పారిపోబోతున్న ఇద్దరిపై కాల్పులు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్‌చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు.
అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్‌సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది.
ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment