crossfire
-
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
జార్ఖండ్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
చైబాసా: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింహ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. గువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఐజీ అమోల్ వి హోంకార్ చెప్పారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బట్రి దేవ్‌గమ్‌లను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు ఎస్ఎల్ఆర్లు, మూడు రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండె హొన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవ్‌గమ్, మహిళా నక్సల్ జుంగా పుర్టి అలియాస్ మర్లా, సప్ని హన్స్‌డాగా గుర్తించామన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆరీ్మ(పీఎల్జీఏ) ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. హోరాహోరీగా కాల్పులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్ పూనెం నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో కాంకేర్ జిల్లా కోయిల్‌బెడా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ముగ్గురు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసులు తారçసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోందని ఎస్పీ చెప్పారు. మందుపాతర పేలి జవాను దుర్మరణం ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం మందుపాతర పేలి హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ జరుపుతుండగా ఆయన పొరపాటున మందుపాతరపై కాలు వేశారని పోలీసులు తెలిపారు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి
నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు మావోల క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్కౌంటర్ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వీరిని ఏరియా కమిటీ సభ్యురాలు(ఏసీఎం), భోరందేవ్ కమిటీ కమాండర్ సునీత, విస్తార్ దళానికి చెందిన ఏసీఎం సరితా ఖటియా మోచాగా గుర్తించారు. వీరిద్దరి తలలపై రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. వీరి వద్ద తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం దొరికిందన్నారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్
చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు మహిళలున్నారని అధికారులు తెలిపారు. ఇటీవలే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దిలీప్ వాల్సే పాటిల్ తన మొట్టమొదటి పర్యటనలో భాగంగా శుక్రవారం గడ్చిరోలికి వచ్చిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈటపల్లి తహశీల్‌లోని పైడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతోందన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో జిల్లా పోలీసు విభాగానికి చెందిన సీ–60 కమాండోలు గాలింపు చేపట్టారు. వారిని గమనించిన మావోయిస్టులు యథేచ్ఛగా కాల్పులు ప్రారంభించారు. లొంగిపోవాలన్న హెచ్చరికలను పట్టించుకోకుండా కాల్పులు కొనసాగించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ తెలిపారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఏడుగురు మహిళలున్నారనీ, వీరంతా కసన్సూర్ దళానికి చెందిన వారనీ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణ జరుగుతుండటంతో వసూళ్ల విషయమై చర్చించేందుకే వీరంతా సమావేశమైనట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు కూడా గాయపడి ఉంటారనీ, ఘటనా స్థలి నుంచి తప్పించుకున్న వారికోసం కూంబింగ్ ముమ్మరం చేశామన్నారు. మృతుల్లో చాట్గాన్ లోకల్ గెరిల్లా స్క్వాడ్ ఇన్చార్జ్, డీవీసీఎం మహేష్ గోఠా ఉన్నాడు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే–47, ఒక ఎస్ఎల్ఆర్, ఒక కార్బయిన్, ఒక .303 రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 2020 సెప్టెంబర్ నుంచి జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 27 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారని ఎస్పీ గోయెల్ వివరించారు. -
ఏజెన్సీలో మళ్లీ అలజడి
విశాఖ ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. కొయ్యూరు గూడెంకొత్తవీధి మండలాల సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య సోమవారం రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని ప్రచారం జరుగుతున్నా వాటిని పోలీసులు నిర్ధారించడం లేదు. తాజా ఎదురు కాల్పులతో మన్యం మరోసారి భయం గుప్పెట్లోకి వెళ్లింది. గూడెంకొత్తవీధి/కొయ్యూరు: పోలీసులు–మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన జగన్ ఆధ్వర్యంలో 30 మంది మావోయిస్టులు పుట్టకోట నుంచి మండపల్లి వైపునకు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో మందపల్లి మీదుగా కూంబింగ్ చేసుకువస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తొలుత మావోయిస్టులే పోలీసులపై కాల్పులను జరిపినట్టు తెలిసింది.దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దీని తరువాత భారీగా వచ్చిన పోలీసులు సమీప ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరోసారి పోలీసులు–మావోయిస్టుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. తరువాత పోలీసు బలగాలు నలుదిక్కులా వెళ్లి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు. ఒకే రోజు రెండుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో మండపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భారీగా మావోయిస్టులు.. సుమారు 30 మంది మావోయిస్టులు కాల్పుల్లో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిలో ఒకరు లేదా ఇద్దరైనా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలు ఉంటాయ ని ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోను గాలిస్తున్నారు. వంటపాత్రలు స్వాధీనం.. ఇదిలా ఉంటే సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు వంట చేసేందుకు ఉపయోగించే వంటపాత్రలను, పచ్చని షీట్లను, విప్లవసాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏం జరుగుతుందోనని మందపల్లి గ్రామస్తులు ఆందోళనతో ఉన్నారు. గతంలో.. ఈ ఏడాది జూన్‌లో ప్రస్తుతం ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గరలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మండలం గుల్లవల్లి ప్రాం తంలో ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ప్లీనరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం తెలియడంతో పోలీసులు కూంబింగ్ ఉధృతం చేశారు.అప్పట్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారు. దానిలో అక్కిరాజు హరిగోపాల్ అలియస్ ఆర్కే ఉన్నారని వార్తలు వచ్చాయి. సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే మందపల్లి ప్రాంతంలో ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గంగన్న అలియస్ బస్వరాజు పున్నయ్య 15 రోజుల పాటు మావోయిస్టులకు శిక్షణ ఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అప్పట్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు అదే ప్రాంతానికి సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షోపియాన్ జిల్లాలోని బాటాగుంద్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఆరుగురు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. ‘షోపియాన్‌లో ఉగ్రవాదులు తిష్టవేశారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు శనివారం రాత్రి అనుమానిత ఇంటిని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ముస్తాక్ అహ్మద్ మీర్, మొహమ్మద్ అబ్బాస్ భట్, ఖలీద్ ఫరూక్ మాలిక్, ఉమర్ మజీద్, మొహమ్మద్ హమీద్‌తో పాటు పాక్‌కు చెందిన ఉగ్రవాది కఫీల్ హతమయ్యారు. పలువురు పోలీస్ అధికారులు, పౌరుల హత్యలతో పాటు భద్రతా సంస్థల కార్యాలయాలపై దాడిచేసిన ఘటనల్లో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో 34 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే అవంతిపోరాలో ఆదివారం జరిగిన మరో ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వసీమ్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’ అని తెలిపారు. షోపియాన్ ఎన్‌కౌం టర్లో పౌరుడు చనిపోవడంతో స్థానికులు భద్రతాబలగాలపై రాళ్లవర్షం కురిపించారు. -
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని బారాముల్లా, అనంత్‌నాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని క్రీరీ ప్రాంతంలో ఉగ్రసంచారం వార్త తెలిసి భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా వారిపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలోని అర్వానీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. రెండు ఘటనాస్థలాల్లో ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
కశ్మీర్లో భారీ ఆపరేషన్
శ్రీనగర్: ఉగ్రవాదులు లక్ష్యంగా భద్రతా బలగాలు ఆదివారం కశ్మీర్లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో భద్రత బలగాలు 13 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా వద్ద ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిజ్బుల్, లష్కరేలకు భారీ ఎదురుదెబ్బ భద్రతా బలగాల ఆపరేషన్‌తో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఎన్కౌంటర్ వివరాల్ని వెల్లడిస్తూ.. ‘మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఈ ఎన్కౌంటర్లలో గాయపడ్డారు. 25 మంది పౌరులకు పెల్లెట్ గాయాలయ్యాయి’ అని చెప్పారు. అయితే సాయంత్రానికి మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 13కి చేరింది. షోపియాన్ జిల్లా కచుదూరాలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకోగా.. సాయంత్రానికి మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేçహాలు లభించాయి. కాగా కచుదూరా ఎన్కౌంటర్ సందర్భంగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఎస్పీ అభినందనీయం: కశ్మీర్ డీజీపీ అనంత్‌నాగ్ జిల్లా దియాల్గాం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాది లొంగిపోయేందుకు ఎస్ఎస్పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) చేసిన ప్రయత్నాన్ని డీజీపీ అభినందించారు. ‘ ఒక ఉగ్రవాదికి చెందిన కుటుంబ సభ్యుల్ని సంఘటనా స్థలానికి రప్పించి అతను లొంగిపోయేలా ఎస్ఎస్పీ ప్రయత్నించారు. కుటుంబసభ్యులు ఉగ్రవాదితో 30 నిమిషాలు మాట్లాడారు. అయితే వారి మాటల్ని వినేందుకు ఆ ఉగ్రవాది ఒప్పుకోలేదు. అతను కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్లో ఆ ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు’ అని డీజీపీ తెలిపారు. ద్రాగద్ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు ఉగ్రవాదులు స్థానికులేనని, మృతదేహాల్ని బంధువులకు అప్పగించామని ఆయన తెలిపారు. ద్రాగద్‌లో ఉగ్రవాదులు నక్కిన ఇంటి యజమాని కాల్పుల్లో మరణించాడు. కశ్మీర్లో అప్రమత్తం ఎన్కౌంటర్ల నేపథ్యంలో కశ్మీర్ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హురియత్ నేతలు సయద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, యాసిన్ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు. ప్రతీకారం తీర్చుకున్నాం షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రే జమ్మూ కశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్, ఆర్మీతో కలిపి ఈ ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించారు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల్లో ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్, ఒకరు లష్కరే తొయిబాకు చెందినవారని, మరో ఐదుగురు వివరాల్ని నిర్ధారించాల్సి ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. కచుదూరా ఎన్కౌంటర్ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో పలువురు గాయపడ్డారని సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫీకర్ హసన్ తెలిపారు. కచుదూరా, ద్రాగద్‌లో ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు. గతేడాది షోపియాన్‌లో లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ హత్యకు ఈ ఎన్కౌంటర్లతో ప్రతీకారం తీర్చుకున్నామని 15వ కోర్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఏకే భట్ తెలిపారు. ఫయాజ్ హత్యలో కీలక సూత్రధారులైన ఇష్ఫక్ మాలిక్, రయీస్ తోకర్లు ఈ ఎన్కౌంటర్లలో హతమయ్యారని ఆయన తెలిపారు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుధవారం ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ)కు చెందిన మొహమ్మద్ యూసుఫ్, దీపక్ పండిట్లతో పాటు ఆర్మీలోని 160వ బెటాలియన్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫ్, నాయక్ రంజిత్ సింగ్, మరో జవాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలతో పాటు పారా కమెండోలు కూడా పాల్గొన్నారన్నారు. బుధవారం రాత్రివరకూ సాగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చామనీ, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మృతులంతా విదేశీయులేనని ఆయన స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి ఏకే–47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) దాటి కుప్వారాలోని హల్మత్పొరా ప్రాంతానికి మంగళవారం చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ మద్దతుదారులతో కలసి విందులో పాల్గొన్నారన్నారు. అనంతరం వీరు కుప్వారా పట్టణానికి బయలుదేరుతుండగా పోలీస్ గస్తీ బృందం ఎదురుపడిందన్నారు. దీంతో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారన్నారు. -
ఏవోబీలో తుపాకుల మోత
సాక్షి, విజయనగరం : మరో సారి ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో తుపాకుల మోత మోగింది. జోడుంబా, సీలేరు ప్రాంతంలో రెండు రాష్ట్రాల పోలీసులు, మావోయిస్టులు పరస్పరం బుల్లెట్ల వర్షం కురిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జోడాంబా, సీలేరు సమీపంలో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేశారనే సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా విస్తృత కూంబింగ్ నిర్వహించారు. కటాప్ ప్రాంతంలో ఎదురుపడ్డ రెండు వర్గాలు పరస్పర ఎదురు కాల్పులకు దిగాయి. కొన్ని గంటలపాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అక్కడి నుంచి మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో సుమారు 50మందికిపైగా మావోయస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో కీలక నేత ఆర్కే కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ 54 మావోయిస్టుల కిట్ బ్యాగులను స్వాధీన పరచుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పాలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పేద్మెల్, పలమడుగు అడవిలో గురువారం ఉదయం 8గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఎస్టీఎఫ్, డీఆర్జీ జవాన్లు ఉదయం కూంబింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో మావోయిస్టుల శిబిరం తారసపడడంతో ఇరువర్గాల మధ్య రెండుగంటల పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అనంతరం జవాన్లు మావోయిస్టుల శిబిరం వద్దకు వెళ్లి పరిశీలించగా ఒక మృతదేహంతో పాటు రెండు పెద్ద గన్లు, చిన్న తుపాకీ, డిటోనేటర్స్, మందులు, మావోయిస్టుల సాహిత్యం, విద్యుత్ వైర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుకుమా ఎస్పీ అభిషేక్ మిన్నా మాట్లాడుతూ మావోయిస్టుల ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు మావోయిస్టులు వస్తుండగా జవాన్లకు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయని తెలిపారు. జవాన్లు కూంబింగ్ నుంచి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. -
బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ బాంబుల మోతతో దద్దరిల్లింది. చుట్టుదట్టమైన పొగలు దుమ్ముధూళి అలుముకొని కారుమబ్బులు నేలపై పరుచుకున్నట్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా గోడలకు, వీధులకు రక్తపు చారికలు అంటుకున్నాయి. ఎంతోమంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రస్తుతం రష్యా సైన్యం జరుపుతున్న వైమానిక దాడులే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా రష్యా భారీ మొత్తంలో బాంబులను, రాకెట్ లను డెమాస్కస్ పై విడవడంతో దాదాపు 40మంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. ఎంతోమంది గాయాలపాలయ్యారు. బాంబుల ధాటికి నివాసాలన్నీ కూడా ధ్వంసమై వాటిల్లో సామాన్య జనం చిక్కుకుపోయారు. లోపల ఉంటే ఇళ్లు కూలతాయో, బయటకు వస్తే బాంబులు పడతాయేమోనన్న భయంతో డెమాస్కస్ ప్రజలు బిక్కుమంటున్నారు. బుడిబుడినడకలు వేసే చిన్నారులు సైతం ప్రాణ భయంతో వీధుల వెంట పరుగెడుతుండటం పలువురుని కంటతడిపెట్టిస్తోంది. కాగా, తాము పౌర నివాసాలపై దాడులు చేయలేదని, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొనే దాడులు జరిపామని రష్యా ప్రకటించింది. తమపై చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. -
నలుగురు మావోయిస్టులు అరెస్ట్
ఖమ్మం : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఫరీజ్ఘర్లోని గుమ్మలగుట్ట అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి వద్ద నుంచి 7డిటోనేటర్లు, పెట్రోబాంబును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఫర్సేగర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడినట్లు సమాచారం. ఈ సందర్భంగా మావోయిస్టులను లొంగిపోమ్మని హెచ్చిరించినా వారు కాల్పులు జరపగా, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులు పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో స్థానిక దళ మహిళా కమాండర్ సోమి కడటితో పాటు మరో ఇద్దరు మహిళా మావోలను కరం, పూనెంగా పోలీసులు గుర్తించారు. -
ఎదురు కాల్పులు.. 11 మంది మావోయిస్టుల అరెస్టు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు.. మావోయిస్టులు తలబడ్డారు. ఇటీవల 15 మంది పోలీసులను మావోయస్టులు మందుపాతర పేల్చి, కాల్పులు జరిపి హతమారిస్తే, ఇప్పుడు ఈసారి పోలీసులు మావోయిస్టులపై ఆధిక్యం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా లాసూన్పట్ అటవీప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 11 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటనలో భారీ మొత్తంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు మావోయస్టులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసులు, పారామిలటరీ బలగాలు కలిసి భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా మావోయస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని దంతెవాడ ప్రాంతం, ఏవోబీ లాంటి ప్రాంతాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. -
హెలికాఫ్టర్‌పై మావోయిస్టుల కాల్పులు
ఛత్తీస్‌గఢ్ : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లా చింతల్నార్ సీఆర్పీఎఫ్ సమీపంలో నేవీకి చెందిన MI-17 యుద్ధ హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఈరోజు ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హెలికాప్టర్ సాయంతో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు జవాన్లు ప్రయత్నించారు. అయితే మావోలు కాల్పులు జరపటంతో మూడు బుల్లెట్లు తగిలి హెలికాప్టర్ గాలిలోనే వెనుతిరిగింది. మరోవైపు ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. -
మావోయిస్టులు - కోబ్రా దళాల మధ్య కాల్పులు
ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా, వారికి బెర్జి అటవీ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు ఎదురయ్యారు. ఇరు పక్షాల మధ్య హోరా హోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి ఎంతమంది గాయపడ్డారోనన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మావోయిస్టుల నుంచి పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
చత్తీస్‌గఢ్ డోర్నపాల్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు
-
పోలీసులు - మావోయిస్టుల ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు దారిలో మావోయిస్టులు ఎదురు కావడంతో ఇరువర్గాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో చివరకు పోలీసులదే పైచేయి అయ్యింది. ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో కూంబింగ్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది.