శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షోపియాన్ జిల్లాలోని బాటాగుంద్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాలు ఆరుగురు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. ‘షోపియాన్‌లో ఉగ్రవాదులు తిష్టవేశారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు శనివారం రాత్రి అనుమానిత ఇంటిని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ముస్తాక్ అహ్మద్ మీర్, మొహమ్మద్ అబ్బాస్ భట్, ఖలీద్ ఫరూక్ మాలిక్, ఉమర్ మజీద్, మొహమ్మద్ హమీద్‌తో పాటు పాక్‌కు చెందిన ఉగ్రవాది కఫీల్ హతమయ్యారు. పలువురు పోలీస్ అధికారులు, పౌరుల హత్యలతో పాటు భద్రతా సంస్థల కార్యాలయాలపై దాడిచేసిన ఘటనల్లో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే అవంతిపోరాలో ఆదివారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వసీమ్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’ అని తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌం టర్‌లో పౌరుడు చనిపోవడంతో స్థానికులు భద్రతాబలగాలపై రాళ్లవర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment