
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిపై పొరుగు దేశం పాకిస్థాన్ స్పందించింది. ఉగ్రదాడిలో పర్యాటకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. అయితే దాడుల వెనుక తమ ప్రమేయం ఉందన్న వాదనను ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనపై మేం ఆందోళన చెందుతున్నాం. మృతుల కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అంతకు ముందు.. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ పహల్గాం దాడిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తామూ వ్యతిరేకిస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి: పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?
భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని ఓ స్థానిక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించాల్సి ఉంది.
We have absolutely nothing to do with it. We reject terrorism in all its forms and everywhere, says Pakistan's Defence Minister Khawaja Asif on the #Pahalgam attack.#pahalgamattack pic.twitter.com/qGiTz6uVOn
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) April 23, 2025
పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ .. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే. తొలుత టీఆర్‌ఎఫ్ ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నడిపించింది. ఆపై లష్కరే తోయిబా(LeT) వంటి పలు ఉగ్ర సంస్థ సభ్యులను తీసుకుని ఫిజికల్ గ్రూపుగా ఏర్పాటైంది.
2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్‌ఎఫ్ దాడులకు దిగుతూ.. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్ చేర్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐనే టీఆర్‌ఎఫ్‌ను సృష్టించిందని భారత నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించినట్లు చెబుతుంటారు.