National Highway Works
-
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
నంబరింగ్ ఇచ్చి రహదారుల పనులు చేపట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ రహదారులుగా గుర్తించిన పలు రహదారులకు నంబరింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎంపీలు నామా నాగేశ్వరరావు, లింగయ్యయాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, సునీత తదితరులతో కలిసి గడ్కరీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు. రాష్ట్రంలో 3,150 కి.మీ. జాతీయ రహదారులు కేటాయిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, అందులో 600 కి.మీ. రహదారులకు నంబరింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. హైదరాబాద్–భూపాలపల్లి ఎన్‌హెచ్–163 మీద రెండు చోట్ల అండర్ పాస్‌లు మంజూరు చేయాలని ఆయన కోరారు. -
హైవే పనులకు బ్రేక్
పాల్వంచరూరల్ (ఖమ్మం): జాతీయ రహదారి నిర్మాణ పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పనులు అస్తవ్యస్తంగా చేపట్టడంతో ప్రమాదకరంగా మారాయి. గత మార్చి నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరుగుతోంది. గత పక్షం రోజులుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 30వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మూడో ప్యాకేజీ కింద సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల పనులు మూడేళ్ల క్రితం చేపట్టారు. నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నారు. అయితే రోడ్డుకు ఒకవైపు కూడా రహదారి పనులు పూర్తికాలేదు. రోడ్డు పక్కన డ్రెయినేజీ పనులను అస్తవ్యస్తంగా చేపట్టారు. పాల్వంచ మండలంలోని కేవశవాపురం నుంచి ఇందిరానగర్ కాలనీ వరకు ఇటీవల వరకు నిర్మాణ పనులు కొనసాగాయి. ఆరోగ్యమాత చర్చ నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఒక వైపు నిర్మాణం జరిపారు. కానీ అసంపూర్తిగా చేపట్టారు. కల్వర్టులపై స్లాబ్‌లు నిర్మాణం చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. ఒకవైపు రోడ్డు ఎత్తుగా మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరం మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాథపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. నిర్మాణం జరిగే మార్గంలో కనీసం హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల ఇసుక బస్తాలను, మరికొన్ని చోట్ల డ్రమ్‌లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నవభారత్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు కూడా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. హైవేకు ఇరువైపులా నిర్మించిన డ్రెయినేజీ అసంపూర్తిగా ఉంది. డివైడర్ మధ్యలో అక్కడ అక్కడ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైన తర్వాత జూలై నుంచి హైవే పనులు నత్తనడకన సాగగా, ఇటీవల పూర్తిగా నిలిచిపోయాయి. అయినా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి వర్షాల వల్ల జాతీయ రహదారి పనులు పక్షం రోజులుగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశాం. కొత్తగూడెం పట్టణంలో 6 కిలోమీటర్ల మేరకు వాటర్ పైపులైన్ తొలగించకపోవడం వల్ల పనులు చేయలే ని పరిస్థితి నెలకొంది. మూ డుచోట్ల కల్వర్టు పనులు కూడా వర్షంలోనే చేపట్టాం. వర్షాలు తగ్గితే డిసెంబర్ నెలాఖరుకు పాల్వంచ, కొ త్తగూడెం పట్టణాల పరిధి లో పనులు పూర్తి చేస్తాం. నాసిరకం పనులు నిర్వస్తే చర్యలు తీసుకుంటాం. మళ్లీ నిర్మా ణం చేయిస్తాం. –పద్మారావు, ఎన్‌హెచ్ ఈఈ -
365లో 420 పనులు
సాక్షి, హన్మకొండ : భారీ వాహనాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత నాణ్యత ప్రమాణాల ప్రకారం జాతీయ రహదారి పనులు చేపట్టాలి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా మీదుగా కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 365 పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి పేరు చెబుతూ గ్రామీణ రోడ్ల స్థాయిలో పనులు చేపడుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సన్నకంకర, గ్రానైట్ శాండ్ (జీఎస్బీ, గ్రాన్యుల్ సబ్ బేస్) మిశ్రమంతో ప్రాథమిక స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉండగా... చవగ్గా లభిస్తుందనే ఉద్దేశంతో ఎర్రమట్టితోనే రోడ్డు నిర్మాణం చేపడతున్నారు. సమీపంలో ఉన్న గుట్టల నుంచి అక్రమంగా ఎర్రమట్టి తవ్వి రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి దాదాపు కోటిన్నర రూపాయలు వెచ్చిస్తున్నా... పట్టపగలే నాసిరకంగా, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా... అధికార యంత్రాంగం కళ్లుమూసుకుని చోద్యం చూస్తోంది. మొదటిదశలో 80 కి.మీలు ప్రస్తుతం వరంగల్ జిల్లా మీదుగా హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్తోంది. కొత్తగా మరో జాతీయ రహదారిని జిల్లా మీదుగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నిర్ణయించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మహారాష్ట్ర సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్ రేణిగుంట వరకు ప్రస్తుతం ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి మన జిల్లాలో భూపాలపల్లి మండలంలో ప్రవేశించి మరిపెడ మండలంలో ముగుస్తుంది. జిల్లాలో 220 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణాన్ని భూపాలపల్లి-పరకాల-ఆత్మకూరు, ములుగు మండలం మల్లంపల్లి-మరిపెడ, మరిపెడ- నల్గొండ జిల్లా నకిరేకల్ మధ్య మొత్తం మూడు పనులుగా విభజించారు. మొదటిదశలో మల్లంపల్లి-మరిపెడ మధ్య ఉన్న 80 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను రూ. 127 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయూనికీ గండి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నల్లబెల్లి మండలం కన్నారావుపేట, గుండ్లపహాడ్ గ్రామాల సమీపంలోని రాజన్నగుట్టల నుంచి అనుమతులు పొందకుండా ఎర్రమట్టిని తవ్వుతున్నారు. ఇక్కడ మైనింగ్ చేసేందుకు ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కానీ... సర్కారు రికార్డుల్లో ఉన్న గుట్టల్లో మైనింగ్ చేపడుతూ ప్రొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో యథేచ్ఛగా ఎర్ర మన్ను తరలించుకుపోతున్నారు. నెలరోజులుగా ఈ తతంగం కొనసాగుతున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారీతిగా సాగుతున్న మైనింగ్ కారణంగా గుట్ట హరించుకుపోతోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సినఆదాయానికి గండి పడుతోంది.