bhadradri Plant
-
అది అగ్గే..కాదు పిడుగే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వ్యవహారంలో.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు, ప్లాంట్ నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు మధ్య వివాదం ముదురుతోంది. ఇది ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపి నష్టానికి కారణమవుతోంది. ఇటీవల బీటీపీఎస్‌లోని 270 మెగావాట్ల యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన విషయం తెలిసిందే.అంతర్గత సమస్య వల్లే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని జెన్కో దర్యాప్తులో తేల్చగా.. అది పిడుగుపాటుతోనే దగ్ధమైందని బీహెచ్ఈఎల్ చెబుతోంది. 320 ఎంవీఏ (మెగా వోల్ట్స్ యాంపియర్) సామర్థ్యమున్న ఈ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్.. మరమ్మతులు సాధ్యం కాని రీతిలో దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసినా మళ్లీ కాలిపోతుందని బీహెచ్ఈఎల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం కొలిక్కిరాకపోవడంతో.. యూనిట్–1 పునరుద్ధరణలో పీటముడి పడింది. రోజూ 6.48 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి గండిపడింది. రూ.108 కోట్ల విద్యుత్ నష్టం! ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం.. భద్రాద్రి ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.30 కాగా.. అందులో ఫిక్స్డ్ చార్జీ రూ.1.94, వేరియబుల్ చార్జీ రూ.2.36గా నిర్ధారించింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తీసుకున్న పెట్టుబడి రుణాలను జెన్కో ప్రతినెలా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మొత్తాన్నే విద్యుత్ ధరలో ఫిక్స్డ్ చార్జీలుగా గణించి వసూలు చేస్తారు. ప్లాంట్ నుంచి విద్యుత్ కొన్నా, కొనకున్నా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు జెన్కోకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లిస్తాయి. అదే సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఫిక్స్డ్ చార్జీల నష్టాన్ని జెన్కోనే భరించాల్సి ఉంటుంది. భద్రాద్రి యూనిట్–1లో 39 రోజులుగా రోజుకు రూ.2.78 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి నిలిచిపోగా.. ఇందులో రోజుకు రూ.1.25 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో జెన్కో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.108.66 కోట్ల విలువైన విద్యుదుత్పత్తికి గండిపడగా.. రూ.49.02 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టాన్ని భరించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం పెరుగుతూ పోతుంది. వెంటనే మరమ్మతులు చేసి యూనిట్–1ను పునరుద్ధరించకపోతే జెన్కోకు రూ.వందల కోట్ల నష్టం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరమ్మతులకు బీహెచ్ఈఎల్ ససేమిరా.. కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల నాలుగు యూనిట్లున్నాయి. జూన్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో ప్లాంట్‌లో పిడుగుపడింది. ఆ సమయంలో యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే పిడుగుపడిన సమయంలోనే.. యాదృచ్ఛికంగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో మంటలు రేగి కాలిపోయిందని జెన్కో ఇంజనీర్లు నిర్ధారించి నివేదిక సమరి్పంచారు. అంతర్గత సమస్యలతో కాలిపోయినందున నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ తన సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు బీహెచ్ఈఎల్ నిపుణుల కమిటీ మాత్రం పిడుగుపాటు వల్లే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ విరుద్ధమైన నివేదిక ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్కు తీవ్ర నష్టం జరిగిందని.. మరమ్మతులు చేసినా, మళ్లీ కాలిపోవడం ఖాయమని పేర్కొంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో మరమ్మతులు ఎవరు చేయాలన్న విషయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం నెలకొంది. దీనితో యూనిట్–1 పునరుద్ధరణ పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీహెచ్ఈఎల్ మరమ్మతులకు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయించేందుకు జెన్కో ప్రయతి్నస్తున్నట్టు తెలిసింది. -
నేడు కేంద్ర విద్యుత్ మంత్రితో కేసీఆర్ భేటీ
భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి అనుమతులపై చర్చ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆది వారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో నిర్మిం చతలపెట్టిన 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీ అంశంపైసీఎం ఈ భేటీలో చర్చించనున్నా రు. భద్రాద్రి ప్లాంట్‌ను సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించేందుకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారని తెలిసింది. -
జెన్ కో..! తీరు మార్చుకో..!!
♦ యుద్ధప్రాతిపదికన పనులపై కేంద్రం సీరియస్ ♦ ప్రజాభిప్రాయంతో పనిలేదా? పర్యావరణ అనుమతులు అక్కర్లేదా..?? ♦ భద్రాద్రి ప్లాంట్ విషయంలో ఏంటీ వైఖరీ? ♦ ఐదు నెలల తర్వాత పనులు నిలిపివేసి ♦ కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు కలెక్టర్ అనుమతి వచ్చాక పబ్లిక్ హియరింగ్: నర్సింగరావు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా.. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా.. చివరకు భూనిర్వాసిత కుటుంబాల యువతకు ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వకుండా.. యుద్ధప్రాతిపదికన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు చేయడం టీఎస్ జెన్కో పనితీరును ప్రశ్నిస్తోంది. పర్యావరణ ప్రేమికులకు జెన్కో తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. తీరుబడిగా ఈ పనులన్నీ చేస్తామనే జెన్కో వ్యవహారశైలిపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. ముందుచూపు లేని జెన్కో తీరును కేంద్రం ప్రశ్నించింది. - మణుగూరు మణుగూరు: మణుగూరు-పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విషయంలో టీఎస్ జెన్కో ముందుచూపు లేకుండా వ్యవహరించిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యంత కీలకమైన పర్యావరణానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ఏమాత్రం ఆలోచన చేయలేదు. గత సెప్టెంబరు నుంచి ఐదునెలల పాటు ప్లాంట్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేసినా.. పర్యావరణ అనుమతులపై ఆలోచన చేయలేదు. పర్యావరణ అనుమతి తీసుకోకపోవడంపై కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చేతులు కాలిన తరువాత... చేతులు కాలిన తరువాత...అన్న చందంగా జెన్కో వ్యవహరిస్తోంది. పర్యావరణ అనుమతులు తీసుకుని, భూనిర్వాసితులకు ప్యాకేజీలు, ఉద్యోగ హామీ పత్రాలు ఇచ్చాక పనులు ప్రారంభించాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, నిబంధనలు తమకేమీ వర్తించవన్నట్లుగా ముందుకు వెళ్లారు. ముమ్మరంగా పనులు చేశారు. ఈ క్రమంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులు నిలిపేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పనులకు బ్రేక్ పడింది. సబ్ కాంట్రాక్టర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇన్ని పరిణామాల తరువాత చివరకు మొదట చేయాల్సిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన దరఖాస్తును జెన్కో ఈ నెలలో కాలుష్య నియంత్రణ మండలికి పంపింది. కేంద్రానికి పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఫైర్... భద్రాద్రి ప్లాంట్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న పేరంటాల చెరువు, దమ్మక్కపేట సమీపంలో ప్లాంట్ మధ్య నుంచి వెళ్లే పొన్నవాగుపై పూర్తి వివరాలు ఇవ్వలేదని, గోదావరి, యాష్‌పాండ్, బఫర్‌జోన్, బొగ్గు కేటాయింపులు తదితర వివరాలు ఏమాత్రం ఇవ్వలేదు. తమ శాస్త్రవేత్త కరుపయ్య ద్వారా గత నెల 9వ తేదీన తనిఖీ చేయించి అన్ని వివరాలు తెలుసుకున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఫైర్ అయింది. పైగా యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో ఉపేక్షించలేదు.. టీఎస్జెన్కోపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అన్ని నిబంధనలు పాటిస్తేనే అనుమతులు... గోదావరికి సమీపంలో అదీ గిరిజన ప్రాంతం కావడంతో అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. సమీపంలో ఉన్న పేరంటాల చెరువు, గోదావరిలోకి హానికర వ్యర్థాలు వదలకుండా, ప్లాంట్ మధ్యలో ఉన్న పొన్నవాగు ప్రవాహం నిలిచిపోకుండా, అందులో నీరు వాడుకోకుండా, అడ్డంకి కలిగించకుండా, చుట్టూ 500 మీటర్లు బఫర్ జోన్ ఏర్పాటు చేసి అడవులు పెంచేలా, గిరిజన సంక్షేమానికి కార్పస్ ఫండ్, నిర్వాసితులకు ప్యాకేజీలు, పునరావాసం తదితరాల విషయంలో సంతృప్తికర చర్యలు తీసుకునేలా చేస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు పబ్లిక్ హియరింగ్.. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులపై ఐదునెలలుగా కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం ఇవ్వలేదు. పర్యావరణ అనుమతుల కోసం మణుగూరు-పినపాక మండలాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం కోసం ఈ నెలలోనే జెన్కో వారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టరు అనుమతితో తేదీ నిర్ణయించి పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తాం. - నర్సింగరావు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, కొత్తగూడెం