రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు స్వాధీనం చేసుకున్న తైలం బాటిళ్లు
ఎయిర్‌పోర్టులో ఆర్‌డీఎక్స్ కలకలం
Published Thu, Sep 8 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
– ప్రయాణీకుల నుంచి ఐదు బాటిళ్లు స్వాధీనం
– నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించిన అర్బన్ ఎస్పీ
రేణిగుంటః రేణిగుంట ఎయిర్‌పోర్టులో నిషేధిత ద్రవాన్ని చిన్న బాటిళ్లలో తీసుకెళుతూ నలుగురు వ్యక్తులు పట్టుబడిన సంఘటన బుధవారం సంచలనం రేపింది. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఎయిర్‌పోర్టుకు చేరుకుని నాలుగు గంటలపాటు దీనిపై విచారణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన హజర్ రహీస్ అహ్మద్(55), హజర్ అన్వర్ అహ్మద్(50), హజర్ సత్తార్ అహ్మద్(35), మహ్మద్ నౌషద్(18)లు కోడూరులో గత కొన్ని నెలలుగా బొప్పాయి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. వీరితోపాటు సుమారు 60మంది ఢిల్లీకి చెందిన వ్యాపారస్థులు వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో తిష్టవేసి బొప్పాయి రైతులనుంచి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీకి ప్రతిరోజు 50లారీలలో తరలిస్తుంటారు. ఈ సీజన్‌లో కోడూరు ప్రాంతంలో బొప్పాయి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో వీరు కోడూరులో బాడుగకు ఇల్లు తీసుకుని వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. బక్రీద్ నేపథ్యంలో వీరు నలుగురు ఢిల్లీకి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లే విధంగా ప్రయాణాన్ని రూపొందించుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు సీఐఎఫ్‌ఎస్ అధికారులు వారి బ్యాగులను తనిఖీ చేయగా అందులో ‘హజీమెక్కా’ పేరిట సింగపూర్‌లో తయారైన పెయిన్‌కిల్లర్ బాటిళ్లను నాలుగు ఉన్నట్లు గుర్తించారు. బాటిల్‌పై సేవర్ సైనస్, మైగ్రేన్ అని ఉంది. ఈ బాటిల్‌పై ఉర్దూ, ఇంగ్లీషు పదాలు ముద్రించబడి ఉన్నాయి. ఈ బాటిల్ రేటు రూ.250 ఉన్నట్లు రాసి ఉంది. బాటిళ్లలో ఉన్న ద్రావకంలో మండే స్వభావం ఉన్న ఉత్ప్రేరకాలు ఉన్నట్లు అనుమానించిన సీఐఎఫ్‌ఎస్ సిబ్బంది పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, రేణిగుంట డీఎస్‌పీ నంజుండప్ప, రూరల్ సీఐ సాయినాథ్ హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఓ గదిలో అనుమానితులు నలుగురిని విచారించారు. కోడూరు మసీదు సమీపంలోని ఓ దుకాణంలో నొప్పి నివారణ తైలం పేరిట అమ్ముతుండటంతో తాము తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. సింగపూర్‌కు చెందిన ఈ ఉత్పత్తులను కోడూరులో విక్రయించేందుకు అనుమతులు తీసుకున్నారా...? అసలు ఈ బాటిళ్లలో మండే స్వభావం ఉండే రసాయన పదార్థం ఉందా అనే కోణంలో తెలుసుకునేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ వైఎస్సార్ కడప జిల్లా ఎస్‌పీతో ఫోన్లో మాట్లాడి కోడూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ బాటిళ్లను పోలిన బాటిళ్లు కోడూరులోని ఓ దుకాణంలో విక్రయిస్తున్నట్లు నిర్దారించుకున్న అక్కడి పోలీసు అధికారులు దుకాణ యజమానికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌కు పంపుతున్నాం
విచారణ అనంతరం ఎయిర్‌పోర్టు బయట తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఐదు బాటిళ్లను హైదరాబాద్ ఎఫ్‌ఎస్ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. బాటిళ్ల ద్రావకంలో మండే స్వభావం కలిగిన రసాయనం మిళితమై ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని చెప్పారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చే వరకు వీరు తమ అదుపులోనే ఉంటారని స్పష్టం చేశారు. సింగపూర్‌కు చెందిన ఉత్పత్తులను కోడూరులో ఎలా విక్రయిస్తున్నారనే విషయంపై కూడా లోతుగా దర్యాప్తు చేపడుతామని ఆమె పేర్కొన్నారు.
Advertisement