Lashkar e Taiba
-
ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్హఫీజ్ సయీద్‌ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు -
కొనసాగుతున్న ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా మట్టుబెట్టాయి. గురువారం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారాయన. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్లో బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. తొమ్మిది మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 33 ఏళ్లలో స్థానిక ఉగ్రవాదుల కన్నా.. విదేశీ ఉగ్రవాదులు అత్యధిక సంఖ్యలో హతం కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. -
మరోసారి చైనా మోకాలడ్డు
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే నేత షహీద్ మహమూద్ (42)ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన సంయుక్త ప్రతిపాదనకు చైనా మరోసారి మోకాలడ్డింది. ఈ ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారి. పాక్‌లో తలదాచుకుంటున్న అబ్దుల్ రెహ్మాన్ మక్కీ తదితరులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలన్న ఇరు దేశాల సంయుక్త ప్రతిపాదనలకు కూడా చైనా ఎప్పటికప్పుడు ఐరాసలో గండి కొడుతూ పాక్‌ను ఆదుకుంటూ వస్తోంది. భారత్, అమెరికాలపై దాడులే లష్కరే ప్రధాన లక్ష్యమని 2011 నుంచి పదేపదే చెబుతూ వస్తున్నాడని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. -
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల్లో స్థానికులు!
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లోని దాన్మర్ ప్రాంతం శుక్రవారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఆల్మదార్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, మృతి చెందిన ఉగ్రవాదులిద్దరూ స్థానికులేనని, వీళ్లు లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందిన వాళ్లని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ముగిసినట్లు ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 78 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టినట్లు విజయ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ అయిజాజ్‌తో పాటు గుర్తు తెలియని మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు ఉగ్రవాదుల ఐడెంటిటీ తెలియాల్సి ఉంది. #Srinagar witnessed another encounter in the wee hours of July 16. 2 unidentified militants were neutralised in this process. Visuals show The #encounter house being on fire. pic.twitter.com/Ah5NCvjL3G — Sandeep Dhar (@sandeepdhar10) July 16, 2021 -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షోపియాన్ జిల్లాలోని బాటాగుంద్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఆరుగురు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. ‘షోపియాన్‌లో ఉగ్రవాదులు తిష్టవేశారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు శనివారం రాత్రి అనుమానిత ఇంటిని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ముస్తాక్ అహ్మద్ మీర్, మొహమ్మద్ అబ్బాస్ భట్, ఖలీద్ ఫరూక్ మాలిక్, ఉమర్ మజీద్, మొహమ్మద్ హమీద్‌తో పాటు పాక్‌కు చెందిన ఉగ్రవాది కఫీల్ హతమయ్యారు. పలువురు పోలీస్ అధికారులు, పౌరుల హత్యలతో పాటు భద్రతా సంస్థల కార్యాలయాలపై దాడిచేసిన ఘటనల్లో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే అవంతిపోరాలో ఆదివారం జరిగిన మరో ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వసీమ్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’ అని తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌం టర్లో పౌరుడు చనిపోవడంతో స్థానికులు భద్రతాబలగాలపై రాళ్లవర్షం కురిపించారు. -
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్‌లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్‌పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్‌లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓ బోటు కెప్టెన్‌ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్‌ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్‌ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్‌ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్‌కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
ఆ ఆలయాన్ని పేల్చేస్తాం : లష్కరే
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో భీకర దాడులతో అలజడి సృష్టిస్తామని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. అక్టోబర్ 20, నవంబర్ 9 తేదీల్లో భీకర దాడులు చేపడతామని లష్కర్ ఏరియా కమాండర్ మౌల్వి అబు షేక్ రావల్పిండి నుంచి హెచ్చరిక లేఖ రాసినట్టు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. అక్టోబర్ 20న ఎలాంటి విధ్వంసం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా నవంబర్ 9న ఎలాంటి అలజడి రేగుతుందనే ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని పేల్చివేస్తామని సైతం లష్కరే హెచ్చరించడంతో నిఘా, భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఉగ్ర సంస్థ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసిందనే అనుమానంతో భోపాల్, గ్వాలియర్, కట్ని, జబల్పూర్లో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లకు లష్కరే దాడుల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 2008 నవంబర్ 26న ముంబై పేలుళ్లలో 166 మంది మరణించడం, 300 మందికి పైగా గాయపడిన దారుణ ఘటనను లష్కరే ఉగ్రవాద సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. -
పాక్ ఎన్నికల్లో ఉగ్రనేతలు..!!
ఇస్లామాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్‌లోలష్కరే తొయిబాకు చెందిన నేతలు పోటీ చేయనున్నారనే ఊహాగానాల మధ్య అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ఈటీతో సంబంధాలున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రజాస్వామ్య హక్కులను కాలారాస్తూ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిపై ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఒక ప్రకటలో వెల్లడించింది. కాగా, మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పేరిట ఓ పార్టీ రిజిస్ట్రేషన్‌కు యత్నించింది. అయితే, ఎంఎంఎల్‌కు లష్కరే సంస్థతో సంబంధాలున్నాయని పేర్కొంటు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ జూన్‌లో రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై అమెరికా సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు పాక్‌లో ఎన్నికలు సామరస్యంగా, రక్షణాత్మకంగా నిర్వహించాలని కోరుతూ ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి భయాలకు వెరవకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకునేలా చేయాలని ఆకాక్షించింది. -
భారీ దాడికి లష్కరే స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో ఉగ్రసంస్థ లష్కరే తోయిబా దాడులకు తెగబడనుందన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కుల్గాంలోని వెసుమిర్ బజార్ వద్ద లష్కరే దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నిందని, లష్కరే ఉగ్రవాది మహ్మద్ నవీద్ అలియాస్ అబూ హంజాలా ఉగ్ర బృందానికి నేతృత్వం వహిస్తాడనే సమాచారంతో అధికారులు అమర్నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్ ఆస్పత్రి వెలుపల పోలీసు అధికారులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన క్రమంలో నవీద్ తప్పించుకుని పారిపోయాడు. ఇక అమర్నాథ్ యాత్రపై ఉగ్ర మూకలు విరుచుకుపడతారనే సమాచారంతో భద్రతను ముమ్మరం చేసిన అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ఎన్ఎస్జీ కమాండోలను నియోగించారు. వీరికి అత్యంతాధునిక ఆయుధాలను అప్పగించారు. అమర్నాథ్ యాత్రకు పటిష్ట భద్రతను కల్పించే క్రమంలో సీఆర్పీఎఫ్ సైతం ప్రత్యేక మోటార్‌సైకిల్ బృందాన్ని యాత్ర మార్గంలో మోహరించింది. మరోవైపు అమర్నాథ్ యాత్రికులను తరలించే ప్రతి వాహనానికి ప్రభుత్వం ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌ను జతచేసి జాయింట్ కంట్రోల్ రూం నుంచి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. -
ఉగ్రవాది సమీర్ టార్గెట్‌లో విదేశీయులు
సాక్షి, హైదరాబాద్: లష్కరే తొయిబా(ఎల్ఈటీ) ఉగ్ర వాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ నయ్యూ అలియాస్ సమీర్ టార్గెట్‌లో విదేశీయులు ఉన్నట్టు తేలింది. ప్రధానంగా యూదులు (ఇజ్రాయిలీలు) ఉన్నట్లు ఎన్ఐఏ నిర్థారించింది. వీరిని మట్టుపెట్టడానికి హిమాచల్‌ప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో రెక్కీ చేసిన ట్లు తేల్చింది. దీంతో ఎన్ఐఏ గతవారం సమీర్‌తోపాటు అతనికి సహకరించిన మరో 9మందిపై ఢిల్లీ లోని పటియాల కోర్టులో అభియోగ పత్రాలు దాఖ లు చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన సమీర్ ఉగ్రవాద శిక్షణ కోసం పాకిస్తాన్‌కు వెళ్లాడు. 2007 మార్చ్‌లో మరో ఇద్దరు పాకిస్తానీయులతో కలసి అక్రమంగా బంగ్లాదేశ్ మీదుగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశిస్తూ బీఎస్ఎఫ్ అధికారులకు పశ్చిమ బెంగాల్లో చిక్కాడు. అదే ఏడాది మేలో జరి గిన మక్కా మసీదు పేలుళ్లలోనూ అనుమానితుడిగా మారాడు. దీంతో సమీర్‌ను పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారు. మహంకాళి పోలీసుస్టేషన్లో ఉన్న సమీర్ ఈ ఏడాది జూన్ 18న అక్కడ నుంచి పారిపోవడానికి యత్నించి విఫలమయ్యాడు. దీనిపై ఎస్కేప్ కేసు నమోదైంది. విచారణ తర్వాత కోల్‌కతా జైలుకు తరలించారు. ఇతడిని కోల్‌కతా పోలీసులు 2014లో కేసు విచారణ కోసం ముంబై కోర్టులో హాజరు పరచడానికి తీసుకెళ్లారు. అనంతరం హౌరా–ముంబై ఎక్స్ ప్రెస్‌లో కోల్‌కతాకు తరలిస్తుండగా తప్పించుకున్నా డు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయ్యూను ఎన్ఐఏ అధికారులు గత నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ లక్నో లోని చార్భాగ్ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. విచా రణలో అధికారులు భారీ కుట్రను ఛేదించారు. పాక్, దుబాయ్ ఉగ్రవాదులతో సంబంధాలు రైలు నుంచి తప్పించుకున్నాక హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, మనాలీల్లో తలదాచుకున్న సమీర్.. పాక్, దుబాయ్‌ల్లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు కొన సాగించినట్లు గుర్తించారు. వీరి నుంచి ఆర్థిక సాయం అందుకుంటూ దేశంలో ఎల్ఈటీ కార్యకలాపాలు విస్తరించడానికి సహకరించాడని తేల్చారు. విదేశాల్లో ని ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడానికి నింబూజ్ వంటి యాప్స్‌తో పాటు వీవోఐపీ, ఇంటర్నెట్ కాల్స్ వాడినట్లు ఆధారాలు సేకరించారు. -
లష్కరే టార్గెట్‌లో ఇద్దరు బీజేపీ నేతలు
సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలను ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టార్గెట్ చేసినట్టు వెల్లడైంది. లక్నోలో అరెస్టయిన లష్కరే ఉగ్రవాది అబ్దుల్ నయీమ్ షేక్ విచారణలో ఈ అంశం వెలుగుచూసినట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. నయీమ్ షేక్ లాహోర్‌లో పలువురితో టచ్‌లో ఉంటూ ఇద్దరు సీనియర్ బీజేపీ నేతలను తన హిట్‌లిస్ట్‌లో పొందుపరిచినట్టు సమాచారం. నయీమ్ ఇప్పటికే కాశ్మీర్‌కు వెళ్లి పలు సైనిక స్ధావరాలు, విద్యుత్ ప్రాజెక్టులు వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్ ఎన్నికల వేళ భయోత్పాతం సృష్టించేందుకు లక్నోలోని స్లీపర్ సెల్ సాయంతో చెలరేగాలని నయీమ్ షేక్ స్కెచ్ వేసినట్టు తెలిసింది. పాకిస్తాన్ నుంచి లష్కరే శ్రేణుల ద్వారా నయీమ్ సహా ఇతర ఉగ్రమూకలకు ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నట్టు అనుమానిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు చెందిన నయీమ్ షేక్‌కు పలు ఉగ్ర కేసులతో సంబంధాలున్నాయి. -
లష్కరే టాప్ కమాండర్ హతం
► ఎన్కౌంటర్లో దుజానాతోపాటు మరో ఉగ్రవాది దార్ మృతి ► ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతాబలగాలు ► కశ్మీర్ లోయలో అప్రమత్తత ► ఇంటర్నెట్ సేవలు బంద్ శ్రీనగర్: ఉగ్రపోరులో భారత భద్రతాదళాలు కీలక ముందడుగు వేశాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు దుజానాను పక్కా ప్రణాళికతో మట్టుబెట్టాయి. ఉగ్ర సంస్థల కీలక నేతలను నిర్మూలించే ఆపరేషన్‌లో మరో విజయం సాధించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ పక్కా సమాచారం, సమర్థ ప్రణాళికతో సాగిన ‘ఆపరేషన్ దుజానా’ను విజయవంతంగా, తమవైపు నుంచి ఎలాంటి నష్టం లేకుండా ముగించగలిగాయి. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ జాతీయుడైన దుజానాను, అతని స్థానిక అనుచరుడు అరిఫ్ నబీ దార్ భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఇంట్లో దుజానా, దార్లు దాక్కొన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సోమవారం అర్ధ రాత్రి నుంచి పుల్వామాలో హక్రిపోరా ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. చివరకు మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో దుజానా, దార్లు హతమయ్యారని, వారి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. గతేడాది హిజ్బుల్ టాప్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం తలెత్తిన హింస నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కశ్మీర్లో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. చాలాచోట్ల బ్రాడ్‌బాండ్ సేవల్ని నిలిపేశారు. కశ్మీర్ లోయలో బడులు, కళాశాలలు, వర్సిటీల్ని మూసివేశారు. పక్కాగా.. ఆపరేషన్ దుజానా: సోమవారం అర్ధ రాత్రి.. పుల్వామాలోని హక్రిపోరాలోని ఒక ఇంట్లో లష్కరే కశ్మీర్ చీఫ్ అబు దుజానా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన స్పెషల్ ఆపరేషన్స్ (ఎస్ఓజీ) బృందాల్ని పుల్వామాకు 13 కి.మీ. దూరంలో ఉన్న హక్రిపురాకు తరలించారు. డీఐజీ స్వయం ప్రకాశ్ పాణి సంఘటన ప్రాంతానికి చేరుకుని ‘ఆపరేషన్ దుజానా’ను పర్యవేక్షించారు. ఎస్‌ఓజీతో పాటు పుల్వామా జిల్లా పోలీసులు, ఆర్మీకి చెందిన విక్టర్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బెటాలియన్లు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇంతలో స్థానికులు భద్రతా బలగాల్ని ప్రతిఘటిస్తూ వాళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మరోవైపు దుజానా, దార్లను మట్టుబెట్టేందుకు వారు ఉన్న ఇంట్లోని ప్రజల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో దుజానా, భట్ మరణించారు. ఉగ్రవాదులు మరణించారని తెలియగానే.. జనాల్లోంచి కొందరు మిలిటెంట్లు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. వంద మందికిపైగా ఆందోళనకారులు భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడంతో.. వారిపైకి టియర్ గ్యాస్ షెల్స్, పెల్లెట్లు ప్రయోగించడంతో పాటు.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించాడు. నియామకాల్లో కీలకం.. దాడుల్లో చురుగ్గా! అబు దుజానా(26) దక్షిణ కశ్మీర్లో లష్కరే తోయిబా చీఫ్ కమాండర్.. లష్కరేలో ఏ+++ హోదా ఉగ్రవాది. అతను పాకిస్తానీ అన్న విషయం తప్ప మిగతా వివరాలు తెలియదు. పుల్వామా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉగ్రవాద కార్యకలాపాల్ని కొనసాగించే దుజానా తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. 2013లో అబు ఖాసీం మరణించాక.. దుజానాను లష్కరే టాప్ కమాండర్‌గా నియమించారు. ఆరేళ్ల క్రితం కశ్మీర్లోకి ప్రవేశించిన దుజానా మొదట్లో ఉత్తర కశ్మీర్లో చురుగ్గా పనిచేశాడు. లష్కరే నాయకత్వంతో విభేదాలతో జకీర్ ముసా గ్రూపులో చేరినట్లు వార్తలు వినిపించాయి. దాదాపు 12 సార్లు పోలీసుల వల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దక్షిణ కశ్మీర్లో భద్రతా బలగాలు, రాజకీయ కార్యకర్తలపై అనేక దాడుల్లో చురుగ్గా వ్యవహరించాడు. స్థానిక యువతను లష్కరే తోయిబాలో చేర్పించడంలో అతను చురుగ్గా వ్యవహరించేవాడని, రెయాజ్ అహ్మద్, అరిఫ్ నబీ దార్, అయూబ్ లోన్ల్ని లష్కరేలో చేర్పించింది అతనే. ఇక పుల్వామా జిల్లాకు చెందిన ఉగ్రవాది దార్.. అరిహల్, రత్నిపోరా, నెహమాల్లో జమ్మూ కశ్మీర్ బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎల్లాక్వాయ్ దేహతి బ్యాంక్ దోపిడీల్లో చురుగ్గా వ్యవహరించాడు. భార్యను చూసేందుకొచ్చి: భార్యను, గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు ఒక గ్రామానికి తరచూ రావ డమే దుజానాను పట్టిచ్చింది. మూడు నెల ల వ్యవధిలో పుల్వామా జిల్లాలోని ఒక గ్రామానికి చాలాసార్లు రావడంపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. ఖుర్షీద్ అనే వ్యక్తి ఇంటికి వస్తున్నాడని, అతని కుమార్తెతో దుజానాకు వివాహమైనట్లు నిఘా వర్గాలు నిర్ధారించుకున్నాయి. ఆపరేషన్ ‘ఏరివేత’! హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్‌తో గతేడాది నుంచి అశాంతితో కశ్మీర్ రగులుతూనే ఉంది. దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్రం ‘హిట్‌లిస్ట్’ను రూపొందించి మరీ ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తోంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే నెలాఖరులో మాట్లాడుతూ, కశ్మీర్లో పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తామని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామన్నారు. పక్కాగా వ్యూహం సిద్ధం చేశాకే హోంమంత్రి ఈ ప్రకటన చేసినట్లు తెలు స్తోంది. సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు మిలి టెంట్ల జాబితాను రూపొందించగా.. 253 మంది క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు లెక్కతేల్చారు. వీరి లో విదేశీయులు, స్థానికులు ఎవరో గుర్తించారు. టార్గెట్... లీడర్ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్న 12 మందితో జాబితాను రూపొందించి... జూన్ ఆరంభంలో విడుదల చేశారు. రెండునెలల్లో ఈ జాబితాలోని ముగ్గుర్ని మట్టుబెట్టారు. జూన్ 16న లష్కరే తోయిబా కమాండర్ జునైద్ మట్టూ హతమయ్యాడు. మట్టూ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా అదేరోజు ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో ఎస్ఐ సహా ఆరుగురు పోలీసుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి సూత్రధారిగా తేలిన లష్కరే కమాండర్ బషీర్ వనీని జూలై 1న హతమార్చారు. ఇప్పుడు దుజానా వంతు.. గత జనవరి నుంచి దాదాపు 110 మంది ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జూన్ నుంచి భారత సైన్యం వ్యూహం మార్చింది. అగ్రనాయకత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎ++ కేటగిరిలో ఉన్న ఉగ్రవాద నాయకుల్ని టార్గెట్ చేసింది. వీరి కదలికల్ని ఇన్ఫార్మర్లు, నిఘావర్గాల ద్వారా సేకరించి ఉచ్చు బిగిస్తోంది. అగ్రనాయకుల్ని ఏరివేస్తే... మిగిలిన తీవ్రవాదులు చెల్లాచెదురవడం లేక లొంగిపోతారనేది భారత సైన్యం వ్యూహం. మిలిటెంట్లకు స్థానిక ప్రజల మద్దతు ఉండటంతో భద్రతాబలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిలో ఫలానా చోట ఎన్కౌంటర్ జరుగుతోందనే సమాచారం క్షణాల్లో యువతలో పాకిపోతోంది. దాంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని భద్రతాబలగాలపై రాళ్ల దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగానే కాల్పుల్లో మరణించే సాధారణ పౌరుల సంఖ్య అధికంగా ఉంటోంది. అందుకే 300 దాకా వాట్సాప్ గ్రూపులపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. మిగిలింది వీరే.. 1. రియాజ్ నైకూ అలియాస్ జుబైర్ అధునాతన సాంకేతికతపై పట్టున్నవాడు. కశ్మీర్ లౌకిక రాజ్యంగా ఉండాలని కాంక్షించే 29 ఏళ్ల నైకూపై 12 లక్షల రివార్డు ఉంది. ఈ ఏడాది జూన్ ఆరంభంలో హిజుబుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్‌గా నియమితుడయ్యాడు. 2. జకీర్ మూసా హురియత్ లౌకికవాద వైఖరితో విభేదించి... వారి తలలు తీయాలని పిలుపిచ్చాడు. హిజుబుల్ అగ్రనాయకత్వంతో విభేదించి ఆ సంస్థకు దూరమయ్యాడు. కశ్మీర్ లోయలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనేది ఇతని వాదన. 3. జీనత్ ఉల్ ఇస్లామ్ లష్కరేలో ఎ కేటగిరి ఉగ్రవాది 4. అబు హమస్ : జైషే మహమ్మద్ డివిజినల్ కమాండర్. పాక్‌కు చెందిన ఇతను 2016 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. 5. సద్దాం పద్దార్ అలియాస్ జైద్: హిజ్బుల్ ముజాహిదీన్ సోపియాన్ జిల్లా కమాండర్. 6. షౌకత్ తక్ లష్కరే పుల్వామా జిల్లా కమాండర్. 2011లో ఉగ్రసంస్థలో చేరాడు. 7. మహ్మద్ యాసిన్ ఇట్టూ అలియాస్ మాన్సూన్: హిజ్బుల్ బద్గాం జిల్లా కమాండర్. 8. వసీం అలియాస్ ఒసామా లష్కరే తోయిబా సోపియాన్ జిల్లా కమాండర్. అంతకముందు 2014లో హిజ్బుల్‌లో చేరి బుర్హన్ వనీతో కలిసి పనిచేశాడు. 9. అల్తాఫ్ దార్ అలియాస్ కచ్రూ హిజ్బుల్ కుల్గాం జిల్లా కమాండర్. –సాక్షి నాలెడ్జ్ సెంటర్