
సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ పింటూకుమార్ భౌతికకాయానికి కుటుంబ సభ్యురాలి నివాళి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన భీకర ఎన్‌కౌంటర్ 56 గంటల తర్వాత ముగిసింది. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా బాగా జనసమ్మర్దమున్న ప్రాంతంలో నక్కడంతో భద్రతాసిబ్బందికి ఉగ్రమూకల ఏరివేత సవాలుగా మారింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో చనిపోయాడు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు.
వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఓ సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, జవాన్, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఉగ్రమూకల కాల్పుల్లో గాయపడిన జవాన్ శ్యామ్ నారాయణ్‌సింగ్ యాదవ్ ఆదివారం కన్నుమూశారన్నారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా వసీం అహ్మద్ మీర్ అనే పౌరుడు చనిపోయాడన్నారు. కుప్వారాలోని బాబాగుంద్ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు దాక్కోవడంతో ఆపరేషన్ చేపట్టడం బలగాలకు సవాలుగా మారింది. రద్దీగా, చుట్టూ జనావాసాలు ఉండటంతో అధికారులు తొలుత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment