ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో విదేశీ మార్కెట్లలో మళ్లీ చమురు ధరలు పతనంకాగా.. దేశీయంగా స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లు పతనమై 33,281కు చేరగా.. నిఫ్టీ 150 పాయింట్లు పడిపోయి 9,822 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఎంఎన్‌ఎసీ.. క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..
బీహెచ్‌ఈఎల్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో విద్యుత్ పరికరాల కంపెనీ బీహెచ్‌ఈఎల్ రూ. 1532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 681 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 54 శాతం క్షీణించి రూ. 4594 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో రూ. 1278 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించగా.. తాజా త్రైమాసికంలో రూ. 708 కోట్ల ఇబిటా నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 30 దిగువన ట్రేడవుతోంది.
క్యాస్ట్రాల్ ఇండియా
లూబ్రికెంట్స్, స్పెషాలిటీ ప్రొడక్టుల దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ1(జనవరి-మార్చి)లో 32 శాతం తక్కువగా రూ. 125 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 29 శాతం వెనకడుగుతో రూ. 688 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 41 శాతం నీరసించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు తొలుత 5 శాతం పతనమై రూ. 116కు చేరింది. ప్రస్తుతం రికవరై 1 శాతం నష్టంతో రూ. 121 దిగువన ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment