
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భద్రతాబలగాలు ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన టాప్ కమాండర్ అద్నాన్‌ను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల పక్కా సమాచారంతో త్రాల్ ప్రాంతంలో ఉన్న దార్‌గనీ గుండ్ గ్రామాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది, జైషే టాప్ కమాండర్ అద్నాన్ హతమయ్యాడని పోలీస్‌శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్‌తో పాటు పౌరుడు గాయపడ్డాడని వెల్లడించారు.