ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యం ప్రకటించింది. దాడికి యత్నించిన మొత్తం తొమ్మిదిమందినీ మట్టుబెట్టామని తెలిపింది. శుక్రవారం ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్‌వలి వైమానిక శిక్షణ కేంద్రంపైకి శనివారం వేకువజామున భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు దాడికి యత్నించారు.
అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. అనంతరం మిగతా వారిని చుట్టుముట్టి, హతమార్చాయి. శిక్షణ కేంద్రం ఆవరణలోని నిరుపయోగంగా ఉన్న మూడు విమానాలు, ఒక ఆయిల్ ట్యాంకర్ దెబ్బతిన్నట్లు ఆర్మీ తెలిపింది. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు స్పష్టం చేసింది. శిక్షణ కేంద్రంలో కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని వివరించింది.
సైన్యానికి జరిగిన నష్టంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్–ఇ–జిహార్ పాకిస్తాన్(టీజేపీ) మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. అయితే, ఏకంగా సైనిక కేంద్రంపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో శుక్రవారం ఉగ్రవాదుల వేర్వేరు దాడుల్లో 17 మంది సైనికులు హతమయ్యారు.
బలోచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పాస్ని నుంచి ఒర్మారా వైపు వెళ్తున్న ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో 14 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల దాడుల్లో ఒకే ఘటనలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే. టీటీపీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు 2022 డిసెంబర్‌తో ముగిశాక దాడులు తీవ్రతరం కావడం గమనార్హం. గ్వాదర్ ఘటనకు ముందు ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఒక సైనికుడు చనిపోగా మరో అయిదుగురు గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment