జెన్ కో..! తీరు మార్చుకో..!!
♦ యుద్ధప్రాతిపదికన పనులపై కేంద్రం సీరియస్
♦ ప్రజాభిప్రాయంతో పనిలేదా? పర్యావరణ అనుమతులు అక్కర్లేదా..??
♦ భద్రాద్రి ప్లాంట్ విషయంలో ఏంటీ వైఖరీ?
♦ ఐదు నెలల తర్వాత పనులు నిలిపివేసి
♦ కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు
కలెక్టర్ అనుమతి వచ్చాక పబ్లిక్ హియరింగ్: నర్సింగరావు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా.. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా.. చివరకు భూనిర్వాసిత కుటుంబాల యువతకు ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వకుండా.. యుద్ధప్రాతిపదికన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు చేయడం టీఎస్ జెన్‌కో పనితీరును ప్రశ్నిస్తోంది. పర్యావరణ ప్రేమికులకు జెన్‌కో తీరు ఆగ్రహం తెప్పిస్తోంది. తీరుబడిగా ఈ పనులన్నీ చేస్తామనే జెన్‌కో వ్యవహారశైలిపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. ముందుచూపు లేని జెన్‌కో తీరును కేంద్రం ప్రశ్నించింది. - మణుగూరు
మణుగూరు: మణుగూరు-పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విషయంలో టీఎస్ జెన్‌కో ముందుచూపు లేకుండా వ్యవహరించిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యంత కీలకమైన పర్యావరణానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ఏమాత్రం ఆలోచన చేయలేదు. గత సెప్టెంబరు నుంచి ఐదునెలల పాటు ప్లాంట్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేసినా.. పర్యావరణ అనుమతులపై ఆలోచన చేయలేదు. పర్యావరణ అనుమతి తీసుకోకపోవడంపై కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చేతులు కాలిన తరువాత...
చేతులు కాలిన తరువాత...అన్న చందంగా జెన్‌కో వ్యవహరిస్తోంది. పర్యావరణ అనుమతులు తీసుకుని, భూనిర్వాసితులకు ప్యాకేజీలు, ఉద్యోగ హామీ పత్రాలు ఇచ్చాక పనులు ప్రారంభించాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, నిబంధనలు తమకేమీ వర్తించవన్నట్లుగా ముందుకు వెళ్లారు. ముమ్మరంగా పనులు చేశారు. ఈ క్రమంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులు నిలిపేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పనులకు బ్రేక్ పడింది. సబ్ కాంట్రాక్టర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఇన్ని పరిణామాల తరువాత చివరకు మొదట చేయాల్సిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన దరఖాస్తును జెన్‌కో ఈ నెలలో కాలుష్య నియంత్రణ మండలికి పంపింది.
కేంద్రానికి పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఫైర్...
భద్రాద్రి ప్లాంట్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న పేరంటాల చెరువు, దమ్మక్కపేట సమీపంలో ప్లాంట్ మధ్య నుంచి వెళ్లే పొన్నవాగుపై పూర్తి వివరాలు ఇవ్వలేదని, గోదావరి, యాష్‌పాండ్, బఫర్‌జోన్, బొగ్గు కేటాయింపులు తదితర వివరాలు ఏమాత్రం ఇవ్వలేదు. తమ శాస్త్రవేత్త కరుపయ్య ద్వారా గత నెల 9వ తేదీన తనిఖీ చేయించి అన్ని వివరాలు తెలుసుకున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఫైర్ అయింది. పైగా యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో ఉపేక్షించలేదు.. టీఎస్‌జెన్‌కోపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అన్ని నిబంధనలు పాటిస్తేనే
అనుమతులు...
గోదావరికి సమీపంలో అదీ గిరిజన ప్రాంతం కావడంతో అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. సమీపంలో ఉన్న పేరంటాల చెరువు, గోదావరిలోకి హానికర వ్యర్థాలు వదలకుండా, ప్లాంట్ మధ్యలో ఉన్న పొన్నవాగు ప్రవాహం నిలిచిపోకుండా, అందులో నీరు వాడుకోకుండా, అడ్డంకి కలిగించకుండా, చుట్టూ 500 మీటర్లు బఫర్ జోన్ ఏర్పాటు చేసి అడవులు పెంచేలా, గిరిజన సంక్షేమానికి కార్పస్ ఫండ్, నిర్వాసితులకు ప్యాకేజీలు, పునరావాసం తదితరాల విషయంలో సంతృప్తికర చర్యలు తీసుకునేలా చేస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
కలెక్టర్ ఆదేశాల మేరకు పబ్లిక్ హియరింగ్..
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులపై ఐదునెలలుగా కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం ఇవ్వలేదు. పర్యావరణ అనుమతుల కోసం మణుగూరు-పినపాక మండలాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం కోసం ఈ నెలలోనే జెన్‌కో వారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కలెక్టరు అనుమతితో తేదీ నిర్ణయించి పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తాం.
- నర్సింగరావు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, కొత్తగూడెం