సత్వం: ఛత్రపతి
మరాఠా వీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ. హనం ఏనాడూ కనబరచని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహనం అంతకంతకు నశిస్తోంది. తమ దగ్గర ఒక మామూలు జాగీర్దారుగా పనిచేసినవాడి కొడుకు రోజురోజుకూ విస్తరిస్తున్నాడు. తననే సవాల్ చేస్తున్నాడు! శివాజీ ఎంత శక్తిమంతుడో అంత యుక్తిగలవాడు. ‘వేడివేడి అంబలి మధ్యలో ఆత్రంగా చేయిపెట్టి వేళ్లు కాల్చుకోవడం కాదు; అంచుల వెంబడి చుట్టూతా చల్లబడిన భాగాన్ని తింటూ క్రమంగా మధ్యలోకి రావా’లనే తత్వాన్ని బాగా ఒంటబట్టించుకున్నవాడు. పదహారేళ్ల ప్రాయంలో తండ్రినుంచి వారసత్వంగా చిన్న జాగీరు పొందాడు శివాజీ.
అబ్బురపరిచే గెరిల్లా రణనీతిని అనుసరిస్తూ చిన్న చిన్న కోటల్ని జయించుకుంటూ వచ్చాడు. కొద్దిమంది నిప్పుకణికల్లాంటి యోధుల్ని వెంటబెట్టుకెళ్లడం, కోటను వశం చేసుకోవడం! అలా పూణె ప్రాంతం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు. అందుకే, ముందుముందు చరిత్రకారులు ఇలాంటి అభిప్రాయానికి రానున్నారు: మరాఠావీరులు కనబరిచినంతటి యుద్ధనైపుణ్యాన్ని ఏ యుద్ధంలోనూ, ఏ దేశంలోనూ చూసి ఎరగం! అలాంటి మరాఠాల ‘ఆది గురువు’ శివాజీ.
1659లో బీజాపూర్ సుల్తాన్ తరఫున ఇరవై వేల సేనతో వచ్చిన అఫ్జల్ ఖాన్‌ను తెలివిగా తప్పుదోవ పట్టించాడు శివాజీ. బలహీనపడ్డట్టుగా నమ్మించి, ఏమరుపాటుగా ఉన్న శత్రువును అంతమొందించాడు. గుర్రాలనూ, ఆయుధ సంపత్తినీ స్వాధీనం చేసుకున్నాడు. దీంతో తన ఇరవై తొమ్మిదవ ఏట తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు శివాజీ.
ఇదే ఔరంగజేబు అసహనానికి కారణం. అందుకే శివాజీని అణచడానికి 1665లో లెక్కకు మిక్కిలి సైన్యాన్ని పంపాడు. జైసింగ్ సారథ్యంలోని సుమారు లక్ష మంది ఔరంగజేబు సేన శివాజీని ఓడించగలిగింది; ఆగ్రాలోని రాజాస్థానానికి తీసుకెళ్లింది; మొఘల్ పాదుషా ముందు జీ హుజూర్ అనిపించడానికి. మనకంటే చిన్నవాణ్నయినా గౌరవించవచ్చుగానీ, మనకంటే మించిపోతాడని భయం ఉన్నప్పుడు గౌరవించడం కష్టం. అదే ఇక్కడ జరిగింది. అందుకే శివాజీకి దర్బారులో సముచిత స్థానం ఇవ్వకుండా మిగిలిన సేనానాయకులతో కలిపి నిలబెట్టించాడు ఔరంగజేబు. కోపంతో బుసకొట్టిన శివాజీని గృహనిర్బంధంలో ఉంచాడు.
అయితే, శివాజీ మళ్లీ వ్యూహం పన్నాడు. జబ్బు పడ్డట్టుగా అందరినీ నమ్మింపజేశాడు. జబ్బు తగ్గడానికి అప్పటి సంప్రదాయాల ప్రకారం సాధువులకు పూలూ, పళ్లూ, ఫలహారాలూ పంచిపెట్టే మిషమీద కాపలదారుల కళ్లుగప్పాడు. పెద్ద పెద్ద బుట్టల్ని ఇద్దరు మనుషులు కావడిలాగా మోసుకుంటూ వెళ్లేవారు. వాటిల్లో కూర్చుని తప్పించుకున్నాడు. బయటికి వచ్చాక క్షవరం చేయించుకుని, తన పెద్ద మీసాలు, పొడవు వెంట్రుకలను తొలగించుకుని, బూడిద పూసుకున్న ఒక సాధువులాగా వందల కిలోమీటర్లు ప్రయాణించి తన రాజధాని రాయగడ్ చేరుకున్నాడు. ఇది కాదు విశేషం! బలం పుంజుకుని, మొఘలులకు కోల్పోయిన ప్రతి స్థావరాన్నీ తిరిగి గెలుచుకున్నాడు. వందల కోటలు నిర్మించాడు.
శివాజీ దగ్గర నలభై వేల అశ్వికదళం ఉద్యోగులుగా ఉండేవారు. మరో డెబ్బై వేల అశ్వికులు యుద్ధాలప్పుడు కిరాయిదార్లుగా పనిచేసేవారు. పదాతిదళం రెండు లక్షలు! అంతేకాదు, రేవుల్ని అభివృద్ధి పరిచి, సైనిక శక్తికి వినియోగించుకున్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ’ అనిపించుకున్నాడు. 1674లో ‘ఛత్రపతి’ రాచమర్యాదతో తనను తాను సింహాసనం మీద అధికారికంగా ప్రతిష్టించుకుని, ఛత్రపతి శివాజీ మహరాజ్ అయ్యాడు. మహా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. పరమత సహనం చూపాడు. 1680లో 53 ఏళ్ల వయసులో శివాజీ అనారోగ్యంతో మరణించినా ఆయన వారసులు అదే స్ఫూర్తితో పాలించారు. దక్షిణాన హైదరాబాద్, మైసూర్, తూర్పున బెంగాల్ రాజ్యాలు మినహా ‘దాదాపుగా’ భారతదేశం మొత్తం మరాఠాల పాలనలోకి వచ్చింది. అందుకే శివాజీ కేంద్రబిందువుగా నడిచే మరాఠాల చరిత్ర లేనిదే భారతదేశ చరిత్ర సంపూర్ణం కాదు.
(19 ఫిబ్రవరిని శివాజీ జయంతిగా
మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది.)