Aurangzeb
-
రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజస్తాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చడమే కాక.. కాంగ్రెస్ సామ్రాజ్యం అతి త్వరలో అంతం కానుందని జోస్యం చెప్పారు. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.. అలానే రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు చివరి అధ్యక్షుడన్నారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ‘రాహుల్ గాంధీ తనును తాను హిందువుగా చెప్పుకుంటూ.. జంధ్యం ధరిస్తానని అంటున్నారు. మరి ఆయన చేత జంధ్యం ధరింపజేసిన బ్రాహ్మణుడి పేరు చెప్పగలరా’ అంటూ అహుజా ప్రశ్నించారు. త్వరలో రాజస్తాన్‌లో జరగబోయే రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అహుజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆవులను దొంగతనం చేసే వారిని ఉగ్రవాదులంటూ గతంలో విమర్శించారు. -
సహచరుడి హత్యకు ప్రతీకారం కోసం...
జమ్ము: శ్రీనగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని మెహందర్ పరిధిలోని సలానీ గ్రామం. సుమారు 50 మంది యువకులు సౌదీలో తమ ఉద్యోగాలను వదిలేసుకుని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. అందుకు కారణం తమ గ్రామంలోని ఓ యువకుడి హత్యతో వారంతా రగిలిపోతుండటమే. రెండు నెలల క్రితం జమ్ము కశ్మీర్లో దారుణ హత్యకు గురైన రైఫిల్ మన్ జౌరంగజేబు ఉదంతం వారందరినీ కదిలించింది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ యువకులంతా పోలీస్, ఆర్మీ ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. (ఇంకెంతకాలం ఇలా...?) ‘జౌరంగజేబు మరణ వార్త వినగానే నేను ఇండియాకు బయలుదేరా. నాతోపాటు మరో 50 మంది యువకులు స్వచ్ఛందంగా తమ సహచరుడి కోసం ఇక్కడికి వచ్చారు. వారంతా అక్కడ మంచి ఆదాయం సంపాదించేవారే. కానీ, తమ గ్రామస్థుడి క్రూర హత్యపై వాళ్లు రగిలిపోతున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఇక్కడికి వచ్చారు. ఎలాగైనా ఉగ్రవాదులపై పగ తీర్చుకుంటామని వారంతా శపథం పూనారు. ఆర్మీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు’ అని ఔరంగజేబు బంధువు మహ్మద్ కిరామత్ చెబుతున్నారు. ఔరంగజేబు మరణం తర్వాత మరో ఇద్దరు అధికారులను.. అదే రీతిలో ఉగ్రవాదులు అపహరించి పొట్టనబెట్టుకున్నారు. అంతేకాదు అధికారులను రాజీనామాలు చేయాలంటూ బెదరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత నెలలో దక్షిణ కశ్మీర్లో ఓ అధికారిని కిడ్నాప్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా చేయించారు. అయితే బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని ఓ అధికారి తెలిపారు. ‘దేశం కోసం మా సోదరులు అమరులౌతున్నారు. అలాంటిది మేం ఎందుకు వెనక్కి తగ్గుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి ఉదంతాలకు తొణికేది లేదని, తమ పిల్లలను సైన్యంలోకి పంపి తీరతామని ప్రతిన బూనుతున్నారు. (ఎంత దారుణంగా చంపారంటే...) -
ఘాతుకం: బుల్లెట్లతో తూట్లు పొడిచారు
శరీరం నిండా బుల్లెట్లతో జల్లెడగా మారిన దేహం. రంజాన్‌కు కొద్ది గంటల ముందు అపహరణకు గురైన సైనికుడు.. కొన్ని గంటల సస్పెన్స్ తర్వాత మృత దేహంగా కనిపించాడు. కశ్మీర్లో సంచలనం సృష్టించిన జవాన్ ఔరంగజేబ్ అదృశ్యం.. చివరకు విషాదాంతంగా మారింది. శ్రీనగర్: ఫూంచ్‌కు చెందిన ఔరంగజేబ్.. సోఫియాన్‌లోని షాదిమార్గ్ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ 44వ దళంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని అడ్డగించిన కొందరు తమ వెంట తీసుకెళ్లారు. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరకు శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో అతని మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది. బుల్లెట్లు దింపారు... అతని తల, మెడ భాగంలో మొత్తం బుల్లెట్లతో దింపారు. శరీరం మొత్తం జల్లెడగా మారిపోయింది. ముఖం మొత్తం చిధ్రమైపోయింది’ అని అధికారి ఒకరు. ఇక ఘటనపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సందించారు.‘ఇంతటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు. ఔరంగజేబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యం ఆగ్రహం.. ఔరంగజేబ్ మృతి పట్ల భారత సైన్యం రగిలిపోతోంది. రంజాన్ నేపథ్యంలో గత నెలరోజులుగా సరిహద్దులో భారత సైన్యం సంయమనం పాటిస్తూ వస్తోంది. అయితే పాక్ సైన్యం, ఉగ్రవాదులు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత్ అల్టిమేటం ప్రకటించింది. సహనం నశిస్తేనే ఎదరు దాడులు తప్పవని హెచ్చరించింది. గత నెల రోజుల్లో ఇద్దరు ఉగ్రవాద నాయకులను సైన్యం ఎన్కౌంటర్లలో మట్టుబెట్టింది. వారిలో ఏ++ కేటగిరీ ఉగ్రవాది సమీర్ అహ్మద్ భట్ అలియాస్ సమీర్ టైగర్ కూడా ఉన్నాడు. ఔరంగజేబ్ ఆ ఆపరేషన్‌లో పాలుపంచుకోవటం గమనార్హం. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ ఔరంగజేబును కిరాతకంగా పొట్టనబెట్టుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరొకరి మృతి... బందిపొర జిల్లాలో ఈ ఉదయం మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రతిగా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ఓ సైనికాధికారి గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. -
ఈ పావలా చాలు
గురువు ముల్లా అహ్మద్ జీవన్ తన శిష్యుడైన మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో.. ‘మీరు ఇచ్చిన పావలా బిళ్ల ఎంతో శుభప్రదమయినదిగా రూపుదాల్చింది. నేను దానితో పత్తిగింజలు కొని పత్తి పండించాను. దైవం ఎంతో బర్కత్ (శుభాన్ని) ఇచ్చాడు. కొన్నేళ్లలో వందలు, లక్షలుగా మారాయి’’ అని చెప్పాడు. ఔరంగజేబు అది విని చాలా సంతోషించాడు.‘‘మీరు అనుమతిస్తే ఆ పావలా బిళ్ల గాథ వినిపిస్తాను’’ అని అన్నారు ఔరంగజేబు. ‘‘తప్పక వినిపించండి’’ అన్నారు ముల్లా జీవన్. అప్పుడు ఔరంగజేబు తన నౌకరుకు, ‘చాందినీచౌక్‌లోని సేఠ్ ఉత్తమ్‌చంద్ ని ఫలానా తారీఖు ఖాతాతో సహా ప్రవేశపెట్టమని’ పురమాయించాడు. సేఠ్ ఉత్తమ్‌చంద్ వచ్చి ఖాతా తెరచి వివరించసాగాడు. ముల్లా జీవన్, చక్రవర్తి ఇద్దరూ చెవులొగ్గి వింటున్నారు. ఓ చోట సేఠ్ ఆగిపోయాడు. అక్కడ పావలా అని రాసి ఉంది కాని, దాని వివరాలేమీ లేవు. ఔరంగజేబు మృదువుగా అడిగాడు, ఆ పావలా ఏమయింది? అని. ‘అనుమతిస్తే దాని బాధాకరమయిన గాథ వినిపిస్తా’’నన్నాడు సేఠ్. అనుమతించారు. ‘‘ఓ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది. నా ఇల్లు కూడా కురవడం మొదలయింది. నా పద్దు పుస్తకాలన్నీ అందులోనే ఉన్నాయి. నేనెంత ప్రయత్నించినా ఇల్లు కురవడాన్ని ఆపలేకపోయాను. బయటకు తొంగిచూశాను. ఓ వ్యక్తి వీధి లాంతరు కింద నిలబడి కనిపించాడు. నేనతన్ని ‘సాయం చేస్తావా?’ అని అడిగాను. అతను చేస్తానని అన్నాడు. నాలుగయిదు గంటలపాటు కష్టపడి ఇంటి మీది పెంకులను సర్ది, అతి కష్టం మీద వాన నీరు లోపల కురవకుండా ఆపడంతోపాటు లోనికి వచ్చి సామానంతా సర్దాడు కూడా. అంతలో తెల్లవారు అజాన్ అయింది. అతను సెలవు తీసుకున్నాడు. నేను అతనికి కూలీ ఇవ్వాలనుకున్నాను. జేబులో పావలా తప్ప ఏమీ లేదు. అతనితో ‘బాబూ! ప్రస్తుతం ఈ పావలా తీసుకుని పొద్దున నా షాపుకు వస్తే పూర్తి కూలీ ఇస్తా’నని అన్నాను. అతను, ‘నాకు ఈ పావలా చాలు, నేను మళ్లీ రాలేను’ అని చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లే ముందు నేనూ, నా భార్య ఎంతో ప్రాధేయపడ్డాము పొద్దున రమ్మని. కాని అతను రాలేదు.. అని ఇదంతా వివరించి ఉత్తమ్‌చంద్ వెళ్లిపోయాడు. చక్రవర్తి ముల్లా గారితో చెప్పాడు, ‘ఆ చవన్నీ’ (పావలా బిళ్ల) అదే!’ అని!!‘ నేను ప్రతిరోజు మాదిరిగానే మారువేషంలో ప్రజల బాగోగులు విచారించడానికి వెళ్లగా ఇది సంభవించింది అని చెప్పాడు ఔరంగజేబు చక్రవర్తి. (ఆ పావలానే ఔరంగజేబుకు తన గురువుకు ఇచ్చారు). -
ఔరంగజేబు పాలన వద్దు!
ధర్మపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికను మొఘల్ పాలకుల వారసత్వ పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. మాకు ఔరంగజేబు పాలన వద్దంటూ పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తోందని తప్పుపట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి బురదలో కూరుకుపోయాయని.. అయితే తన నేతృత్వంలో గుజరాత్లో, కేంద్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ‘బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయడానికి రాజకీయ పార్టీలు 17 సార్లు ఆలోచిస్తాయి. అలాంటిది కాంగ్రెస్ పార్టీ మాత్రం సిగ్గు వదిలేసింది. అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ.. దివాలాకోరుతనాన్ని ప్రదర్శిస్తోంది’ అని వల్సాద్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలు, వారి భవిష్యత్తు నాయకుల శక్తి సామర్థ్యాలు ఈ నిర్ణయంతోనే మనకు అర్థమవుతున్నాయని ఆయన ఎద్దేవాచేశారు. ‘మొఘలుల పాలనలో ఎన్నికలు జరిగాయా? జహంగీర్ తర్వాత షాజహాన్ వచ్చాడు. అప్పుడు ఎన్నికలు జరిగాయా? షాజహాన్ తర్వాత ఔరంగజేబు అనేది అందరికీ తెలుసు’ అని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మోదీ విమర్శలు చేశారు. ‘ఏక కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా..? మాకు ఈ ఔరంగజేబు పాలన వద్దు.. మాకు దేశమే ముఖ్యం. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే మా హైకమాండ్’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘గుజరాత్లో బీజేపీని ఓడించగలిగితే.. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు తమ మాట వింటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది.అయితే అందుకు మీరు అనుమతిస్తారా? గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని మీరు అడ్డుకుంటారా?’ అని మోదీ ప్రశ్నించగా.. లేదు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ప్రచారంలో రాహుల్ తరచూ దేవాలయాల సందర్శనపై మోదీ విమర్శలు కురిపించారు. ‘ఇంతకుముందు.. లౌకిక వాదులుగా చెప్పుకునేందుకు వారు పోటీ పడేవారు. తాను లౌకిక వాదినని ఒకరు చెబితే, మరొకరు తాను నాలుగు కిలోలు ఎక్కువ లౌకిక వాదినని, మూడో వ్యక్తి ఆరు కిలోల ఎక్కువ లౌకికవాదినని చెప్పుకునేవారు. గుజరాత్ ఎన్నికలకు ముందు ఆ పోటీ ఏమైంది. హిందూ ఓట్ల కోసమే వారు ఆలయాల్ని సందర్శిస్తున్నారని ప్రజలు గ్రహించగలరు’ అని ప్రధాని చెప్పారు. -
రామ మందిరాన్ని కూల్చింది.. ఔరంగజేబు!!
‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో మాజీ ఐఏఎస్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అయోధ్యలో ‘రామ మందిరం’ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. మందిరాన్ని కూల్చివేసింది బాబర్ హయాంలో కాదని, ఔరంగజేబు హయాంలో నేలమట్టం చేశారని ఓ మాజీ ఐపీఎస్ అధికారి తన పుస్తకంలో పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత ఫైళ్లు, కొన్ని పురాతన సంస్కృత గ్రంథాలు, పురావస్తు తవ్వకాలకు సంబంధించిన సమీక్షలను ఉటంకిస్తూ.. ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకంలో 1972 బ్యాచ్, గుజరాత్ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్ ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ‘1528 సంవత్సరంలో బాబర్ హయాంలో రామమందిరాన్ని కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో, ఆయనకు ఫిడాయ్ ఖాన్ గవర్నర్‌గా ఉండగా కూల్చివేత జరిగింది. రామ మందిరాన్ని కూల్చివేయాలని బాబర్ ఆదేశించారనడంలో నిజం లేదు. మందిరాన్ని బాబర్ చూడనేలేదు. 1528లో బాబ్రీ మసీదు నిర్మించారన్న చరిత్రకారుల వాదన కూడా కల్పితమే’ అని పేర్కొన్నారు. ‘అయోధ్య చరిత్రకు సంబంధించిన కొత్త కోణాన్ని రచయిత తెలియజేశారు. సాధారణ విశ్వాసాలకు, పలువురు చరిత్రకారుల అభిప్రాయాలకు విరుద్ధమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు’ అని పుస్తకానికి ముందుమాట రాసిన మాజీ సీజేఐ జస్టిస్ జీబీ పట్నాయక్ పేర్కొన్నారు. -
ఔరంగజేబు హయాంలో నిషేధం
ఔరంగజేబు పాలనకు ముందు భారత్‌లో కేవలం దీపావళికి మాత్రమే కాదు, పెళ్లిళ్లు, పండగలు, ఇతర వేడుకల్లో సైతం బాణసంచా కాల్చే అలవాటు ఉండేది. కులమతాలకు అతీతంగా సంపన్నులు, సామాన్యులు యథాశక్తి బాణసంచా కాల్చి ఆనందించేవారు. బీజపూర్ పాలకుడు అదిల్ షా 1609లో తన కూతురి పెళ్లివేడుకల సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్పించాడు. అప్పట్లోనే ఆ బాణసంచా విలువ రూ.80 వేలు అంటే, ఏ రీతిలో బాణసంచా కాల్పులు జరిగాయో ఊహించుకోవాల్సిందే! ఔరంగజేబు సోదరుడు దారా షికో పెళ్లి వేడుకల్లోనూ ఇలాగే భారీస్థాయిలో బాణసంచా కాల్పులు జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన పెయింటింగ్ ఇప్పటికీ సజీవంగా ఉంది. సోదరుడిని అడ్డుతొలగించుకున్న ఔరంగజేబు 1658లో అధికారానికి వచ్చాడు. కొంతకాలం దీపావళి వేడుకలను అతగాడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ వేడుకల్లో బాణసంచా కాల్చడం ఎందుకో అతడికి హిందూమతానికి మాత్రమే సంబంధించిన కార్యక్రమంగా అనిపించింది. ఇక అంతే... దీపావళి రోజున బాణసంచా కాల్చనే కాల్చరాదంటూ 1667లో హుకుం జారీ చేశాడు. అప్పటి నుంచి అతడి పాలన ముగిసేంత వరకు... అంటే, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జనాలు బాణసంచా లేకుండానే దీపావళి జరుపుకున్నారు. - కూర్పు: పన్యాల జగన్నాథ దాసు -
కుస్తీమే సవాల్
అదో విశాలమైన మైదానం... కొదమ సింహాల్లా కొందరు యోధులు పరస్పరం కలబడుతున్నారు. అలా అందర్నీ ఓడించిన ఓ వస్తాదు.. దూరంగా సింహాసనంపై కూర్చుని ఆ పోరును రెప్ప వాల్చకుండా వీక్షిస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సలామ్ చేశాడు... ఆయన లేచి అతని మెడలో ఓ పతకం వేసి కోటకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ యోధుడు ఔరంగజేబు సైన్యంలో కీలక పదవి పొందాడు. ►నేటి రెజ్లింగ్‌కు ప్రాణం పోసిన క్రీడ ►ఔరంగజేబు ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో పోటీలు ►నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం షహర్‌కీ షాన్ గౌరీభట్ల నరసింహమూర్తి ఆ పోరు సాగిన మైదానం ప్రస్తుత ధూల్‌పేట ప్రాంతంలో ఉంది. పోటీలను వీక్షించిన వ్యక్తి ఖ్వాజా అబిద్ సిద్దిఖీ. నాటి మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన ఔరంగజేబుకు చీఫ్ కమాండర్. గోల్కొండ కోటను మొఘల్ పరం చేయటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. ఆ రోజు అక్కడ జరిగిన కుస్తీ పోటీలు సాధారణంగానో, సరదాగానో జరిగినవి కావు. యుద్ధ విన్యాసాల్లో ఆరితేరిన మెరికల్లాంటి యోధులను సైన్యంలో చేర్చుకునే క్రమంలో ఔరంగజేబు నిర్వహించిన పోటీలవి. ఇది చరిత్ర ! రెజ్లింగ్‌లో రైజింగ్.. 2014 గ్లాస్గో కామన్వెల్త్ పోటీల్లో మన దేశం పరువు నిలిపిన క్రీడ రెజ్లింగ్. ఆ పోటీల్లో మనం 64 పతకాలు సాధిస్తే.. రెజ్లింగ్‌కు వచ్చినవి 14. వాటిల్లోనూ బంగారు పతకాలు ఐదు. మిగతా క్రీడల్లో తడబడే మన దేశం రెజ్లింగ్‌లో మాత్రం గట్టిపోటీ ఇస్తూ వస్తోంది. అందుకు మన చారిత్రక నేపథ్యమే కారణం. ఇప్పుడు రెజ్లింగ్‌గా పిలుచుకుంటున్న క్రీడే నాడు కుస్తీగా విలసి ల్లింది. మన దేశంలో కుస్తీ అనగానే గుర్తొచ్చే నగరం హైదరాబాద్. రాఖీపౌర్ణమి, నాగ పంచమి రోజుల్లో పాతబస్తీలోని ధూల్‌పేట, మంగళ్హాట్లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతుంటాయి. మల్లయోధులు ఉగ్ర సింహాల్లా తలపడుతూ కనిపిస్తారు. అదే కుస్తీ.. పోటీపడేవారే మల్లయోధులు. చందమామ, బాలమిత్రల్లోని చారిత్రక గాథలు చదువుతున్నప్పుడు.. దేశాటనకు వచ్చే యోధులు తమను ఓడించే మొనగాళ్లున్నారా అంటూ సవాల్ విసరటం, వారిని ఓడించలేక ఒక్కొక్కరుగా చతికిలపడుతుంటే అవమానంతో రాజు తల దించుకోవటం, ఇంతలో ఓ వీరుడొచ్చి మల్లయోధుడిని ఓడించి రాజ్యం పరువు నిలపటం.. లాంటి కథలు సహజమే. కానీ ఆ కుస్తీ పోటీల్లోని పౌరుషం కొన్ని ఇలాకాల్లో నేటికీ కన్పిస్తుంది. అలాంటిదే ధూల్‌పేట. సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఔరంగజేబు దక్కన్ ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దఎత్తున సైనిక పటాలం వచ్చి చేరింది. అందులోని సైనికులు అసాధారణ ప్రతిభాపాటవాలను సొంతం చేసుకున్న వారే. తన సైన్యం ఏ దశలోనూ వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతో మెరికల్లాంటి యువకులను ఔరంగజేబు సిద్ధం చేసుకున్నారు. అలాంటి వారిలో నేటి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన లోధీ సామాజిక వర్గానికి చెందినవారూ ఉన్నారు. వీరు యుద్ధవిద్యలో ఆరితేరిన వారు. ఇక మల్లయుద్ధమంటే ప్రాణం. నేటి ధూల్‌పేట ప్రాంతంలో వీరి ఆవాసం ఉండేది. తరచూ మల్లయుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సాధారణ రోజుల్లోనూ అలరించేవారు. ఔరంగజేబు పతనమయ్యాక ఈ ప్రాంతం అసఫ్‌జాహీల పరిధిలోకి చేరింది. క్రీడలు, కళలకు పెద్దపీట వేసి ప్రోత్సహించిన అసఫ్జాహీలు లోధీల మల్లయుద్ధ విన్యాసాలకు ముగ్దులయ్యారు. క్రమంగా వారి నైపుణ్యం ఓ క్రీడగా మారిపోయింది. అసఫ్‌జాహీ రాజ కుటుంబీకులు, ఆస్థాన ప్రతినిధుల కుటుంబసభ్యులు క్రమంగా మల్లయుద్ధ విన్యాసాలను చూసేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ప్రత్యేక సందర్భాల్లో కుస్తీ పోటీలు నిర్వహించే పద్ధతి నగరంలో ఆరంభం అయింది. ఇందుకోసం దంగల్(కుస్తీ ప్రాంగణం)లు వెలిశాయి. పోటీల్లో పాల్గొనేవారికి నజరానాలు ఇస్తుండటంతో బాగా ప్రాచుర్యం పొందింది. అలా ప్రారంభమైన పోటీలు క్రమంగా ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించటం ఆనవాయితీగా మారింది. లోధీలు ఉత్సాహంగా జరుపుకొనే నాగపంచమి, రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా కుస్తీ పోటీలు మారాయి. వందల సంవత్సరాల క్రితం మొగ్గ తొడిగిన ఈ విధానం క్రమంగా వికసించింది. హైదరాబాద్ కుస్తీ పోటీల ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది. పోటీలకు వివిధ ప్రాంతాల యోధులు హాజరవటం విజేతలకు బహుమతులు అందజేయడం ఆనవాయితీ అయింది. దీంతో మల్లయోధులను తయారు చేసే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు మొదలయ్యాయి. నాటి యోధుల పేరుతో దంగల్ కమిటీలూ రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికీ ఏటా రెండు సార్లు ఈ పోటీలు కొనసాగుతూనే ఉన్నాయి. కులమతాలకతీతంగా... హిందూ పర్వదినాలను పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నా అందులో పాల్గొనేవారిపై ఎలాంటి ఆంక్షలు కనిపించవు. ఈ పోటీల్లో ముస్లిం యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనటమే దీనికి నిదర్శనం. విజేతలకు గదను, ప్రశంసాపత్రాలను, నగదు పురస్కారాలు అందజేస్తారు -
సత్వం: ఛత్రపతి
మరాఠా వీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. హనం ఏనాడూ కనబరచని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహనం అంతకంతకు నశిస్తోంది. తమ దగ్గర ఒక మామూలు జాగీర్దారుగా పనిచేసినవాడి కొడుకు రోజురోజుకూ విస్తరిస్తున్నాడు. తననే సవాల్ చేస్తున్నాడు! శివాజీ ఎంత శక్తిమంతుడో అంత యుక్తిగలవాడు. ‘వేడివేడి అంబలి మధ్యలో ఆత్రంగా చేయిపెట్టి వేళ్లు కాల్చుకోవడం కాదు; అంచుల వెంబడి చుట్టూతా చల్లబడిన భాగాన్ని తింటూ క్రమంగా మధ్యలోకి రావా’లనే తత్వాన్ని బాగా ఒంటబట్టించుకున్నవాడు. పదహారేళ్ల ప్రాయంలో తండ్రినుంచి వారసత్వంగా చిన్న జాగీరు పొందాడు శివాజీ. అబ్బురపరిచే గెరిల్లా రణనీతిని అనుసరిస్తూ చిన్న చిన్న కోటల్ని జయించుకుంటూ వచ్చాడు. కొద్దిమంది నిప్పుకణికల్లాంటి యోధుల్ని వెంటబెట్టుకెళ్లడం, కోటను వశం చేసుకోవడం! అలా పూణె ప్రాంతం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు. అందుకే, ముందుముందు చరిత్రకారులు ఇలాంటి అభిప్రాయానికి రానున్నారు: మరాఠావీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. 1659లో బీజాపూర్ సుల్తాన్ తరఫున ఇరవై వేల సేనతో వచ్చిన అఫ్జల్ ఖాన్‌ను తెలివిగా తప్పుదోవ పట్టించాడు శివాజీ. బలహీనపడ్డట్టుగా నమ్మించి, ఏమరుపాటుగా ఉన్న శత్రువును అంతమొందించాడు. గుర్రాలనూ, ఆయుధ సంపత్తినీ స్వాధీనం చేసుకున్నాడు. దీంతో తన ఇరవై తొమ్మిదవ ఏట తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు శివాజీ. ఇదే ఔరంగజేబు అసహనానికి కారణం. అందుకే శివాజీని అణచడానికి 1665లో లెక్కకు మిక్కిలి సైన్యాన్ని పంపాడు. జైసింగ్ సారథ్యంలోని సుమారు లక్ష మంది ఔరంగజేబు సేన శివాజీని ఓడించగలిగింది; ఆగ్రాలోని రాజాస్థానానికి తీసుకెళ్లింది; మొఘల్ పాదుషా ముందు జీ హుజూర్ అనిపించడానికి. మనకంటే చిన్నవాణ్నయినా గౌరవించవచ్చుగానీ, మనకంటే మించిపోతాడని భయం ఉన్నప్పుడు గౌరవించడం కష్టం. అదే ఇక్కడ జరిగింది. అందుకే శివాజీకి దర్బారులో సముచిత స్థానం ఇవ్వకుండా మిగిలిన సేనానాయకులతో కలిపి నిలబెట్టించాడు ఔరంగజేబు. కోపంతో బుసకొట్టిన శివాజీని గృహనిర్బంధంలో ఉంచాడు. అయితే, శివాజీ మళ్లీ వ్యూహం పన్నాడు. జబ్బు పడ్డట్టుగా అందరినీ నమ్మింపజేశాడు. జబ్బు తగ్గడానికి అప్పటి సంప్రదాయాల ప్రకారం సాధువులకు పూలూ, పళ్లూ, ఫలహారాలూ పంచిపెట్టే మిషమీద కాపలదారుల కళ్లుగప్పాడు. పెద్ద పెద్ద బుట్టల్ని ఇద్దరు మనుషులు కావడిలాగా మోసుకుంటూ వెళ్లేవారు. వాటిల్లో కూర్చుని తప్పించుకున్నాడు. బయటికి వచ్చాక క్షవరం చేయించుకుని, తన పెద్ద మీసాలు, పొడవు వెంట్రుకలను తొలగించుకుని, బూడిద పూసుకున్న ఒక సాధువులాగా వందల కిలోమీటర్లు ప్రయాణించి తన రాజధాని రాయగడ్ చేరుకున్నాడు. ఇది కాదు విశేషం! బలం పుంజుకుని, మొఘలులకు కోల్పోయిన ప్రతి స్థావరాన్నీ తిరిగి గెలుచుకున్నాడు. వందల కోటలు నిర్మించాడు. శివాజీ దగ్గర నలభై వేల అశ్వికదళం ఉద్యోగులుగా ఉండేవారు. మరో డెబ్బై వేల అశ్వికులు యుద్ధాలప్పుడు కిరాయిదార్లుగా పనిచేసేవారు. పదాతిదళం రెండు లక్షలు! అంతేకాదు, రేవుల్ని అభివృద్ధి పరిచి, సైనిక శక్తికి వినియోగించుకున్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ’ అనిపించుకున్నాడు. 1674లో ‘ఛత్రపతి’ రాచమర్యాదతో తనను తాను సింహాసనం మీద అధికారికంగా ప్రతిష్టించుకుని, ఛత్రపతి శివాజీ మహరాజ్ అయ్యాడు. మహా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. పరమత సహనం చూపాడు. 1680లో 53 ఏళ్ల వయసులో శివాజీ అనారోగ్యంతో మరణించినా ఆయన వారసులు అదే స్ఫూర్తితో పాలించారు. దక్షిణాన హైదరాబాద్, మైసూర్, తూర్పున బెంగాల్ రాజ్యాలు మినహా ‘దాదాపుగా’ భారతదేశం మొత్తం మరాఠాల పాలనలోకి వచ్చింది. అందుకే శివాజీ కేంద్రబిందువుగా నడిచే మరాఠాల చరిత్ర లేనిదే భారతదేశ చరిత్ర సంపూర్ణం కాదు. (19 ఫిబ్రవరిని శివాజీ జయంతిగా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది.)