
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోని కలంతరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే వీరి కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ ఆఫీసర్ సహా ముగ్గురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిని బదామీబాగ్‌లోని 92 కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు.
పాక్ కాల్పుల్లో జవాన్ మృతి..
దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణరేఖ(ఎల్వోసీ) వెంట భారత పోస్టులు లక్ష్యంగా బుల్లెట్లు, మోర్టార్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన యశ్ పాల్(24) వీరమరణం చెందారు. యశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని ఉధమ్‌పూర్ జిల్లా మంతాలయ్ గ్రామమని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ దీటుగా తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పాక్ రేంజర్లు భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంబించారనీ, రాత్రివరకూ అవి కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ పాక్ 110 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకల చెరలో బందీగా ఒకరిని సైనికులు రక్షించారు. బందిపొరా జిల్లా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా స్థానికుల సాయంతో ఉగ్రవాదుల చెరలో ఉన్న ఓ బందీని రక్షించగలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment