
ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజీ
నిమజ్జనోత్సవాల వేళ పరిణామం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ముంబై: గణపతి నిమజ్జనోత్సవ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ముంబై యంత్రాంగాన్ని ఓ బెదిరింపు సందేశం మరింత అప్రమత్తం చేసింది. ‘పాకిస్తాన్ నుంచి మహానగరంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారు. వివిధ ప్రాంతాల్లో 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్‌తో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. శనివారం అనంత్ చతుర్దశి(గణేశ్ నిమజ్జనోత్సవం) నాడు ముంబై నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది.
కనీసం కోటి మంది చనిపోతారు’అని ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం ఫోన్ వాట్సాప్‌కు ‘లష్కర్– ఇ–జిహాదీ’పేరుతో శుక్రవారం ఒక మెసేజీ అందింది. దీంతో, హై అలెర్ట్ ప్రకటించినట్లు ముంబై పోలీస్ విభాగం పేర్కొంది. దీనిని కేవలం బెదిరింపుగానే భావిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ, సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ సందేశాన్ని పంపించిన వ్యక్తి ఎవరో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు.
దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో బందోబస్తును మరింతగా పెంచారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. వదంతులను నమ్మొద్దని, అనుమానాస్పద కదలికల గురించిన సమాచారాన్ని వెంటనే తమకు అందజేయాలని ప్రజలను కోరారు.
శనివారం జరిగే నిమజ్జన ఉత్సవాల బందోబస్తులో 12 మంది అదనపు కమిషనర్లు, 40 మంది డిప్యూటీ కమిషనర్లు, 61 మంది సహాయ కమిషనర్లు సహా 21 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ సంబంధ సమస్యలను ముందుగానే కనిపెట్టి హెచ్చరించేందుకు ఈసారి ముంబై పోలీసు యంత్రాంగం కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. ఇటీవలి కాలంలో ముంబై, థానె పోలీసులకు పలుమార్లు బెదిరింపు సందేశాలు అందడం తెల్సిందే. జూలైలో సైతం ముంబై విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ పోలీసులకు సందేశం అందింది.