
మతగ్రంథం తగలబెట్టారన్న పుకార్లతో మొదలైన ఘర్షణలు
ఘర్షణల్లో 20 మందికి గాయాలు
15 మంది అరెస్ట్, నిషేధాజ్ఞలు అమలు
నాగ్‌పూర్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేస్తామనే విశ్వహిందూ పరిషత్ చేసిన డిమాండ్లతో మొదలైన ఉద్రిక్తతలు చివరకు అల్లర్లకు దారితీశాయి. ఇందుకు సెంట్రల్ నాగ్‌పూర్ ప్రాంతం వేదికైంది. సోమవారం ఒక మతగ్రంథానికి నిప్పుపెట్టారన్న పుకార్లు షికార్లు చేయడంతో ఒక వర్గం ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేయంతో వారిపైనా రాళ్లు రువ్వారు. దీంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు.
నాగ్‌పూర్‌లో రా్ ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం ఉండే మహల్ ప్రాంతంలో ఘర్షణలకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీచేశారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. 15 మందిని అరెస్ట్‌చేశారు. ఘర్షణలు సాయంత్రంకల్లా కోత్వాలీ, గణేష్‌పేట్ ప్రాంతాలకూ పాకాయి. కూబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీసీపీ నికేతన్ కదమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
శుక్రవారీ తలావ్‌రోడ్‌లోని ఛిత్నిశ్ పార్క్ వద్ద ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఇక్కడ పలువాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు నివాస గృహాలపై రాళ్లు రువ్వారు. హింసను విడనాడాలని, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, నాగ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ విజ్ఞప్తిచేశారు. మహల్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్ సభ్యులు ఆందోళన చేపట్టిన తర్వాతే ఉద్రిక్త పరిస్తితి తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.
ఇక్కడ ఒక మతగ్రంథాన్ని తగలబెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది నిజమని నమ్మిన మరో వర్గం సభ్యులు మహల్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగాక పరిస్థితి అదుపుతప్పింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ బలగాలను భారీ ఎత్తున మొహరించారు. పలుచోట్ల నిషేధాజ్ఞలు జారీచేశారు. ఛిత్నిశ్ పార్క్ వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఔరంగజేబు దిష్టిబొమ్మను మాత్రమే దగ్ధం చేశామని బజరంగ్‌దళ్ వర్గాలు స్పష్టంచేశాయి.