జమ్ము: శ్రీనగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని మెహందర్ పరిధిలోని సలానీ గ్రామం. సుమారు 50 మంది యువకులు సౌదీలో తమ ఉద్యోగాలను వదిలేసుకుని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. అందుకు కారణం తమ గ్రామంలోని ఓ యువకుడి హత్యతో వారంతా రగిలిపోతుండటమే. రెండు నెలల క్రితం జమ్ము కశ్మీర్‌లో దారుణ హత్యకు గురైన రైఫిల్ మన్ జౌరంగజేబు ఉదంతం వారందరినీ కదిలించింది. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ యువకులంతా పోలీస్, ఆర్మీ ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. (ఇంకెంతకాలం ఇలా...?)
‘జౌరంగజేబు మరణ వార్త వినగానే నేను ఇండియాకు బయలుదేరా. నాతోపాటు మరో 50 మంది యువకులు స్వచ్ఛందంగా తమ సహచరుడి కోసం ఇక్కడికి వచ్చారు. వారంతా అక్కడ మంచి ఆదాయం సంపాదించేవారే. కానీ, తమ గ్రామస్థుడి క్రూర హత్యపై వాళ్లు రగిలిపోతున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఇక్కడికి వచ్చారు. ఎలాగైనా ఉగ్రవాదులపై పగ తీర్చుకుంటామని వారంతా శపథం పూనారు. ఆర్మీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు’ అని ఔరంగజేబు బంధువు మహ్మద్ కిరామత్ చెబుతున్నారు.
ఔరంగజేబు మరణం తర్వాత మరో ఇద్దరు అధికారులను.. అదే రీతిలో ఉగ్రవాదులు అపహరించి పొట్టనబెట్టుకున్నారు. అంతేకాదు అధికారులను రాజీనామాలు చేయాలంటూ బెదరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గత నెలలో దక్షిణ కశ్మీర్‌లో ఓ అధికారిని కిడ్నాప్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా చేయించారు. అయితే బెదిరింపులకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని ఓ అధికారి తెలిపారు. ‘దేశం కోసం మా సోదరులు అమరులౌతున్నారు. అలాంటిది మేం ఎందుకు వెనక్కి తగ్గుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి ఉదంతాలకు తొణికేది లేదని, తమ పిల్లలను సైన్యంలోకి పంపి తీరతామని ప్రతిన బూనుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment