న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్‌మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు.
అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment