రామ మందిరాన్ని కూల్చింది.. ఔరంగజేబు!!
‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో మాజీ ఐఏఎస్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అయోధ్యలో ‘రామ మందిరం’ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. మందిరాన్ని కూల్చివేసింది బాబర్ హయాంలో కాదని, ఔరంగజేబు హయాంలో నేలమట్టం చేశారని ఓ మాజీ ఐపీఎస్ అధికారి తన పుస్తకంలో పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత ఫైళ్లు, కొన్ని పురాతన సంస్కృత గ్రంథాలు, పురావస్తు తవ్వకాలకు సంబంధించిన సమీక్షలను ఉటంకిస్తూ.. ‘అయోధ్య రీవిజిటెడ్’ అనే పుస్తకంలో 1972 బ్యాచ్, గుజరాత్ కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్ ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
‘1528 సంవత్సరంలో బాబర్ హయాంలో రామమందిరాన్ని కూల్చివేయలేదు. 1660లో ఔరంగజేబు హయాంలో, ఆయనకు ఫిడాయ్ ఖాన్ గవర్నర్గా ఉండగా కూల్చివేత జరిగింది. రామ మందిరాన్ని కూల్చివేయాలని బాబర్ ఆదేశించారనడంలో నిజం లేదు. మందిరాన్ని బాబర్ చూడనేలేదు. 1528లో బాబ్రీ మసీదు నిర్మించారన్న చరిత్రకారుల వాదన కూడా కల్పితమే’ అని పేర్కొన్నారు. ‘అయోధ్య చరిత్రకు సంబంధించిన కొత్త కోణాన్ని రచయిత తెలియజేశారు. సాధారణ విశ్వాసాలకు, పలువురు చరిత్రకారుల అభిప్రాయాలకు విరుద్ధమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు’ అని పుస్తకానికి ముందుమాట రాసిన మాజీ సీజేఐ జస్టిస్ జీబీ పట్నాయక్ పేర్కొన్నారు.