Durgadevi
-
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్‌తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్‌తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..
సాక్షి, జగిత్యాల: నవరాత్రులు అమ్మవారికి నిత్యపూజలు చేశాడు.. ఆమె ధ్యాసలోనే గడిపాడు.. కాలువలో జారిపడినా.. ఆ దేవతా విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.. చివరిశ్వాస వరకూ అమ్మవారినే నమ్ముకుని తన ప్రాణాలు అర్పించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో బుధవారం గల్లంతైన పూజారి సుమారు పది కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టక కొట్టుకుపోయాడు.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పూజారి బింగి ప్రసాద్(46) ఈనెల 5న దుర్గాదేవి నిమజ్జనం కోసం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. తొలుత ఇటీవల ఓ భక్తుడు సమర్పించిన వెండి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగాడు. విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన యువకులు కాలువలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. తర్వాత పూజారి కోసం శుక్రవారం వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. ఈక్రమంలో చొప్పదండి మండలం రేవల్లెలో ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద పూజారి శవమై కనిపించాడు. పది కి.మీ. అమ్మవారి విగ్రహంతోనే.. ప్రసాద్ రెండు దశాబ్దాలుగా పౌరోహిత్యం చేస్తున్నారు. జాతకాలు చూస్తున్నారు. వాస్తుదోషంలోనూ ఆరితేరాడు. కరీంనగర్, వరంగల్, ధర్మపురి వంటి దూరప్రాంతాల ప్రజలకూ సుపరిచితులు. తాటిపల్లి మార్కండేయ ఆలయంలో దశాబ్దకాలంగా అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తున్నాడు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటున్నాడు. ఉపవాస దీక్ష చేపడుతూ ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నాడు. ఈక్రమంలో ఎస్సారెస్పీ కాలువలో జారిపడి సుమారు 10కి.మీ. మేర కొట్టుకుపోయినా చివరిశ్వాస వరకూ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. పాక్షికంగా ఈత వచ్చినా, అమ్మవారి ఒడిలో చివరిశ్వాస విడిచాడు. స్థానికులు రేవల్లె వద్ద మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రసాద్‌కు నడుముకు అమ్మవారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహానికి రేవల్లె వద్ద పోస్టుమార్టం నిర్వహించి, తాటిపల్లికి తరలించి, దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. -
దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న జగజ్జనని దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. మహాగౌరిగాశ్రీశైల భ్రమరాంబ శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నందివాహనంపై ఆసీనులను కావించి అలంకార మండపంలో ఉంచారు. తేజోనిధిగా సూర్య ప్రభపై.. నక్షత్ర వెలుగులో చంద్రప్రభపై తిరుమల కొండ మీద శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ సంబరం అంబరాన్ని తాకేలా సాగుతోంది. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్యప్రభపై ఊరేగుతూ స్వర్ణకాంతులతో దివ్యతేజోమూర్తి భక్తులకు దర్శనమి చ్చారు. రాత్రి చంద్రప్రభపై చల్లని చంద్రకాంతుల్లో భక్తులను అనుగ్రహించారు. శ్రీవేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి చైతన్య ప్రదాత, సకల రోగాల నివారకుడు. స్వర్ణకాంతులీనే భాస్కరుడిని సప్తఅశ్వాల రథసారధిగా చేసుకుని మలయప్ప మత్స్య నారాయణుడి అలంకారంలో స్వర్ణ కాంతులీనుతూ ఉదయం వేళ తిరుమాడవీధుల్లో వైభవంగా విహరించారు. ఇక భగవంతుని మారు రూపమైన చంద్రుడిని వాహనంగా మలుచుకున్న వేంకటాచలపతి రాత్రి వేళలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు. -
చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ శ్వేత దండ, కమండలం ధరించి అభయ ముద్రలో శ్రీ సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే చదువుల తల్లిగా కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రికే క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి దర్శనం ఆదివారం తెల్లవారు జామున 1.10 గంటల నుంచే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు 2.30 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చనలు, పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిగాయి. అమ్మవారి నగరోత్సవం కనుల పండువగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి కళాకారులు తమ నాట్య విన్యాసాలతో అలరించారు. నేడు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం కాగా, సోమవారం దుర్గాదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన దుర్గమాసురిడిని వధించిన అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రులందు దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకస్వాములు అమ్మవారికి పూజలు చేయించారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు డీజీపీకి ఆశీస్సులందించారు. -
ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీదేవి ఉత్సవాలు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో శాకాంబరీదేవి ఉత్సవాలు ముగిశాయి. మూడ్రోజులపాటు కూరగాయలు, పండ్ల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. శాకాంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రులు బొత్స, కొడాలి నాని దర్శించుకున్నారు. -
కూతుళ్ల పండగ
దసరా వచ్చేసింది. నిన్నగాక మొన్ననే పెళ్లయిన కూతురుని, కొత్త అల్లుడిని, అతని తాలూకు బంధువులను పండక్కి పిలవాలి. వాళ్లకు మర్యాదలు చేయాలి. దసరా అంటేనే కొత్త అల్లుళ్ల పండుగ కదా. అవునా! ఇది అల్లుళ్ల పండుగా!! ఒక్కసారిగా సాక్షాత్తు అమ్మవారు ఆలోచనలో పడింది. నేను సాక్షాత్తు తల్లిని. స్త్రీని. అటువంటి నా నవరాత్రులను ఏ రకంగా అల్లుళ్ల పండుగ అంటారు? నా బంగారు తల్లుల పండుగ అని ఎందుకు అనడం లేదు.. అని తనలో తాను అనుకుంటుండగా కొత్తగా పెళ్లయిన ఓ జంట అమ్మవారి ముందుకు వచ్చి, ‘‘తల్లీ ఈ పండుగ ఎవరి పండుగో నీ నోటి ద్వారా వినాలని ఉంది’’ అన్నారు. అందుకు ఆ అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ చిరునవ్వుతో ‘‘చిరంజీవినీ! ఇది మీ పండుగమ్మా! ఆడ పిల్లల పండుగ, నా ముద్దుగుమ్మల పండుగ’ అంది. ఆ తల్లి అలా ఎందుకు అందో అర్థం కాలేదు కొత్త పెళ్లికూతురికి. ప్రశ్నార్థకంగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి లలితా పరమేశ్వరి మందస్మిత వదనంతో.. ‘‘ఈ పండుగ ఆడపిల్లల పండుగ అని నేను ఎందుకు అన్నానో చెబుతాను. శ్రద్ధగా విను’’ అని చెప్పడం మొదలు పెట్టారు.దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కదా. నేను తొమ్మిది అవతారాలలో మీకు దర్శనమిస్తాను. ప్రతి తల్లి ఒక చంటి పిల్లే. తన తనువు నుంచి జన్మించిన పసిపాపను ఆడించేటప్పుడు తల్లి ముద్దుముద్దు పదాలు మాట్లాడుతుంది. మరి ఆ తల్లి బాలా త్రిపుర సుందరేగా. ఆ తరవాత నేను శ్రీగాయత్రిగా దర్శనమిస్తాను. సూర్య గాయత్రి, లక్ష్మీ గాయత్రి అంటూ ప్రతి దేవతకు ఒక గాయత్రిని చెబుతారు. ఒక్కొక్కరినీ ఒక్కో రకంగా కీర్తించే విధానాన్ని గాయత్రి అంటారు. తల్లి కూడా తన పిల్లలను లాలించేటప్పుడు, పిల్లలతో అన్ని విషయాలలోను వ్యవహరించేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గాయత్రీదేవి అవతారం ఎత్తవలసిందే. అలా ప్రతి తల్లి ఒక గాయత్రీ మాతే కదా. ఇక అన్నపూర్ణ అవతారం. తల్లులందరూ అన్నపూర్ణమ్మలే. తల్లి గర్భంలో నుంచి పసిబిడ్డ భూమి మీద పడిన దగ్గర నుంచి పాలిచ్చి పెంచడంతో అన్నపూర్ణ అవతారం ఎత్తుతుంది. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడంలోనే కాదు, ఇంటిలోని వారందరికీ వారి రుచులకు తగ్గట్టుగా వండి అందరిచేత సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి అనిపించుకుంటారు నా కుమార్తెలు. మరి ఇది ఆడపిల్లల పండుగ కాదా. ఏ ఇంట్లో ఆడ పిల్ల పుట్టినా ‘మా ఇంటి మహాలక్ష్మి’ అంటారు. వాళ్లు నిజంగానే మహాలక్ష్ములు. ఆదాయవ్యయాలు చూసుకుంటూ ఇంటికి సిరిసంపదలు సమకూరుస్తూ ఇంటì ని లక్ష్మీనివాసంగా మార్చేటప్పుడు ఆ ఆడపిల్ల సాక్షాత్తు మహాలక్ష్మి అవతారమేగా. ఇది ఆడపిల్లల పండుగ కాదంటారా! తరవాత నా అవతారం సరస్వతీదేవి. పుట్టిన బిడ్డలకు మొట్టమొదటి గురువు కన్నతల్లి. పాపాయి పుట్టినది మొదలు ఊ కొట్టించడం దగ్గర నుంచి ఉన్నతుడిగా తీర్చిదిద్దేవరకు ఆ తల్లి సరస్వతి అవతారంలోనే ఉంటుంది. చిట్టి చిట్టి పలుకుల చిట్టి చిలకమ్మ దగ్గర నుంచి, పెద్ద పెద్ద డిగ్రీలు అందుకునేవరకు ఆ తల్లి తన బిడ్డతో చదువుతూనే ఉంటుంది. అటువంటప్పుడు నా బిడ్డలు సరస్వతులే కదా. ఇది ఆడపిల్లల పండుగే! పిల్లలు తప్పు పనులు చేసినా, తప్పుడు మాటలు పలికినా అపర దుర్గాదేవి అవతారం ఎత్తుతుంది తల్లి. తప్పు చేసినది తన బిడ్డే అయినా దండిస్తుంది. పిల్లలను సన్మార్గంలోకి మార్చే అపర దుర్గాదేవి అవతారం ఎత్తే నా బిడ్డలు సాక్షాత్తు దుర్గాదేవి అవతారమే కదా. అందుకే ఇది ఆడపిల్లల పండుగ. ఇక... మహిషాసుర మర్దిని. నేను మహిషుడనే దుర్మార్గుడిని సంహరించాను. నా బిడ్డలు కూడా అటువంటి మహిషాసురులెవరైనా వారి మీదకు వస్తే, వారంతా ‘మíß షాసుర మర్దిని’ అవతారాలే. వారిని కూడా ‘జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’ అంటూ స్తుతించవలసిందే. అందుకే నా బిడ్డలు అపర మహిషాసుర మర్దిని అవతారాలు. ఇన్ని అవతారాలు ఎత్తిన తరవాత వారంతా రాజరాజేశ్వరీ మాతగా స్థిరచిత్తంతో ఉండకపోరు. ఇన్ని అవతారాలు ఎత్తుతున్న నా బిడ్డలను గుర్తుచేసే దసరా పండుగ ఆడపిల్లల పండుగే కాని అల్లుళ్ల పండుగ కాదు కదా!’’ అంటూ చిరునవ్వుతో అంతర్థానమైపోయింది జగన్మాత. – సృజన : వైజయంతి పురాణపండ -
దుర్గతి నాశిని
దసరా నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవీనవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో జరిగే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులని అంటారు. దుర్గాదేవి ఆదిపరాశక్తి. దుర్గతులను నాశనం చేసేది కనుక ఆమెకు దుర్గ అనే పేరు వచ్చింది. హరిహరబ్రహ్మాది దేవతల చేత పూజలందుకునే దుర్గాదేవి మహిషాసుర సంహారం కోసం అవతరించి, మహిషాసురమర్దినిగా పేరుపొందింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినందున ఆనాడు విజయదశమిగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని పురాణాల కథనం. అసురులలో మహాబలసంపన్నుడైన మహిషాసురుడు తనకు మరణం ఉండరాదనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం మేరుపర్వత శిఖరానికి చేరుకుని, అక్కడ కూర్చుని బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణం లేకుండా ఉండే వరం ప్రకృతి విరుద్ధమని, అలాంటి వరాన్ని ఇవ్వజాలనని అన్నాడు బ్రహ్మదేవుడు. అయినా, మహిషాసురుడు పట్టువదల్లేదు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘నా దృష్టిలో ఆడది అంటే అబల. అబల వల్ల నాకెలాంటి ప్రమాదమూ లేదు. అందువల్ల పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రపదవిని కైవసం చేసుకుని ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారిలో రగిలిన క్రోధాగ్ని ఒక దివ్యతేజస్సుగా మారింది. త్రిమూర్తులదివ్యతేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి అవతరించిన ఆమె పద్దెనిమిది భుజాలు కలిగి ఉంది. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు. బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని ఇచ్చాడు. ఆమెకు వాహనంగా సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. దేవతలందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించిన ఆమె మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. మహిషాసురుడి సేనతో భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి వారిని తుదముట్టించిన తర్వాత నేరుగా మహిషాసురుడితో తలపడింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత దశమి నాడు మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనాడు వేడుకలు జరుపుకున్నారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు. వైవిధ్యభరితంగా వేడుకలు దసరా నవరాత్రి వేడుకలను దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకొంటారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఊరూరా దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్‌కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. అదేరోజున కుమారీపూజ చేస్తారు. ఒడిశాలో ఊరూరా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజులూ పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున విజయదుర్గను ఆరాధిస్తే అపజయాలు ఉండవని ఒడిశా ప్రజల విశ్వాసం. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని విశ్వసిస్తారు. రావణవధకు ప్రతీకగా విశాలమైన కూడళ్లలో, మైదానాల్లో భారీ పరిమాణంలోని రావణుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, బాణసంచాతో కాలుస్తారు. చాలాసేపు కాలుతూ ఉండే రావణకాష్టాన్ని తిలకించడానికి కూడళ్లలో, మైదానాల్లో జనాలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకొంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలో తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి. గుజరాత్లో దసరా వేడుకల సందర్భంగా ప్రధానంగా పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంటింటా శక్తిపూజ చేయడం గుజరాతీల ఆచారం. ఇంటి గోడలపై శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను పసుపుతో చిత్రించి, అలంకరిస్తారు. సమీపంలోని పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక ఏర్పాటు చేసి, దానిపై గోధుమలు, బార్లీ గింజలను చల్లి, దానిపై నీటితో నింపిన మట్టి కుండను పెట్టి, అందులో పోకచెక్క లేదా రాగి లేదా వెండి నాణేన్ని వేస్తారు. ఆ మట్టికుండనే దేవీ ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అష్టమి రోజున హోమం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. దశమి తర్వాత వచ్చే పున్నమి వరకు జరిగే ‘గర్భా’ వేడుకల్లో మహిళలు నృత్యగానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణానదిలో మూడుసార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దసరా రోజున ప్రభల ఊరేగింపు, ప్రభల ఊరేగింపులో జరిగే భేతాళ నృత్యం విజయవాడ దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల మొదటి రోజున ఏనుగు గుడిలో వయసైన బ్రహ్మచారిని భేతాళుడిగా నిలబెడతారు. తొమ్మిదిరోజులూ భేతాళుడే అమ్మవారి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురుకర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో తయారు చేసిన ఏనుగు బొమ్మను వివిధ అలంకరణలతో రూపొందించిన అంబారీతో అలంకరిస్తారు. ఇదేరీతిలో మరో చిన్న ఏనుగు బొమ్మను తయారు చేసి, చివరి రోజున బోయీలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. విజయనగరంలో దసరా సందర్భంగా గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా తర్వాతి మొదటి మంగళవారం రోజున పైడితల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజారిని సిరిమాను ఎక్కించి, మూడు లాంతర్ల కూడలి నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మూడు రోజుల ముందుగానే విజయనగరం చేరుకుని, వీధుల్లోనే గుడారాలు వేసుకుని మకాం వేసి, ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. కృష్ణాజిల్లా రేవుపట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తిపటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తెలంగాణలో దసరా నవరాత్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు. నవదుర్గల ఆరాధన శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తారు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహపురాణ శ్లోకంలో చెప్పిన వరుస క్రమంలో ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ/ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం/ పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ/ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణలు చేసి, నిష్టగా పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. దేవీసప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ, భ్రామరి అనే నామాలను, వారి గాథలను ప్రస్తావించినా, ఈ అవతరాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే, దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవీసప్తశతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి, పూజలు జరుపుతారు.శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా, దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. విదేశాలలో దసరా దసరా నవరాత్రి వేడుకలను భారత్‌తో పాటు హిందువుల జనాభా ఎక్కువగా ఉండే ఇతర దేశాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. నేపాల్‌లో విజయదశమిని ‘బడాదశైం’ అంటారు. నేపాల్‌లో బడా దశైం వేడుకలను హిందువులతో పాటు బౌద్ధులు, అక్కడి గిరిజన తెగకు చెందిన కిరాతులు కూడా వైభవోపేతంగా జరుపుకొంటారు. భారత్‌లో నేపాలీలు ఎక్కువగా ఉండే సిక్కిం, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లోను, డార్జిలింగ్ ప్రాంతంలోను కూడా ‘బడాదశైం’ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. భూటాన్‌లోని లోత్షంపా తెగకు చెందిన వారు, మయన్మార్‌లోని బర్మా గూర్ఖాలు కూడా ఈ వేడుకలను జరుపుకొంటారు. నేపాల్‌లోని కఠ్మాండు లోయలోని నేవా ప్రాంతానికి చెందిన నేవార్లు దసరా వేడుకలను ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని పున్నమి నాటి వరకు జరుపుకొంటారు. ఈ వేడుకలను ‘మోహాని‘గా వ్యవహరిస్తారు. నేపాల్‌లోని శక్తి ఆలయాల్లో ‘బడాదశైం’, ‘మోహాని’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. బంధుమిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యేకమైన ఈ విందులను ‘నఖ్‌త్యా’ అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ‘ఘటస్థాపన’ చేయడంతో ‘బడాదశైం’ వేడుకలు మొదలవుతాయి. నవరాత్రులలో సప్తమి, మహాష్టమి, మహర్నవమి, దశమి రోజులలో విశేషమైన పూజలు చేస్తారు. సప్తమి రోజున ‘ఫూల్‌పత్తి’ వేడుకలను జరుపుతారు. ఈ వేడుకల కోసం కఠ్మాండు లోయకు చెందిన బ్రాహ్మణులు మూడురోజుల ముందే బయలుదేరుతారు. వారు రాచకలశాన్ని, అరటి గెలలను, ఎర్రటి వస్త్రంలో చుట్టిన చెరకు గడలను తీసుకువచ్చి సప్తమినాడు అమ్మవారికి సమర్పిస్తారు. మహాష్టమి రోజున అమ్మవారి ఉగ్రరూపమైన కాళీ రూపంలో అలంకరిస్తారు. ఆ రోజు భారీ స్థాయిలో మేకలను, బర్రెలను బలి ఇస్తారు. మహర్నవమి రోజు విశ్వకర్మను ఆరాధిస్తారు. ఇదేరోజున కఠ్మాండులోని తలేజు ఆలయ ద్వారాలు తెరిచి, భక్తులను లోనికి అనుమతిస్తారు. ఏడాది మొత్తంలో ఈ ఆలయం తెరుచుకునేది మహర్నవమి రోజున మాత్రమే. విజయదశమి నాడు పెరుగన్నంలో సిందూరాన్ని కలిపి, పెద్దలు దానిని పిల్లల నుదుట తిలకంగా అలంకరిస్తారు. ఈ తిలకాన్ని ‘టికా’ అంటారు. తిలకధారణ తర్వాత పెద్దలు పిల్లలకు దక్షిణగా కొంత డబ్బు ఇస్తారు. విజయదశమినాడు మొదలయ్యే ‘టికా’ వేడుకలు ఐదురోజుల వరకు– అంటే పున్నమి వరకు కొనసాగుతాయి. పున్నమి నాడు లక్ష్మీదేవిని పూజించడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. శ్రీలంకలో కూడా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రావణుడు పరిపాలించిన లంకలో దసరా రోజున రావణ దహన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ వేడుకలు దాదాపు ఊరూరా జరుగుతాయి. ఆరుబయటి ప్రదేశాల్లో రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల భారీ దిష్టిబొమ్మలను నిలుపుతారు. ఈ దిష్టిబొమ్మల్లో ముందుగానే మందుగుండు దట్టించి ఉంచుతారు. రామలక్ష్మణుల వేషాలు ధరించిన వారు నిప్పు ముట్టించిన బాణాలను ఈ దిష్టిబొమ్మల మీదకు సంధించడంతో మందుగుండు అంటుకుని, ఇవి తగులబడతాయి. దసరా నవరాత్రులలో శ్రీలంకవాసులు అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపాలలో ఆరాధిస్తారు. బంగ్లాదేశ్‌లో దసరా నవరాత్రులు బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతాయి. రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు దేశంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఊరూరా వీధుల్లో దుర్గాదేవి మండపాలను ఏర్పాటు చేస్తారు. చివరి రోజున వేడుకలు ముగిసిన తర్వాత మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మట్టి విగ్రహాలను నదులలో నిమజ్జనం చేస్తారు. -
మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్’
హైదరాబాద్ (జగద్గిరిగుట్ట): మైనర్ బాలికల వరుస మిస్సింగ్ కేసులు బాచుపల్లి పోలీసులకు సవాలుగా మారాయి. ఓ కేసు దర్యాప్తులో మునిగి ఉండగానే మరో మిస్సింగ్ కేసు నమోదవుతోంది. ఈ నెల 7న నిజాంపేటకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి పాఠశాలకు వెళ్లింది. అప్పటినుంచీ ఆచూకీ లభించలేదు కదా కనీసం చిన్న క్లూ కూడా దొరకక పోవడం పోలీస్ వర్గాలతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి ఇటు సైబరాబాద్.. అటు రాచకొండ కమిషనరేట్ల పరి«ధిలో విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలోని సీసీ ఫూటేజీలకు పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల సైబరాబాద్ క్రైమ్ డీసీపీ జానకి షర్మిల నిజాంపేటలోని పూర్ణిమ సాయి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వైజాగ్, యానం ప్రాంతాలకు పూర్ణిమ వెళ్లి ఉండవచ్చనే అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన నేపధ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో ఘటనలో నిజాంపేట కేటీఆర్ కాలనీకి చెందిన ప్రసాద్ కుమార్తె దుర్గాదేవి (14) ఈ నెల 11న కిరాణా దుకాణానికి వెళ్లి అదృశ్యమైంది. ఇప్పటి వరకు ఆ బాలిక కూడా తిరిగి రాలేదు. ఇంకా నిజాంపేటలోని బండారు లేఅవుట్లో నివాసముండే శ్యాంసుందర్‌రెడ్డి కుమార్తె యామిని(16) ఈ నెల 11న బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది. యామిని ఖమ్మంలోని తన స్వగ్రామం వెళ్లినట్లు తెలిసింది. పూర్ణిమ, దుర్గాదేవిల మిస్సింగ్‌లు మిస్టరీగానే మారాయి. -
సరస్వతీ నమస్తుభ్యం
-
జాతర ఆదాయం రూ.1.25 లక్షలు
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల మండలంలోని గఢ్‌పూర్ జీపీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఎంసీసీ దుర్గాదేవి క్వారీ జాతర వేలం పాట ద్వారా జీపీకి రూ. లక్షా 25 వేల 500 ఆదాయం సమకూరింది. ఈనెల 24వ తేదీన దుర్గాదేవి జాతర నిర్వహించనుండగా, పలు దుకాణాలతోపాటు వాహనపార్కింగ్ కోసం బహిరంగ వేలం పాటలో మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి 16 మంది పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన గూడ అంజయ్య రూ. లక్షా 25 వేల 500లకు వేలం పాడి దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోవ రాజు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు. -
నిత్యం..నీ నామ స్మరణం
ఈ కుందనపు బొమ్మ పేరు బోడపాటి ప్రసన్నదేవి. పక్కనున్న పంచలోహ విగ్రహం ఆమె రూపంలో తయారు చేసిన ప్రతిమ. అదేంటి అచ్చం ఆమెలాంటి ప్రతిమ చేశారెందుకని డొటొస్తోంది కదూ. ఆమె ఈ లోకాన్ని వీడి సరిగ్గా 14 నెలలైంది. విషయంలోకి వెళితే... భీమవరం పట్టణానికి చెందిన బోడపాటి రవితేజ (చినబాబు), దుర్గాదేవి దంపతుల గారాలపట్టి ప్రసన్నదేవి. 20 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలను కురిపించింది. 1992 ఆగస్టు 2న జన్మించిన ఆమె గత ఏడాది మే 6వ తేదీన కుటుంబ సభ్యుల్ని శోకసముద్రంలో ముంచి స్వర్గానికి పయనమైంది. ప్రసన్నదేవి జ్ఞాపకాలను వీడలేని తల్లిదండ్రులు ఆమె రూపంలో ఇలా పంచలోహ విగ్రహం తయూరు చేయించి ఇంట్లోని పూజా మందిరంలో ప్రతిష్టించారు. నిత్యం పూజలు చేస్తున్నారు. ఇంటిని ఆమె ప్రతిరూపాలతో నింపేశారు. ప్రతిక్షణం ప్రసన్నదేవి నామాన్ని స్మరిస్తూ.. మధుర సృ్మతులను నెమరు వేసుకుంటున్నారు. ఆమె పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.