kupwara district
-
జమ్ముకశ్మీర్‌లో విషాదం.. ముగ్గురు సైనికులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. ట్రాక్‌పై దట్టమైన పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు బుధవారం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. కాగా, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా చినార్ క్రాప్స్‌కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారిపడిపోయారు. ఈ క్రమంలో వారు మరణించినట్టు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, ట్రాక్‌పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగనట్టు అధికారులు చెప్పారు. -
కశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లతో పాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. ఆపరేషన్‌లో భాగంగా ఎల్ఓసీకి సమీపంలోని మాచిల్ సెక్టార్ వద్ద ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు ఆ ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేశాయి. ఇలా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. -
ఒక్క రోజులో మూడు ఎన్కౌంటర్లు
సాక్షి, కుప్వారా: కశ్మీర్ లోయలో మళ్లీ రక్తపాతం జరిగింది. బుడ్గం జిల్లాలో శుక్రవారం భారత ఆర్మీ జరిపిన వివిధ ఎన్కౌంటర్లలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో సైనికులు మూడు ఎన్కౌంటర్లు జరపడం విశేషం. బాలాకోట్ దాడుల తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోకుండా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ కవ్విస్తున్న దాయాది పాక్‌కు, ఈ ఎన్కౌంటర్లతో భారత్ గట్టిసమాధానమిచ్చినట్లైంది. బుడ్గాం జిల్లాలోని పారిగ్రామ్ ప్రాంతంలో భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్లు కలసి శుక్రవారం నిర్వహించన ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఎమ్16 రైఫిళ్లను ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం షోపియాన్ జిల్లాలోని యార్వాన్ అడవి, కుప్వారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మన సైనికులు చేసిన ఎన్కౌంటర్లలో నలుగురు మిలిటెంట్లు చనిపోయారు. ఈ దాడులలో పలువురు జవాన్లకూ గాయాలైనట్టు సమాచారం. -
కశ్మీర్లో 56 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన భీకర ఎన్కౌంటర్ 56 గంటల తర్వాత ముగిసింది. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా బాగా జనసమ్మర్దమున్న ప్రాంతంలో నక్కడంతో భద్రతాసిబ్బందికి ఉగ్రమూకల ఏరివేత సవాలుగా మారింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో చనిపోయాడు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, జవాన్, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఉగ్రమూకల కాల్పుల్లో గాయపడిన జవాన్ శ్యామ్ నారాయణ్‌సింగ్ యాదవ్ ఆదివారం కన్నుమూశారన్నారు. ఎన్కౌంటర్ సందర్భంగా వసీం అహ్మద్ మీర్ అనే పౌరుడు చనిపోయాడన్నారు. కుప్వారాలోని బాబాగుంద్ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు దాక్కోవడంతో ఆపరేషన్ చేపట్టడం బలగాలకు సవాలుగా మారింది. రద్దీగా, చుట్టూ జనావాసాలు ఉండటంతో అధికారులు తొలుత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. -
కుప్వారాలో ఎదురుకాల్పులు.. చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులు!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. హంద్వారా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు చిక్కినట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాదుల క్యాంపులపై భారత మైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే షోపియన్ జిల్లాలో జరిగిన ఎదుకాల్పులో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. -
కశ్మీర్ హిమోత్పాతంలో 11 మంది మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ వాహనంపై భారీ మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో 11 మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఖలీద్ జహంగీర్ శనివారం తెలిపారు. ఖూనీ నల్లా ప్రాంతంలో కుప్వారా–తంగ్ధర్ రోడ్డుపై శుక్రవారం భారీ మంచు చరియలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే. ఘటనాస్థలి నుంచి ప్రాణాలతో ఉన్న ముగ్గురు ప్రయాణికుల్ని ఇప్పటివరకు కాపాడినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతులకు జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.12,600 నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ మంత్రి జావీద్ ముస్తాఫా మీర్ ప్రకటించారు. -
మరో ఉగ్ర దాడి
ముగ్గురిని మట్టుపెట్టిన సైన్యం ♦ కుప్వారా జిల్లాలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదుల కాల్పులు ♦ ఆయుధాలు, మందుగుండు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్న ఆర్మీ ♦ ఎల్వోసీ వెంట ఉగ్ర చొరబాట్లు విఫలం.. నలుగురి హతం ♦ సర్జికల్ దాడులపై ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు: పరీకర్ శ్రీనగర్/ఆగ్రా: కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం సైనిక శిబిరంపై కాల్పులకు తెగబడగా... సైన్యం ఉగ్రదాడిని సమర్థంగా తిప్పికొట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. కుప్వారా జిల్లా లాన్‌గేట్ వద్ద ఆర్మీ శిబిరంపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తంగా ఉన్న సైన్యం వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, మ్యాప్‌లు వంటి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్మీ కమాండింగ్ అధికారి కల్నల్ రాజీవ్ శారంగ్ కథనం ప్రకారం... సైనిక శిబిరం కంచె పరిధిలో అనుమానాస్పద కదలికల్ని గమనించిన జవాన్లు అప్రమత్తమై ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని తెలిపారు. ‘శిబిరానికి కాపలాగా ఉన్న సెంట్రీ పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు మొదలయ్యాయి. జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు.వెంటనే క్విక్ రియాక్షన్ బృందం అప్రమత్తతతో ఉగ్రవాదులు తప్పించుకోలేకపోయారు. వెంటనే ప్రకాశవంతమైన పరికరాల సాయంతో ఉగ్రవాదుల్ని కనిపెట్టి హతమార్చారు’ అని చెప్పారు. హతులైన ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే రైఫిల్స్, మూడు అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్స్, పెద్ద ఎత్తున మ్యాగజీన్స్, బుల్లెట్లు, నాలుగు వాకీ టాకీ రేడియో సెట్లు, మూడు జీపీఎస్ పరికరాలు, మూడు మొబైల్ ఫోన్లు, డ్రై ఫ్రూట్స్, మందులు, మ్యాప్‌లు, మాట్రిక్స్ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. మందులపై పాకిస్తాన్లో తయారైనట్లు ముద్రలు ఉండడంతో ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన వారిగా నిర్ధారించామని కల్నల్ శారంగ్ వెల్లడించారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చా? అని ప్రశ్నించగా.. ‘ఉండవచ్చు. అయితే కేవలం ముగ్గుర్ని మాత్రమే హతమార్చాం. కంచె దాటేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని మాత్రమే గుర్తించాం. సమీప ప్రాంతాల్లో వెదుకులాట, అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. మ్యాప్‌ల్ని, మ్యాట్రిక్స్ షీట్లను విశ్లేషిస్తున్నాం. వాటి ద్వారా మరిన్ని వివరాలు తెలిస్తే వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఒక్కోసారి ఉగ్రవాదులు ఒకటి కంటే ఎక్కువ రేడియో సెట్లను వాడతారని, అందుకే నాలుగు సెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మందుల్ని బట్టి కొద్ది రోజులుగా క్యాంప్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు. నూరు శాతం సర్జికల్ దాడులే సైనిక చర్యకు సంబంధించి వీడియో ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం చెప్పారు. ఆగ్రాలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ... నియంత్రణ రేఖ వెంట జరిగిన దాడి నూటికి నూరు శాతం సర్జికల్ దాడేనన్నారు. దేశం పట్ల విశ్వాసం చూపని వారి విషయంలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. మన బలగాల ధైర్యం పట్ల ఇంతవరకూ ఎవరికీ అనుమానం లేదని... మొదటిసారి కొందరు వ్యక్తులు సందేహపడుతున్నారని పరీకర్ విమర్శించారు. ఒక జాతీయ న్యూస్ చానల్ కథనం ప్రకారం సర్జికల్ దాడి జరిగినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారి అంగీకరించారన్నారు. సరిహద్దుల్లో పోరాటానికి అవసరమైతే చాలామంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాక్ హోదాపై సమీక్షిస్తాం: భారత్ పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశంగా ఇచ్చిన హోదాపై పునఃసమీక్షిస్తామని భారత్ ప్రకటించింది. భద్రతా, వాణిజ్య ఆసక్తులు ఆధారంగా ఈ సమీక్ష చేస్తామని, ఉగ్రవాదం ఎగుమతి చేసే వస్తువు కాదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. 3 చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టిన ఆర్మీ జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఆర్మీ మూడు చొరబాట్ల యత్నాల్ని విఫలం చేసి నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. గురువారం తెల్లవారుజామున నౌగామ్ సెక్టార్లో చొరబాటును అడ్డుకుని నలుగురిని హతమార్చామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరింత మంది ఉగ్రవాదులు ఉండవచ్చన్న అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపాయి. నౌగామ్, రాంపూర్ సెక్టార్లలో బుధవారం రాత్రి రెండు చొరబాటు యత్నాల్ని తిప్పికొట్టామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
కాశ్మీర్లో ఎన్కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతం
కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా రాజ్వార్ గ్రామంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారని ఐజీపీ అబ్దుల్ ఘానీ మీర్ బుధవారం వెల్లడించారు. ఆ గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు ఆశ్రయం పొందారని సమాచారం అందిందని ఆయన తెలిపారు. దాంతో భద్రత సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని, ఓ ఇంటిని చుట్టుముట్టారని ఆయన వివరించారు. ఆ విషయం గమనించిన తీవ్రవాదులు భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దాంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది కాల్పులకు ఉపక్రమించారన్నారు. ఇరు వర్గాల మధ్య సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయన్నారు. -
కాశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్‌లోకి అక్రమంగా చోరబాడుతున్న ఇద్దరు తీవ్రవాదులను భారత్ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. కెరన్ సెక్టర్ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదులు అక్రమంగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయని వివరించారు. గత 10 రోజుల నుంచి దాదాపు 40 మంది చోరబాటు దారులు కెరన్ సెక్టర్ ద్వారా భారత్‌లో ప్రవేశించారని చెప్పారు. వారిలో15 మందిని ఇప్పటి వరకు భద్రత దళాలు కాల్చి చంపాయన్నారు. అయితే నియంత్రణ రేఖ దాటి ఎవరు భారత్‌లో ప్రవేశించకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.