Hezboll Mujahideen
-
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షోపియాన్ జిల్లాలోని బాటాగుంద్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఆరుగురు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. ‘షోపియాన్‌లో ఉగ్రవాదులు తిష్టవేశారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు శనివారం రాత్రి అనుమానిత ఇంటిని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ముస్తాక్ అహ్మద్ మీర్, మొహమ్మద్ అబ్బాస్ భట్, ఖలీద్ ఫరూక్ మాలిక్, ఉమర్ మజీద్, మొహమ్మద్ హమీద్‌తో పాటు పాక్‌కు చెందిన ఉగ్రవాది కఫీల్ హతమయ్యారు. పలువురు పోలీస్ అధికారులు, పౌరుల హత్యలతో పాటు భద్రతా సంస్థల కార్యాలయాలపై దాడిచేసిన ఘటనల్లో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే అవంతిపోరాలో ఆదివారం జరిగిన మరో ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వసీమ్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’ అని తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌం టర్లో పౌరుడు చనిపోవడంతో స్థానికులు భద్రతాబలగాలపై రాళ్లవర్షం కురిపించారు. -
వర్సిటీ విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) రాజ్యద్రోహం ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కశ్మీర్లో ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడు బషీర్ వనీకి మద్దతుగా వర్సిటీ విద్యార్థులు సభ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిలో కీలమైన విద్యార్ధులు వసీం యాకుబ్ మాలిక్, అబ్దుల్ మీర్‌లపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసు నమోదు చేశారు. కశ్మీర్లో ఉగ్రవాద కర్యాకలపాలకు పాల్పడుతున్న వనీని ఇటీవల భద్రత ధళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. వనీ మృతికి నివాళిగా అతని మద్దతు దారులు కొంతమంది వర్సిటీలో సమావేశం నిర్వహించి.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. వనీ ఎన్కౌంటర్ తరువాత కొంత మంది కశ్మీరి యువకులు ఆయనకు మద్దతుగా సభ నిర్వహించాలని ప్రయత్నం చేశారని.. వారికి వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు పెట్టడంపై వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమకున్న వాక్ స్వాతంత్ర్యన్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయని విద్యార్థి సంఘం నేత ఫజీల్ హుస్సెన్ పేర్కొన్నారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి.. 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం -
హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం
శ్రీనగర్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు కశ్మీర్ లోయలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆ సంస్థ టాప్ కమాండర్ మనాన్ బషీర్ వనీతో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. 27 ఏళ్ల వనీ పీహెచ్‌డీని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మరో ఉగ్రవాదిని ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా శుక్రవారం బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. లొంగిపొమ్మన్నా వినలేదు.. హంద్వారాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు వెళ్లి అక్కడ గురువారం వేకువజాము నుంచే సోదాలు నిర్వహించాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని, దీనికి స్పందించిన భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఇరు పక్షాల మధ్య ఉదయం 11 గంటల వరకు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. మిలిటెంట్లు లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు మైకు ద్వారా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనంలేకపోయిందని అన్నారు. ఎన్కౌంటర్ ముగిశాక ఆ ఇంటి నుంచి వనీ, హుస్సేన్‌ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంత్యక్రియలకు 10వేల మంది: లోలాబ్ ప్రాంతంలోని టేకిపురా సమీపంలో ఉన్న వనీ స్వగ్రామంలో జరిగిన అతని అంత్యక్రియలకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, బషీర్ వనీ మరణవార్త తెలియగానే శ్రీనగర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరకశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలను అధికారులు మూసేశారు. పుకార్లు, విద్వేష ప్రసంగాలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. స్వీయపాలన కోసం పోరాడుతున్న ఓ భావి మేధావిని కోల్పోయామని మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. -
కశ్మీర్ పోలీసులపై ‘హిజ్బుల్’ పంజా
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో బలగాల కుటుంబసభ్యులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. షోపియాన్, కుల్గామ్, అనంతనాగ్, అవంతిపొరా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి రాష్ట్ర పోలీస్ అధికారుల కుటుంబీకులైన 11 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌లు తామే చేసినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ ప్రకటించింది. ఈసారికి మాత్రం వారిని ప్రాణాలతో వదులుతున్నట్లు స్పష్టం చేసింది. దక్షిణ కశ్మీర్లో గురువారం అర్ధరాత్రి పోలీస్ అధికారుల ఇళ్లపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 11 మంది కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు. షోపియాన్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు పోలీస్ అధికారులు చనిపోవడంతో భద్రతాబలగాలు ఉగ్రవాదుల ఇళ్లపై దాడిచేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలాహుద్దీన్ కొడుకు షకీల్‌ను గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను కిడ్నాప్ చేశారు. ఘటనపై కశ్మీర్ పోలీస్‌శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు ఏడుగురు కిడ్నాప్ అయ్యారని తెలిపారు. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తామన్నారు. మా బాధ తెలియాలనే కిడ్నాప్ చేశాం పోలీస్ అధికారుల కుటుంబీకులు 11 మందిని తామే కిడ్నాప్ చేశామని హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్ రియాజ్ నైకూ ప్రకటించాడు. ‘అమాయకులైన పిల్లలను ఎత్తుకెళ్తే తల్లి పడే బాధ మీకు తెలియడానికే కిడ్నాప్ చేశాం. మేం మిమ్మల్ని(పోలీసులను) చేరుకోగలమని చెప్పేందుకే ఈ పని చేశాం. మీ కస్టడీలోని మా బంధువులను 3 రోజుల్లో విడిచిపెట్టండి. లేదంటే మీ కుటుంబాలు లోయలో ఇక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈసారి మీ కుటుంబీకుల్ని ప్రాణాలతో సగౌరవంగా విడిచిపెట్టాం’ అని ఆడియోలో హెచ్చరించాడు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ముందువరుసలో కశ్మీరీ పోలీసులు ఉండటంపై నైకూ∙అసహనం వ్యక్తం చేశాడు. నెలరోజుల్లోగా ఉద్యోగాలను విడిచిపెట్టివెళ్లేలా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తామని నైకూ స్పష్టం చేశాడు. -
ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. వారిలో ఓ హిజ్బుల్ అగ్రనేతతోపాటు ఇటీవలే ఆ సంస్థలో చేరిన విశ్వవిద్యాలయ అధ్యాపకుడు కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ సమయంలో భద్రతా దళాలపైకి రాళ్లు విసిరేందుకు వచ్చిన ఆందోళనకారులు ఐదుగురు మరణించారు. శ్రీనగర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన 24 గంటల్లోపే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా బదిగాం గ్రామం సమీపంలో తాజా ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పోలీసు సిబ్బంది, ఓ ఆర్మీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. బదిగాం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారనీ, ఎదురుకాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సద్దాం పద్దేర్, కశ్మీర్ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేసే మహ్మద్ రఫీ భట్‌తోపాటు తౌసీఫ్ షేక్, ఆదిల్ మలిక్, బిలాల్ అలియాస్ మోల్విలు ఎన్కౌంటర్లో చనిపోయారు. భద్రతా దళాలకు, రాళ్లు విసిరేందుకు వచ్చిన ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయనీ, ఆ తర్వాత వైద్యశాలలో చికిత్స పొందుతూ వారిలో ఐదుగురు మరణించారని ఓ అధికారి చెప్పారు. శుక్రవారం చేరి ఆదివారమే మృత్యు ఒడికి కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసే రఫీ భట్ శుక్రవారమే ఇల్లు వదిలిపెట్టి వెళ్లి హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. పోలీసులకు లొంగిపోవాల్సిందిగా అతణ్ని పదేపదే కోరామనీ, అతని కుటుంబ సభ్యుల ద్వారానైనా ఒప్పించాలని వారిని ఎన్కౌంటర్ స్థలానికి తీసుకొచ్చామని కశ్మీర్ ఐజీ ఎస్పీ పనీ చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే భట్ భద్రతాదళాల కాల్పుల్లో మరణించాడు. ఆదివారం ఉదయమే భట్ తన తండ్రికి ఫోన్ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్ కాల్’ అని చెప్పాడు. -
కశ్మీర్లో భారీ ఆపరేషన్
శ్రీనగర్: ఉగ్రవాదులు లక్ష్యంగా భద్రతా బలగాలు ఆదివారం కశ్మీర్లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో భద్రత బలగాలు 13 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా వద్ద ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిజ్బుల్, లష్కరేలకు భారీ ఎదురుదెబ్బ భద్రతా బలగాల ఆపరేషన్‌తో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఎన్కౌంటర్ వివరాల్ని వెల్లడిస్తూ.. ‘మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఈ ఎన్కౌంటర్లలో గాయపడ్డారు. 25 మంది పౌరులకు పెల్లెట్ గాయాలయ్యాయి’ అని చెప్పారు. అయితే సాయంత్రానికి మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 13కి చేరింది. షోపియాన్ జిల్లా కచుదూరాలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకోగా.. సాయంత్రానికి మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేçహాలు లభించాయి. కాగా కచుదూరా ఎన్కౌంటర్ సందర్భంగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఎస్పీ అభినందనీయం: కశ్మీర్ డీజీపీ అనంత్‌నాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాది లొంగిపోయేందుకు ఎస్ఎస్పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) చేసిన ప్రయత్నాన్ని డీజీపీ అభినందించారు. ‘ ఒక ఉగ్రవాదికి చెందిన కుటుంబ సభ్యుల్ని సంఘటనా స్థలానికి రప్పించి అతను లొంగిపోయేలా ఎస్ఎస్పీ ప్రయత్నించారు. కుటుంబసభ్యులు ఉగ్రవాదితో 30 నిమిషాలు మాట్లాడారు. అయితే వారి మాటల్ని వినేందుకు ఆ ఉగ్రవాది ఒప్పుకోలేదు. అతను కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్లో ఆ ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు’ అని డీజీపీ తెలిపారు. ద్రాగద్ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు ఉగ్రవాదులు స్థానికులేనని, మృతదేహాల్ని బంధువులకు అప్పగించామని ఆయన తెలిపారు. ద్రాగద్‌లో ఉగ్రవాదులు నక్కిన ఇంటి యజమాని కాల్పుల్లో మరణించాడు. కశ్మీర్లో అప్రమత్తం ఎన్కౌంటర్ల నేపథ్యంలో కశ్మీర్ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హురియత్ నేతలు సయద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, యాసిన్ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు. ప్రతీకారం తీర్చుకున్నాం షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రే జమ్మూ కశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్, ఆర్మీతో కలిపి ఈ ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించారు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల్లో ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్, ఒకరు లష్కరే తొయిబాకు చెందినవారని, మరో ఐదుగురు వివరాల్ని నిర్ధారించాల్సి ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. కచుదూరా ఎన్కౌంటర్ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో పలువురు గాయపడ్డారని సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫీకర్ హసన్ తెలిపారు. కచుదూరా, ద్రాగద్‌లో ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు. గతేడాది షోపియాన్‌లో లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ హత్యకు ఈ ఎన్కౌంటర్లతో ప్రతీకారం తీర్చుకున్నామని 15వ కోర్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఏకే భట్ తెలిపారు. ఫయాజ్ హత్యలో కీలక సూత్రధారులైన ఇష్ఫక్ మాలిక్, రయీస్ తోకర్లు ఈ ఎన్కౌంటర్లలో హతమయ్యారని ఆయన తెలిపారు. -
కళ్లల్లో యాసిడ్ పోద్దాం!
శ్రీనగర్: కశ్మీర్లో ఫిబ్రవరిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కళ్లల్లో యాసిడ్ పోయాలంటూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మాట్లాడుకుంటున్నట్లుగా విడుదలైన ఓ ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. దీన్ని హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ, సమీర్ టైగర్ అనే మరో మిలిటెంట్ మధ్య జరుగుతున్న సంభాషణగా గుర్తించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తే వారిని మనం చంపొద్దు. కళ్లల్లో గాఢమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోద్దాం. 28 ఏళ్లుగా బెదిరిస్తున్నా వారు భయపడటం లేదు. ఆయా కుటుంబాలు పనికిరారని అనుకున్న వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మన చేతిలో చస్తే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కుటుంబీకులు భావిస్తున్నారు. అలాంటి వారి కళ్లల్లో యాసిడ్ పోస్తే కుటుంబాలకు భారమవుతారు’ అని ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. -
హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్ కుమారుడి అరెస్టు
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు షాహిద్ యుసుఫ్ (42)ను ఉగ్ర నిధుల కేసులో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న యుసుఫ్‌ను మంగళవారం ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నామని ఎన్ఏఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. బుధవారం అతనిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తామని ఆయన చెప్పారు. ఉగ్ర నిధుల కేసులో మరో నిందితుడైన ఐజాజ్ అహ్మద్ భట్ నుంచి అమెరికాకు చెందిన కంపెనీ ద్వారా యుసుఫ్‌కు నిధులు అందాయనేది ఎన్ఐఏ ప్రధాన ఆరోపణ. మొత్తం రూ. 4.5 లక్షల నిధులు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది. -
రసాయన దాడులు చేద్దాం!
► హిజ్బుల్ ఉగ్రవాదుల వ్యూహం ► పాక్ నుంచి రసాయనిక ఆయుధాలు న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు పాకిస్తాన్ రసాయనిక ఆయుధాలను సమకూర్చుతోందన్న సంచలన సమాచారం తాజాగా వెలుగు చూసింది. నిఘా సంస్థల వద్దనున్న ఉగ్రవాదుల సంభాషణల ఆడియోటేపులను సంపాదించిన సీఎన్ఎన్–న్యూస్18 చానల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకాలం గ్రెనేడ్లు, బాంబులు, తుపాకుల వంటి ఆయుధాల్ని వాడిన ఉగ్రవాదులు ఈసారి భారత ఆర్మీ ఊహించని రీతిలో రసాయనిక దాడి చేయాలని భావిస్తున్నారంది. గతకొన్ని నెలలుగా భారీ సంఖ్యలో ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినందుకు ప్రతీ కారంగా ముష్కరులు రసాయనిక దాడికి తెగించేందుకు సిద్ధమవుతున్నారంది. ఇందు కు తనవంతు సాయంగా పాకిస్తాన్ వారికి ఆయుధాలను సమకూర్చుతోంది. రసాయనిక ఆయుధాలు ఇప్పటికే ఉగ్రవాదులకు చేరినట్లుగా కూడా ఆడియో సంభాషణల్లో తెలిసింది. ‘పీర్ సాహెబ్ (లష్కరే తోయిబా చీఫ్ మహమ్మద్ సయీద్)కు నేను కావాలి. నా వాళ్లు కూడా నన్ను కోరుకుంటున్నారు. మన తర్వాతి కార్యక్రమం ఈద్ తర్వాత ఉంటుంది’ అని ఓ హిజ్బుల్ ఉగ్రవాది మాట్లాడాడు. ‘అల్లా దయతో మనకు పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. సరిహద్దులో పనులు జరుగుతున్నాయి’ అని మరో ఉగ్రవాది అన్నాడు. మరో సందర్భంలో అదే ఉగ్రవాది మాట్లాడుతూ ‘ఇప్పటివరకు మనం బారత ఆర్మీపై గ్రెనేడ్లను విసిరాం. ముగ్గురు, నలుగురు మాత్రమే చనిపోయేవారు. మన వ్యూహాలను మార్చాల్సిన సమయమిది. మనం రసాయనిక ఆయుధాలను వాడి ఒకే దాడిలో వీలైనంత ఎక్కువ మందిని చంపుదాం’ అని అన్నాడు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందనడానికి, ప్రేరేపిస్తోందనడానికి ఈ ఆడియో సంభాషణలు బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వార్తా కథనంపై బీజేపీ నేత ఆర్కే సింగ్ స్పందిస్తూ ‘పాక్ రసాయనిక ఆయుధాలను సమకూరుస్తున్నట్లయితే, అది యుద్ధానికి దారితీస్తుంది. హిజ్బుల్ చీఫ్ దీనిపై జాగ్రత్తగా ఆలోచించాలి’ అని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. ప్రస్తుతం దాదాపు 200 మంది సభ్యులు క్రియాశీలకంగా ఉన్నారు. అమర్నాథ్ యాత్రి కులపై సోమవారం రాత్రి జరిగిన దాడిలోనూ హిజ్బుల్ ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యాత్రికులపై దాడి లష్కరే తోయిబా పనేనని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలను లష్కరే ఖండిం చింది. తమపై నిందలు వేస్తున్నారనీ, అది ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా జరిగిన దాడి అని లష్కరే తెలిపింది.