తాజాగా శాంటా క్రూజ్‌లో గరిష్టంగా 34.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
వెల్లడించిన వాతావరణ శాఖ
పిల్లలు, పెద్దవయసు వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు
జనవరిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30–34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనవరిలో కొన్ని రోజులపాటు వర్షపాతం నమోదైనప్పటికీ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీని వల్ల ముంబై వాసులు విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నారు. జనవరిలో ముంబైలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 34 డిగ్రీల సెల్సియస్‌ను దాటి వెళ్లింది. ముంబై శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం శాంటా క్రూజ్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలుగా నమోదైంది.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పగటి వేళ వేడి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా ముంబై ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేడి తీవ్రత పెరగడంతో బయటికి వెళ్లే ప్రజలు సౌకర్యవంతంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని తేమగా ఉంచుకునేందుకు పుష్కలమైన నీరు తాగాలని, పొడి వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎండ వేడికి అధికంగా గురికాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవడం, గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం, ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment