లష్కరే టాప్ కమాండర్ హతం
► ఎన్‌కౌంటర్‌లో దుజానాతోపాటు మరో ఉగ్రవాది దార్ మృతి
► ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతాబలగాలు
► కశ్మీర్ లోయలో అప్రమత్తత
► ఇంటర్నెట్ సేవలు బంద్
శ్రీనగర్: ఉగ్రపోరులో భారత భద్రతాదళాలు కీలక ముందడుగు వేశాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు దుజానాను పక్కా ప్రణాళికతో మట్టుబెట్టాయి. ఉగ్ర సంస్థల కీలక నేతలను నిర్మూలించే ఆపరేషన్‌లో మరో విజయం సాధించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ పక్కా సమాచారం, సమర్థ ప్రణాళికతో సాగిన ‘ఆపరేషన్ దుజానా’ను విజయవంతంగా, తమవైపు నుంచి ఎలాంటి నష్టం లేకుండా ముగించగలిగాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ జాతీయుడైన దుజానాను, అతని స్థానిక అనుచరుడు అరిఫ్ నబీ దార్ భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఇంట్లో దుజానా, దార్‌లు దాక్కొన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సోమవారం అర్ధ రాత్రి నుంచి పుల్వామాలో హక్రిపోరా ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి.
చివరకు మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో దుజానా, దార్‌లు హతమయ్యారని, వారి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. గతేడాది హిజ్బుల్ టాప్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం తలెత్తిన హింస నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కశ్మీర్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. చాలాచోట్ల బ్రాడ్‌బాండ్ సేవల్ని నిలిపేశారు. కశ్మీర్ లోయలో బడులు, కళాశాలలు, వర్సిటీల్ని మూసివేశారు.
పక్కాగా.. ఆపరేషన్ దుజానా: సోమవారం అర్ధ రాత్రి.. పుల్వామాలోని హక్రిపోరాలోని ఒక ఇంట్లో లష్కరే కశ్మీర్ చీఫ్ అబు దుజానా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు, సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన స్పెషల్ ఆపరేషన్స్ (ఎస్‌ఓజీ) బృందాల్ని పుల్వామాకు 13 కి.మీ. దూరంలో ఉన్న హక్రిపురాకు తరలించారు. డీఐజీ స్వయం ప్రకాశ్ పాణి సంఘటన ప్రాంతానికి చేరుకుని ‘ఆపరేషన్ దుజానా’ను పర్యవేక్షించారు.
ఎస్‌ఓజీతో పాటు పుల్వామా జిల్లా పోలీసులు, ఆర్మీకి చెందిన విక్టర్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్లు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇంతలో స్థానికులు భద్రతా బలగాల్ని ప్రతిఘటిస్తూ వాళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మరోవైపు దుజానా, దార్‌లను మట్టుబెట్టేందుకు వారు ఉన్న ఇంట్లోని ప్రజల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో దుజానా, భట్ మరణించారు.
ఉగ్రవాదులు మరణించారని తెలియగానే.. జనాల్లోంచి కొందరు మిలిటెంట్లు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. వంద మందికిపైగా ఆందోళనకారులు భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడంతో.. వారిపైకి టియర్ గ్యాస్ షెల్స్, పెల్లెట్లు ప్రయోగించడంతో పాటు.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించాడు.
నియామకాల్లో కీలకం.. దాడుల్లో చురుగ్గా!
అబు దుజానా(26) దక్షిణ కశ్మీర్‌లో లష్కరే తోయిబా చీఫ్ కమాండర్.. లష్కరేలో ఏ+++ హోదా ఉగ్రవాది. అతను పాకిస్తానీ అన్న విషయం తప్ప మిగతా వివరాలు తెలియదు. పుల్వామా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉగ్రవాద కార్యకలాపాల్ని కొనసాగించే దుజానా తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. 2013లో అబు ఖాసీం మరణించాక.. దుజానాను లష్కరే టాప్ కమాండర్‌గా నియమించారు. ఆరేళ్ల క్రితం కశ్మీర్‌లోకి ప్రవేశించిన దుజానా మొదట్లో ఉత్తర కశ్మీర్‌లో చురుగ్గా పనిచేశాడు.
లష్కరే నాయకత్వంతో విభేదాలతో జకీర్ ముసా గ్రూపులో చేరినట్లు వార్తలు వినిపించాయి. దాదాపు 12 సార్లు పోలీసుల వల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దక్షిణ కశ్మీర్‌లో భద్రతా బలగాలు, రాజకీయ కార్యకర్తలపై అనేక దాడుల్లో చురుగ్గా వ్యవహరించాడు. స్థానిక యువతను లష్కరే తోయిబాలో చేర్పించడంలో అతను చురుగ్గా వ్యవహరించేవాడని, రెయాజ్ అహ్మద్, అరిఫ్ నబీ దార్, అయూబ్ లోన్‌ల్ని లష్కరేలో చేర్పించింది అతనే. ఇక పుల్వామా జిల్లాకు చెందిన ఉగ్రవాది దార్.. అరిహల్, రత్నిపోరా, నెహమాల్లో జమ్మూ కశ్మీర్ బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎల్లాక్వాయ్ దేహతి బ్యాంక్ దోపిడీల్లో చురుగ్గా వ్యవహరించాడు.
భార్యను చూసేందుకొచ్చి: భార్యను, గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు ఒక గ్రామానికి తరచూ రావ డమే దుజానాను పట్టిచ్చింది. మూడు నెల ల వ్యవధిలో పుల్వామా జిల్లాలోని ఒక గ్రామానికి చాలాసార్లు రావడంపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. ఖుర్షీద్ అనే వ్యక్తి ఇంటికి వస్తున్నాడని, అతని కుమార్తెతో దుజానాకు వివాహమైనట్లు నిఘా వర్గాలు నిర్ధారించుకున్నాయి.
ఆపరేషన్ ‘ఏరివేత’!
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్‌తో గతేడాది నుంచి అశాంతితో కశ్మీర్ రగులుతూనే ఉంది. దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్రం ‘హిట్‌లిస్ట్’ను రూపొందించి మరీ ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తోంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే నెలాఖరులో మాట్లాడుతూ, కశ్మీర్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తామని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామన్నారు. పక్కాగా వ్యూహం సిద్ధం చేశాకే హోంమంత్రి ఈ ప్రకటన చేసినట్లు తెలు స్తోంది. సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు మిలి టెంట్ల జాబితాను రూపొందించగా.. 253 మంది క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు లెక్కతేల్చారు. వీరి లో విదేశీయులు, స్థానికులు ఎవరో గుర్తించారు.
టార్గెట్... లీడర్
ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్న 12 మందితో జాబితాను రూపొందించి... జూన్ ఆరంభంలో విడుదల చేశారు. రెండునెలల్లో ఈ జాబితాలోని ముగ్గుర్ని మట్టుబెట్టారు. జూన్ 16న లష్కరే తోయిబా కమాండర్ జునైద్ మట్టూ హతమయ్యాడు. మట్టూ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా అదేరోజు ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో ఎస్‌ఐ సహా ఆరుగురు పోలీసుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి సూత్రధారిగా తేలిన లష్కరే కమాండర్ బషీర్ వనీని జూలై 1న హతమార్చారు. ఇప్పుడు దుజానా వంతు.. గత జనవరి నుంచి దాదాపు 110 మంది ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జూన్ నుంచి భారత సైన్యం వ్యూహం మార్చింది.
అగ్రనాయకత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎ++ కేటగిరిలో ఉన్న ఉగ్రవాద నాయకుల్ని టార్గెట్ చేసింది. వీరి కదలికల్ని ఇన్‌ఫార్మర్లు, నిఘావర్గాల ద్వారా సేకరించి ఉచ్చు బిగిస్తోంది. అగ్రనాయకుల్ని ఏరివేస్తే... మిగిలిన తీవ్రవాదులు చెల్లాచెదురవడం లేక లొంగిపోతారనేది భారత సైన్యం వ్యూహం. మిలిటెంట్లకు స్థానిక ప్రజల మద్దతు ఉండటంతో భద్రతాబలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటిలో ఫలానా చోట ఎన్‌కౌంటర్ జరుగుతోందనే సమాచారం క్షణాల్లో యువతలో పాకిపోతోంది. దాంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని భద్రతాబలగాలపై రాళ్ల దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగానే కాల్పుల్లో మరణించే సాధారణ పౌరుల సంఖ్య అధికంగా ఉంటోంది. అందుకే 300 దాకా వాట్సాప్ గ్రూపులపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు.
మిగిలింది వీరే..
1. రియాజ్ నైకూ అలియాస్ జుబైర్
అధునాతన సాంకేతికతపై పట్టున్నవాడు. కశ్మీర్ లౌకిక రాజ్యంగా ఉండాలని కాంక్షించే 29 ఏళ్ల నైకూపై 12 లక్షల రివార్డు ఉంది. ఈ ఏడాది జూన్ ఆరంభంలో హిజుబుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్‌గా నియమితుడయ్యాడు.
2. జకీర్ మూసా
హురియత్ లౌకికవాద వైఖరితో విభేదించి... వారి తలలు తీయాలని పిలుపిచ్చాడు. హిజుబుల్ అగ్రనాయకత్వంతో విభేదించి ఆ సంస్థకు దూరమయ్యాడు. కశ్మీర్ లోయలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనేది ఇతని వాదన.
3. జీనత్ ఉల్ ఇస్లామ్
లష్కరేలో ఎ కేటగిరి ఉగ్రవాది
4. అబు హమస్ : జైషే మహమ్మద్ డివిజినల్ కమాండర్. పాక్‌కు చెందిన ఇతను 2016 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.
5. సద్దాం పద్దార్ అలియాస్ జైద్: హిజ్బుల్ ముజాహిదీన్ సోపియాన్ జిల్లా కమాండర్.
6. షౌకత్ తక్
లష్కరే పుల్వామా జిల్లా కమాండర్. 2011లో ఉగ్రసంస్థలో చేరాడు.
7. మహ్మద్ యాసిన్ ఇట్టూ అలియాస్ మాన్‌సూన్: హిజ్బుల్ బద్గాం జిల్లా కమాండర్.
8. వసీం అలియాస్ ఒసామా
లష్కరే తోయిబా సోపియాన్ జిల్లా కమాండర్. అంతకముందు 2014లో హిజ్బుల్‌లో చేరి బుర్హన్ వనీతో కలిసి పనిచేశాడు.
9. అల్తాఫ్ దార్ అలియాస్ కచ్రూ
హిజ్బుల్ కుల్గాం జిల్లా కమాండర్.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్