సమీర్ (ఫైల్)
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో పాటు ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. పుల్వామాలోని ద్రబ్గమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనంతరం తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలపై ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.
దీంతో భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన సమీర్ అహ్మద్‌భట్ అలియాస్ సమీర్ టైగర్, అక్విబ్ ముస్తఖ్‌లు చనిపోయారు. ఎన్‌కౌంటర్ జరుగుతుండగానే ఉగ్రవాదుల్ని తప్పించేందుకు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకున్న స్థానిక యువత.. భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బుల్లెట్ తగిలి షాహీద్ అహ్మద్ దార్(25) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్‌లో హిజ్బుల్‌కు రిక్రూటర్‌గా ఉన్న సమీర్ సోషల్‌మీడియా సాయంతో ఇప్పటివరకూ 80 మంది యువకుల్ని ఈ ఉగ్రసంస్థలో చేర్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment