జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 30 మంది ఉన్నారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని, ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు భద్రతాధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి చొరబాట్లు, రిక్రూట్‌మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు.
దీంతో కశ్మీర్‌వ్యాప్తంగా గాలింపు చర్యలను ఉధృతం చేశామన్నారు. ‘కశ్మీర్‌లో ఇంకా 158 మంది వరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారముంది. వీరిలో 83 మంది వరకు లష్కరేకు చెందిన వారే. 30 మంది జైషే మొహమ్మద్, 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల వారున్నారు. అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉడి, కశ్మీర్‌లోయలోని ఆరు చోట్ల ఐఎస్‌ఐ ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం స్టికీ బాంబులను వాడొచ్చు’’ అని వెల్లడించారు. ‘‘బాల్టాల్ మార్గంలో కంగన్ వద్ద, పంథా చౌక్ మీదుగా వెళ్లే యాత్రికులపైనా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వీటిని తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో నిఘా చేపట్టాం’ అని భద్రతాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment