
నాగ్‌పూర్‌లో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ
సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీదే తుది నిర్ణయం
నాగ్‌పూర్: మొఘల్ పాలకుడు ఔరంగజేబు ‘సమాధి తొలగింపు’పై చెలరేగిన హింస అనంతరం నాగ్‌పూర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్ పేత్, తహసీల్, లకద్‌గంజ్, పచ్‌పావోలి, శాంతి నగర్, సక్కర్‌దార, నందన్‌వన్, ఇమామ్‌బాడ, యశోధర నగర్. కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా అదేరోజు సాయంత్రం మధ్య నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హింసకు సంబంధించి పోలీసులు 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ నాగ్‌పూర్‌లోని చిట్నిస్ పార్క్ ప్రాంతంలోని మహల్‌లో హింస చెలరేగింది.
ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక అనేక వాహనాలను తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్‌ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలల్లో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో కలహాలకు దారితీసే చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా జిల్లా ఎస్పీలను కోరారు.

నాగ్‌పూర్ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– జరంగే
ఛత్రపతి సంభాజీనగర్: నాగ్‌పూర్‌లో హింసను ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే మంగళవారం ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. కాంగ్రెస్ అప్పట్లో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వారికి ఉంది . ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకోవాలి. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించారు
Comments
Please login to add a commentAdd a comment