RDX
-
ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య థియేటర్లలో కావొచ్చు.. ఓటీటీలో కావొచ్చు సరైన మాస్ మసాలా యాక్షన్ మూవీ రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఓ మలయాళ సూపర్‌హిట్ మూవీ.. ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన 'RDX' ఓ చిన్న సినిమా. కానీ అదే రోజు విడుదలైన దుల్కర్, నివీన్ పౌలీ చిత్రాలని మించి బ్లాక్‌బస్టర్ అయింది. 'ఆర్డీఎక్స్' ప్రత్యేకత ఏంటి? స్టోరీ పరంగా చూస్తే ఇదేం కొత్త కథ కాదు. మాస్, ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్షిప్, లవ్ ఇలా అన్నీ ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా. అయితే తెలిసిన కథే అయినా దర్శకుడి డిఫరెంట్ ప్రెజంటేషన్ మలయాళంలో అందరికీ బాగా నచ్చేసింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత విడుదలకు రెడీ) ఓటీటీ డేట్ ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. సెప్టెంబరు 24న అంటే ఈ ఆదివారం ఓటటీలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మలయాళం మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో మిగతా భాషల్ని జోడించొచ్చని అనిపిస్తుంది. 'RDX' కథేంటి? రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోని వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ల ఫ్రెండ్ గ్జేవియర్ (నీరజ్ మాధవ్). చర్చి ఫెస్టివల్లో తన తండ్రిపై చేయి చేసుకున్నాడని ఓ అల్లరి ముకని డోని చితకబాదుతాడు. ఆ తర్వాత అదే రౌడీ గ్యాంగ్.. డోని ఇంటికొచ్చి చిన్న పిల్లలని వదలకుండా ఫ్యామిలీ మొత్తంపై దాడి చేస్తారు. అసలు ఈ దాడి చేసిన గ్యాంగ్ ఎవరు? వాళ్లకు డోని కుటుంబంపై పగ ఎందుకు? మరి డోని, రాబర్ట్, గ్జేవియర్.. గ్యాంగ్‌పై పగ ఎలా తీర్చుకున్నారనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
శ్రీనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్‌గఢ్ ప్రాంతంలో సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్డీఎక్స్, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలతో పాటు కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు.. అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు! -
పంజాబ్‌లో పాక్ డ్రోన్ కలకలం
అమృత్సర్: పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పంజాబ్‌లో జారవిడిచిన 4 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్‌పైకి గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని పంజ్‌గ్రైన్ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు. వీటిలో డ్రగ్స్ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్జైన్, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్ కార్డ్, స్టీల్ కంటైనర్, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్ తిరిగి పాక్‌లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్ భారత్‌కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్ ఈఈజెడ్‌లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. -
‘పోచంపల్లి ఇకత్ మేళా’ షురూ
-
దాడిలో 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్
న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిలో జైషే మొహమ్మద్ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ దాదాపు 80 కిలోల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ను వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఐఈడీని ఈ దాడి కోసం వాడుంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. కశ్మీర్లో ఇప్పటివరకూ కాన్వాయ్‌ల రాకపోకల విషయంలో పాటిస్తున్న ప్రామాణిక విధాన ప్రక్రియ(ఎస్వోపీ)ను తాజా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై 272వ మైలురాయి వద్ద ఆదిల్ తన కారుతో సీఆర్పీఎఫ్ బస్సు ఎడమవైపు ఢీకొట్టించి తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన హెచ్ఆర్ 49 ఎఫ్ 0637 బస్సు తునాతునకలు అయ్యిందన్నారు. కాన్వాయ్ వరుసలో ఐదో బస్సును ఉగ్రవాది ఆదిల్ లక్ష్యంగా చేసుకున్నాడన్నారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లో ప్రమాద సమయంలో మొత్తం 16 బుల్లెట్ ప్రూఫ్ బంకర్ వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 4న 2,871 మంది జవాన్లు 91 వాహనాల్లో ఇదే రోడ్డుపై శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారనీ, అప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో యూపీకి చెందిన 12 మంది జవాన్లు అమరులు కాగా, రాజస్తాన్(5), పంజాబ్(4), పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, బిహార్ నుంచి ఇద్దరు చొప్పున, అస్సాం, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రాలకు చెందిన ఒక్కో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. -
సాధారణ రసాయనాలతోనే భారీ విధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్ను ఉగ్రమూకలు వాడలేదని భావిస్తున్నారు. ఈ దాడిలో ఆర్డీఎక్స్‌కు బదులు ఎరువుల తయారీకి ఉపయోగించే సాధారణ రసాయనాలను ఉపయోగించి భారీ పేలుడుకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెబుతున్నారు. ఘటనా స్ధలం నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించిన మీదట ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు వాడిన రసాయనాలపై వివరిస్తూ ఉగ్రవాదులు ఈ భీకర దాడిలో ఆర్డీఎక్స్ వాడలేదని చెప్పుకొచ్చారు. భారీ పేలుడు కోసం ఎరువుల తయారీకి ఉపయోగించే రసాయనాలతో పాటు ఇనుప ముక్కలు, ఇతర పదార్ధాలను కలిపి ధ్వంస రచన సాగించారని ప్రాధమిక ఆధారాలతో వెల్లడవుతోందని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్డీఎక్స్ వంటి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం వాడకుండా ఇంతటి భీకర దాడికి ఉగ్రమూకలు పాల్పడటం విస్తుగొలుపుతోంది. భద్రతా దళాల కన్నుగప్పి స్ధానిక మార్కెట్లో సులభంగా లభించే రసాయనాలతోనే భారీ పేలుడుకు అవసరమైన పరికరాన్ని ఉగ్రవాదులు రూపొందించారని నిపుణులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి తెగబడిన జైషే ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు.పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులో ఆర్డీఎక్స్ కలకలం
– ప్రయాణీకుల నుంచి ఐదు బాటిళ్లు స్వాధీనం – నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించిన అర్బన్ ఎస్పీ రేణిగుంటః రేణిగుంట ఎయిర్‌పోర్టులో నిషేధిత ద్రవాన్ని చిన్న బాటిళ్లలో తీసుకెళుతూ నలుగురు వ్యక్తులు పట్టుబడిన సంఘటన బుధవారం సంచలనం రేపింది. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఎయిర్‌పోర్టుకు చేరుకుని నాలుగు గంటలపాటు దీనిపై విచారణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన హజర్ రహీస్ అహ్మద్(55), హజర్ అన్వర్ అహ్మద్(50), హజర్ సత్తార్ అహ్మద్(35), మహ్మద్ నౌషద్(18)లు కోడూరులో గత కొన్ని నెలలుగా బొప్పాయి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. వీరితోపాటు సుమారు 60మంది ఢిల్లీకి చెందిన వ్యాపారస్థులు వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో తిష్టవేసి బొప్పాయి రైతులనుంచి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీకి ప్రతిరోజు 50లారీలలో తరలిస్తుంటారు. ఈ సీజన్లో కోడూరు ప్రాంతంలో బొప్పాయి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో వీరు కోడూరులో బాడుగకు ఇల్లు తీసుకుని వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. బక్రీద్ నేపథ్యంలో వీరు నలుగురు ఢిల్లీకి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లే విధంగా ప్రయాణాన్ని రూపొందించుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు సీఐఎఫ్ఎస్ అధికారులు వారి బ్యాగులను తనిఖీ చేయగా అందులో ‘హజీమెక్కా’ పేరిట సింగపూర్‌లో తయారైన పెయిన్‌కిల్లర్ బాటిళ్లను నాలుగు ఉన్నట్లు గుర్తించారు. బాటిల్‌పై సేవర్ సైనస్, మైగ్రేన్ అని ఉంది. ఈ బాటిల్‌పై ఉర్దూ, ఇంగ్లీషు పదాలు ముద్రించబడి ఉన్నాయి. ఈ బాటిల్ రేటు రూ.250 ఉన్నట్లు రాసి ఉంది. బాటిళ్లలో ఉన్న ద్రావకంలో మండే స్వభావం ఉన్న ఉత్ప్రేరకాలు ఉన్నట్లు అనుమానించిన సీఐఎఫ్ఎస్ సిబ్బంది పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, రూరల్ సీఐ సాయినాథ్ హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఓ గదిలో అనుమానితులు నలుగురిని విచారించారు. కోడూరు మసీదు సమీపంలోని ఓ దుకాణంలో నొప్పి నివారణ తైలం పేరిట అమ్ముతుండటంతో తాము తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. సింగపూర్‌కు చెందిన ఈ ఉత్పత్తులను కోడూరులో విక్రయించేందుకు అనుమతులు తీసుకున్నారా...? అసలు ఈ బాటిళ్లలో మండే స్వభావం ఉండే రసాయన పదార్థం ఉందా అనే కోణంలో తెలుసుకునేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కోడూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ బాటిళ్లను పోలిన బాటిళ్లు కోడూరులోని ఓ దుకాణంలో విక్రయిస్తున్నట్లు నిర్దారించుకున్న అక్కడి పోలీసు అధికారులు దుకాణ యజమానికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు పంపుతున్నాం విచారణ అనంతరం ఎయిర్‌పోర్టు బయట తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఐదు బాటిళ్లను హైదరాబాద్ ఎఫ్ఎస్ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. బాటిళ్ల ద్రావకంలో మండే స్వభావం కలిగిన రసాయనం మిళితమై ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని చెప్పారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చే వరకు వీరు తమ అదుపులోనే ఉంటారని స్పష్టం చేశారు. సింగపూర్‌కు చెందిన ఉత్పత్తులను కోడూరులో ఎలా విక్రయిస్తున్నారనే విషయంపై కూడా లోతుగా దర్యాప్తు చేపడుతామని ఆమె పేర్కొన్నారు. -
అస్సాంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
అస్పాంలోని కమలాపుర్ పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి రాకేష్ రోషన్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని కొన్ని ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ క్రమంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాకేష్ రోషన్ చెప్పారు. రెండు కిలోల టీఎన్టీ, ఐదు కేజీల ఆర్డీఎక్స్, 20 కేజీల అమ్మెనియం నైట్రేట్, 64 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్ని సీజ్ చేసినట్లు ఉన్నతాధికారి రోషన్ వివరించారు.