శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా మట్టుబెట్టాయి. గురువారం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారాయన.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్‌లో బుధవారం భేటీ అయ్యారు.
ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. తొమ్మిది మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 33 ఏళ్లలో స్థానిక ఉగ్రవాదుల కన్నా.. విదేశీ ఉగ్రవాదులు అత్యధిక సంఖ్యలో హతం కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment