లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్ల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు.అయినా ఇవి కొన్ని గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తోడేళ్ల దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి ఈ తోడేళ్ల గుంపు.
అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.
బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment