security forces operation
-
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్నాగ్ ప్రాంతం అహ్లాన్ గగర్‌మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్ సెర్ఛ్ చేపట్టాయి. తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ విడుదల జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
మావోల బంకర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్మించిన బంకర్‌ను భద్రతాబలగాలు గుర్తించారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టులు బంకర్లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్‌లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉందిగానీ ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. బీజాపూర్–దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్ జిల్లాలోని తోడోపాట్–ఉస్పారీ గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతేవాడ అదనపు ఎస్పీ బర్మన్ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది. బంకర్ కనపడకుండా ప్రవేశమార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్ ప్రాంతంగానూ దీనిన వినియోగించినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. జనవరి 9న మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మైదాన ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తే డ్రోన్ల సాయంతో జాడ కనిపెట్టే అవకాశం ఉండటంతో ఇటీవలే ఈ బంకర్ నిర్మించి సమావేశం జరిపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంద్రావతి నదిఒడ్డున ఏర్పాటు చేసిన ఈ బంకర్లో 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా దాక్కునేందుకు వీలుగా ఉంది. ఇలాంటి బంకర్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరిన్ని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, వాటిని గుర్తించేందుకు అడవుల్లో సోదాలు గాలింపు ముమ్మరం చేశారు. అబూజ్మడ్ అడవుల్లో ఇలాంటివి ఎన్ని బంకర్లు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై భద్రతాదళాలకు కొత్త సవాల్‌గా మారినట్టయ్యింది. వచ్చే వేసవిలో విస్తృతంగా కూంబింగ్ చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న భద్రతాదళాలకు కనిపించని బంకర్లతో మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశముంది. గాలి, వెలుతురు సోకేలా ఏర్పాట్లు బైరాంఘర్ పోలీస్‌స్టేషన్, భద్రతాదళాల బేస్ క్యాంప్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ బంకర్ ఉంది. బంకర్లోకి వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, వెలుతురు సోకేలా ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, ఇవి బయటకు కనిపించకుండా చెట్ల పొదలు అడ్డుపెట్టారు. మావో అగ్రనేతలు తలదాచుకునేందుకు ఉపయోగించుకోవడంతో పాటు మెరుపు దాడులకు వీలుగా దీనిని నిర్మించారని వార్తలొచ్చాయి. అయితే దీని నిర్మాణ వివరాలను భద్రతా బలగాలు ఇంకా అధికారికంగా బహిర్గతంచేయలేదు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వీరిని ఏరియా కమిటీ సభ్యురాలు(ఏసీఎం), భోరందేవ్ కమిటీ కమాండర్ సునీత, విస్తార్ దళానికి చెందిన ఏసీఎం సరితా ఖటియా మోచాగా గుర్తించారు. వీరిద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. వీరి వద్ద తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికిందన్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
Jammu and Kashmir: 100 నాటౌట్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 30 మంది ఉన్నారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని, ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు భద్రతాధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి చొరబాట్లు, రిక్రూట్మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. దీంతో కశ్మీర్‌వ్యాప్తంగా గాలింపు చర్యలను ఉధృతం చేశామన్నారు. ‘కశ్మీర్లో ఇంకా 158 మంది వరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారముంది. వీరిలో 83 మంది వరకు లష్కరేకు చెందిన వారే. 30 మంది జైషే మొహమ్మద్, 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల వారున్నారు. అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉడి, కశ్మీర్‌లోయలోని ఆరు చోట్ల ఐఎస్ఐ ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం స్టికీ బాంబులను వాడొచ్చు’’ అని వెల్లడించారు. ‘‘బాల్టాల్ మార్గంలో కంగన్ వద్ద, పంథా చౌక్ మీదుగా వెళ్లే యాత్రికులపైనా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వీటిని తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో నిఘా చేపట్టాం’ అని భద్రతాధికారులు తెలిపారు. -
ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఆదివారం ఉదయం జదిబాల్, పోజ్వల్‌పోరా ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైంది. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావించిన అధికారులు టెర్రరిస్టుల తల్లిదండ్రులను ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చి వారిని లొంగిపోమని చెప్పినా అందుకు ఒప్పుకోలేదని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు. శ్రీనగర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని తెలిసింది. కాగా మరణించిన వారిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టు ఆపరేషన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారని.. మరొకరు గత నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్కు చెందిన ముగ్గురు సిబ్బందితో పాటు, ఓ పోలీసు గాయపడ్డారు. కాగా.. శ్రీనగర్‌లో కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇది రెండవ ఎన్కౌంటర్. గత మే నెలలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందని ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. చదవండి: 24 గంటల్లో ఎనిమిది మంది హతం -
కశ్మీర్ జైషే చీఫ్ హతం
శ్రీనగర్: గణతంత్ర వేడుకలకు ముందు రోజు జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల్లో తనకు తానే జైషే మొహమ్మద్‌కు కశ్మీర్ చీఫ్‌గా ప్రకటించుకున్న ఖారీ యాసిర్ ఉన్నాడు. గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడిలో యాసిర్ పాలుపంచుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ట్రాల్ ఎన్కౌంటర్లో మరణించిన ఖారీ ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని, అతను ఉగ్ర నియామకాలు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులను తరలించడం వంటివి చేస్తాడని తెలిపారు. గత సంవత్సరం పుల్వామా దాడి తర్వాత జైషే సంస్థను నిర్వీర్యం చేయగలిగామని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ అన్నారు. -
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోని కలంతరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే వీరి కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ ఆఫీసర్ సహా ముగ్గురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిని బదామీబాగ్లోని 92 కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి.. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణరేఖ(ఎల్వోసీ) వెంట భారత పోస్టులు లక్ష్యంగా బుల్లెట్లు, మోర్టార్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన యశ్ పాల్(24) వీరమరణం చెందారు. యశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని ఉధమ్‌పూర్ జిల్లా మంతాలయ్ గ్రామమని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ దీటుగా తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పాక్ రేంజర్లు భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంబించారనీ, రాత్రివరకూ అవి కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ పాక్ 110 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకల చెరలో బందీగా ఒకరిని సైనికులు రక్షించారు. బందిపొరా జిల్లా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా స్థానికుల సాయంతో ఉగ్రవాదుల చెరలో ఉన్న ఓ బందీని రక్షించగలిగాయి. -
కశ్మీర్లో జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భద్రతాబలగాలు ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన టాప్ కమాండర్ అద్నాన్‌ను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల పక్కా సమాచారంతో త్రాల్ ప్రాంతంలో ఉన్న దార్గనీ గుండ్ గ్రామాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది, జైషే టాప్ కమాండర్ అద్నాన్ హతమయ్యాడని పోలీస్‌శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్‌తో పాటు పౌరుడు గాయపడ్డాడని వెల్లడించారు. -
ప్రతీకారం తీర్చుకున్న బలగాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ మొహమ్మద్ సలీమ్ షాను కిరాతకంగా హత్యచేసిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఆదివారం మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కుల్గామ్ జిల్లాలోని ముతల్హమాకు చెందిన కానిస్టేబుల్ సలీమ్ షా సెలవుపై శుక్రవారం ఇంటికి రాగా, అతన్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తీవ్రంగా హింసించి చంపారు. మరుసటి రోజు రెడ్వానీ పయీన్ గ్రామంలోని ఓ నర్సరీ సమీపంలో సలీమ్ మృతదేహం లభ్యమైంది. ఉగ్రవాదుల ఆచూకీపై నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రెడ్వానీ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఈ కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన మువావియా, కుల్గామ్‌కు చెందిన సోహైల్ అహ్మద్ దార్, రెహాన్లుగా గుర్తించామన్నారు. వీరంతా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీస్ రికార్డుల్లో ఉందన్నారు. ఘటనాస్థలంలో రెండు ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లోకి పాక్ నుంచి అక్రమంగా ప్రవేశించడానికి యత్నించిన ఓ పాకిస్తానీ పౌరుడి(24)ని బీఎస్ఎఫ్ ఆదివారం కాల్చిచంపింది. ఇతడు పాక్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల్ని కశ్మీర్లోకి తీసుకొచ్చేందుకు గైడ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఉగ్రదాడులు తగ్గుముఖం.. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించినప్పటి నుంచి ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయింది. ఉగ్రదాడులు తగ్గినప్పటికీ రాళ్లు విసిరే ఘటనలు మాత్రం రాష్ట్రంలో స్వల్పంగా పెరిగాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
చర్ల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు నక్సలైట్లు పారిపోయినట్టు తెలుస్తోంది. వారికోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. బైలాడిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో దండకారణ్య సబ్ జోనల్ హెడ్ గణేష్ ఉయికే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే సమాచారం మేరకు సుమారు 200 మంది డీఆర్జీ, ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలకు చెందిన జవాన్లు రెండ్రోజుల క్రితం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఎనిమిది బృందాలుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జవాన్లకు దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని తీమ్‌నార్ ప్రాంతంలో గురువారం ఉదయం 6 గంటలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (యాంటీ నక్సల్స్ ఆపరేషన్) పి.సుందర్రాజ్ తెలిపారు. ఘటనాస్థలం నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు .303 రైఫిళ్లతో సహా 12 బోర్ గన్స్, మరికొన్ని మజిల్ లోడింగ్ గన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ సంఘటన నుంచి సబ్ జోనల్ హెడ్ గణేశ్ వుయికే తప్పించుకున్నట్లుగా తెలుస్తోందని బస్తర్ ఐజీ వివేకానంద్ సిన్హా తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించి గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో పాటు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. పుల్వామాలోని ద్రబ్గమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనంతరం తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలపై ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన సమీర్ అహ్మద్‌భట్ అలియాస్ సమీర్ టైగర్, అక్విబ్ ముస్తఖ్లు చనిపోయారు. ఎన్కౌంటర్ జరుగుతుండగానే ఉగ్రవాదుల్ని తప్పించేందుకు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకున్న స్థానిక యువత.. భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బుల్లెట్ తగిలి షాహీద్ అహ్మద్ దార్(25) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్లో హిజ్బుల్‌కు రిక్రూటర్‌గా ఉన్న సమీర్ సోషల్‌మీడియా సాయంతో ఇప్పటివరకూ 80 మంది యువకుల్ని ఈ ఉగ్రసంస్థలో చేర్పించాడు. -
కశ్మీర్లో భారీ ఆపరేషన్
శ్రీనగర్: ఉగ్రవాదులు లక్ష్యంగా భద్రతా బలగాలు ఆదివారం కశ్మీర్లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో భద్రత బలగాలు 13 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా వద్ద ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిజ్బుల్, లష్కరేలకు భారీ ఎదురుదెబ్బ భద్రతా బలగాల ఆపరేషన్‌తో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఎన్కౌంటర్ వివరాల్ని వెల్లడిస్తూ.. ‘మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఈ ఎన్కౌంటర్లలో గాయపడ్డారు. 25 మంది పౌరులకు పెల్లెట్ గాయాలయ్యాయి’ అని చెప్పారు. అయితే సాయంత్రానికి మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 13కి చేరింది. షోపియాన్ జిల్లా కచుదూరాలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకోగా.. సాయంత్రానికి మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేçహాలు లభించాయి. కాగా కచుదూరా ఎన్కౌంటర్ సందర్భంగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఎస్పీ అభినందనీయం: కశ్మీర్ డీజీపీ అనంత్‌నాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాది లొంగిపోయేందుకు ఎస్ఎస్పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) చేసిన ప్రయత్నాన్ని డీజీపీ అభినందించారు. ‘ ఒక ఉగ్రవాదికి చెందిన కుటుంబ సభ్యుల్ని సంఘటనా స్థలానికి రప్పించి అతను లొంగిపోయేలా ఎస్ఎస్పీ ప్రయత్నించారు. కుటుంబసభ్యులు ఉగ్రవాదితో 30 నిమిషాలు మాట్లాడారు. అయితే వారి మాటల్ని వినేందుకు ఆ ఉగ్రవాది ఒప్పుకోలేదు. అతను కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్లో ఆ ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు’ అని డీజీపీ తెలిపారు. ద్రాగద్ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు ఉగ్రవాదులు స్థానికులేనని, మృతదేహాల్ని బంధువులకు అప్పగించామని ఆయన తెలిపారు. ద్రాగద్‌లో ఉగ్రవాదులు నక్కిన ఇంటి యజమాని కాల్పుల్లో మరణించాడు. కశ్మీర్లో అప్రమత్తం ఎన్కౌంటర్ల నేపథ్యంలో కశ్మీర్ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హురియత్ నేతలు సయద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, యాసిన్ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు. ప్రతీకారం తీర్చుకున్నాం షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రే జమ్మూ కశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్, ఆర్మీతో కలిపి ఈ ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించారు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల్లో ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్, ఒకరు లష్కరే తొయిబాకు చెందినవారని, మరో ఐదుగురు వివరాల్ని నిర్ధారించాల్సి ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. కచుదూరా ఎన్కౌంటర్ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో పలువురు గాయపడ్డారని సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫీకర్ హసన్ తెలిపారు. కచుదూరా, ద్రాగద్‌లో ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు. గతేడాది షోపియాన్‌లో లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ హత్యకు ఈ ఎన్కౌంటర్లతో ప్రతీకారం తీర్చుకున్నామని 15వ కోర్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఏకే భట్ తెలిపారు. ఫయాజ్ హత్యలో కీలక సూత్రధారులైన ఇష్ఫక్ మాలిక్, రయీస్ తోకర్లు ఈ ఎన్కౌంటర్లలో హతమయ్యారని ఆయన తెలిపారు. -
కశ్మీర్లో 13 మంది ఉగ్రవాదుల హతం..
కశ్మీర్ : అల్లర్లు, ఘర్షణలతో కశ్మీర్ అట్టుడుకుతోంది. ఆదివారం భద్రతాదళాలు, ఉగ్రమూకల నడుమ పలుమార్లు జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఇదే సమయంలో ఉగ్రమూకలతో పోరాడుతూ ముగ్గరు జవాన్లు అమరులయ్యారు. తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయనే విషయం తెలియడంతో దక్షిణ కశ్మీర్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ప్రతిగా బలగాలు వారిపైకి కాల్పులకు దిగాయని కశ్మీర్ డీజీపీ వాయిద్ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఉగ్ర సంస్థల్లోకి యువత.. మృతి చెందిన 13 మంది మిలిటెంట్లలో ఒక తీవ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడు ఉన్నాడని వాయిద్ తెలిపారు. అనంత్‌నాగ్ నుంచి 12 మంది, షోపియాన్ నుంచి 24 మంది, పుల్వామా, అవంతిపుర నుంచి 45 మంది, కుల్గాం నుంచి 10 మంది యువకులు ఇటీవల మిలిటెంట్ గ్రూపుల్లో చేరినట్లు సమాచారముందని ఆయన పేర్కొన్నారు. ఒకరి లొంగుబాటు.. అనంత్‌నాగ్ జిల్లాలోని దాయిల్గాంలో ఇంట్లో నక్కిన ఇద్దరు తీవ్రవాదులకు లొంగిపోవాలని లౌడ్ స్పీకర్లతో హెచ్చరికలు చేసినట్లు డీజీపీ తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల వినతితో ఒక మిలిటెంట్ లొంగిపోగా.. మరో తీవ్రవాది రావూఫ్ ఖాండే కాల్పుల్లో హతమయ్యాడని డీజీపీ వెల్లడించారు. ఏడాదిగా జాడలేకుండా పోయిన రావూఫ్ ఖాండే వారం క్రితం తుపాకి చేతబట్టి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఇద్దరూ నిషేదిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్(హెచ్ఎమ్)కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. బందీలుగా పౌరులు.. షోపియాన్ జిల్లాలోని కచ్చదూరలో మిలిటెంట్లు కొంతమంది పౌరులను బందీలుగా పట్టుకున్నారని డీజీపీ తెలిపారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామనీ, భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. కశ్మీర్ లోయలో లా అండ్ ఆర్డర్ అదుపులోకి తీసుకురావడానికి మరిన్ని భద్రతా బలగాలను మోహరించామన్నారు. చనిపోయిన తీవ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారో తెలియాల్సి ఉందని డీజీపీ వెల్లడించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. నౌషేరా–సుందర్బనీ బెల్ట్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఈ ఉగ్రవాదులు ఐదురోజుల క్రితమే నియంత్రణరేఖ (ఎల్వోసీ) దాటి భారత్‌లోకి చొరబడినట్లు జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ చొరబాటుపై నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ చేపట్టాయన్నారు. ఇందులోభాగంగా సుందర్బనీ ప్రాంతంలో అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాల్సిందిగా ఆదేశించామన్నారు. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారనీ, భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ ప్రాంతంలోని భూషణ్‌కుమార్ శర్మ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఉగ్రవాదులు భోజనం వండాల్సిందిగా వారిని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. సుందర్బనీలోని ఓ సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో పేలుడు పదార్థాలున్న 3 బ్యాగుల్ని గుర్తించామన్నారు. -
భారత బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
సాక్షి, శ్రీనగర్: ఓ ఉగ్రవాదిని భారత సైనిక బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనిక బలగాలు ప్రత్యేక ఆపేరేషన్ చేపట్టాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా మీడియాకు తెలిపారు. ఆ ఉగ్రవాది ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కోనసాగుతోందని పేర్కొన్నారు. -
ఆఫ్ఘన్లో భారీగా ఉగ్రవాదులు హతం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. భద్రతా దళాలు చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోందని, ఈ ఆపరేషన్‌లో భాగంగా గడిచిన 24 గంటల్లోనే 44 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆ దేశ రక్షణమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో 27మంది ఉగ్రవాదుల గాయపడగా, ఒకడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది. ఆఫ్ఘన్‌లోని వర్దాక్, కాందహార్, హెల్మండ్, బాఘ్లాన్ ప్రావిన్సుల్లో భద్రతా దళాలు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని రక్షణశాఖను ఉటంకిస్తూ చైనా వార్తాసంస్థ సిన్హుహ తన కథనంలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారని తెలిపింది. ఉగ్రవాదంతో కల్లోలంగా మారిన ప్రావిన్సుల్లో తిరిగి శాంతిని పునరుద్ధరించేందుకు ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టగా, దీనిని ప్రతిఘటిస్తూ తాలిబన్ ఉగ్రవాదులు బాంబు దాడులు, సాయుధ ఎదురుదాడులు జరుపుతున్నారు.