ఏడుగురి దుర్మరణం
మృతుల్లో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్‌బల్‌లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి.
కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment