‘భద్రాద్రి’ ప్లాంట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంపై జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ మధ్య వివాదం
మరమ్మతులుచేసేందుకు బీహెచ్‌ఈఎల్ నో.. చేసినా మళ్లీ కాలిపోతుందని స్పషీ్టకరణ
అంతర్గత సమస్యలతోనే కాలిపోయినట్టు గతంలో పేర్కొన్న జెన్‌కో ఇంజనీర్లు
యూనిట్–1 నిలిచి పోవడంతో రోజుకు 6.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన వ్యవహారంలో.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోకు, ప్లాంట్ నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు మధ్య వివాదం ముదురుతోంది. ఇది ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపి నష్టానికి కారణమవుతోంది. ఇటీవల బీటీపీఎస్‌లోని 270 మెగావాట్ల యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైన విషయం తెలిసిందే.
అంతర్గత సమస్య వల్లే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని జెన్‌కో దర్యాప్తులో తేల్చగా.. అది పిడుగుపాటుతోనే దగ్ధమైందని బీహెచ్‌ఈఎల్ చెబుతోంది. 320 ఎంవీఏ (మెగా వోల్ట్స్ యాంపియర్) సామర్థ్యమున్న ఈ జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్.. మరమ్మతులు సాధ్యం కాని రీతిలో దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసినా మళ్లీ కాలిపోతుందని బీహెచ్‌ఈఎల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ మధ్య వివాదం కొలిక్కిరాకపోవడంతో.. యూనిట్–1 పునరుద్ధరణలో పీటముడి పడింది. రోజూ 6.48 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి గండిపడింది.
రూ.108 కోట్ల విద్యుత్ నష్టం!
ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం.. భద్రాద్రి ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.30 కాగా.. అందులో ఫిక్స్‌డ్ చార్జీ రూ.1.94, వేరియబుల్ చార్జీ రూ.2.36గా నిర్ధారించింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తీసుకున్న పెట్టుబడి రుణాలను జెన్‌కో ప్రతినెలా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మొత్తాన్నే విద్యుత్ ధరలో ఫిక్స్‌డ్ చార్జీలుగా గణించి వసూలు చేస్తారు. ప్లాంట్ నుంచి విద్యుత్ కొన్నా, కొనకున్నా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు జెన్‌కోకు ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లిస్తాయి. అదే సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఫిక్స్‌డ్ చార్జీల నష్టాన్ని జెన్‌కోనే భరించాల్సి ఉంటుంది.
భద్రాద్రి యూనిట్–1లో 39 రోజులుగా రోజుకు రూ.2.78 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి నిలిచిపోగా.. ఇందులో రోజుకు రూ.1.25 కోట్లను ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో జెన్‌కో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.108.66 కోట్ల విలువైన విద్యుదుత్పత్తికి గండిపడగా.. రూ.49.02 కోట్లను ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో నష్టాన్ని భరించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం పెరుగుతూ పోతుంది. వెంటనే మరమ్మతులు చేసి యూనిట్–1ను పునరుద్ధరించకపోతే జెన్‌కోకు రూ.వందల కోట్ల నష్టం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరమ్మతులకు బీహెచ్‌ఈఎల్ ససేమిరా..
కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల నాలుగు యూనిట్లున్నాయి. జూన్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో ప్లాంట్‌లో పిడుగుపడింది. ఆ సమయంలో యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. అయితే పిడుగుపడిన సమయంలోనే.. యాదృచ్ఛికంగా జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ అంతర్గత లోపాలతో మంటలు రేగి కాలిపోయిందని జెన్‌కో ఇంజనీర్లు నిర్ధారించి నివేదిక సమరి్పంచారు. అంతర్గత సమస్యలతో కాలిపోయినందున నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్ తన సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు బీహెచ్‌ఈఎల్ నిపుణుల కమిటీ మాత్రం పిడుగుపాటు వల్లే జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందంటూ విరుద్ధమైన నివేదిక ఇచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌కు తీవ్ర నష్టం జరిగిందని.. మరమ్మతులు చేసినా, మళ్లీ కాలిపోవడం ఖాయమని పేర్కొంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోవాలని జెన్‌కోకు సూచించింది. ఈ క్రమంలో మరమ్మతులు ఎవరు చేయాలన్న విషయంలో జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ మధ్య వివాదం నెలకొంది. దీనితో యూనిట్–1 పునరుద్ధరణ పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీహెచ్‌ఈఎల్ మరమ్మతులకు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయించేందుకు జెన్‌కో ప్రయతి్నస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment