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ రూ.8,750 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ ఇది. కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(11న) షేర్లను ఆఫర్ చేయనుంది. ఏఐసహా.. డిజిటల్, టెక్నాలజీ సేవలందిస్తున్న హెక్సావేర్ విభిన్న కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసులు, హెల్త్‌కేర్ అండ్ ఇన్సూరెన్స్, మ్యాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్ అండ్ ట్రావెల్ తదితర విభాగాల్లో సర్వీసులు అందిస్తోంది.
ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!
క్వాలిటీ పవర్ @ రూ.401–425
విద్యుత్ ప్రసార పరికరాలు, సంబంధిత టెక్నాలజీ కంపెనీ క్వాలిటీ పవర్ పబ్లిక్ ఇష్యూకి రూ.401–425 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమై 18న ముగియనుంది. దీనిలో భాగంగా రూ.225 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.634 కోట్ల విలువైన(1.5 కోట్ల షేర్లు) ప్రమోటర్ చిత్రా పాండ్యన్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ.859 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీలో ప్రస్తుతం పాండ్యన్ కుటుంబం 100 శాతం వాటా కలిగి ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 13న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులతో మెహ్రు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్‌ను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా ప్లాంటు, మెషీనరీ కొనుగోలుకి సైతం నిధులను వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అధిక వోల్టేజీ(హెచ్‌వీడీసీ) పరికరాల తయారీ, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్ నెట్‌వర్క్స్ అందిస్తోంది. గతేడాది(2023–24) రూ. 300 కోట్ల ఆదాయం, రూ. 55 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment