
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. రోజుకొక ఎన్‌కౌంటర్ జరుగుతోంది. బుధవారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. అతనిని షామ్ సోఫిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మిలిటెంట్లు భద్రతా బలగాలపై హఠాత్తుగా కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచి్చందని పోలీసులు వెల్లడించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని చూసి జైషే మహమ్మద్ టాప్ కమాండర్ షామ్ సోఫిగా గుర్తించినట్టు కశీ్మర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా వెల్లడించారు.