దసరా నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవీనవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో జరిగే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులని అంటారు. దుర్గాదేవి ఆదిపరాశక్తి. దుర్గతులను నాశనం చేసేది కనుక ఆమెకు దుర్గ అనే పేరు వచ్చింది. హరిహరబ్రహ్మాది దేవతల చేత పూజలందుకునే దుర్గాదేవి మహిషాసుర సంహారం కోసం అవతరించి, మహిషాసురమర్దినిగా పేరుపొందింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినందున ఆనాడు విజయదశమిగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని పురాణాల కథనం.
అసురులలో మహాబలసంపన్నుడైన మహిషాసురుడు తనకు మరణం ఉండరాదనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం మేరుపర్వత శిఖరానికి చేరుకుని, అక్కడ కూర్చుని బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణం లేకుండా ఉండే వరం ప్రకృతి విరుద్ధమని, అలాంటి వరాన్ని ఇవ్వజాలనని అన్నాడు బ్రహ్మదేవుడు. అయినా, మహిషాసురుడు పట్టువదల్లేదు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘నా దృష్టిలో ఆడది అంటే అబల. అబల వల్ల నాకెలాంటి ప్రమాదమూ లేదు. అందువల్ల పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రపదవిని కైవసం చేసుకుని ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారిలో రగిలిన క్రోధాగ్ని ఒక దివ్యతేజస్సుగా మారింది. త్రిమూర్తులదివ్యతేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది.
శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి అవతరించిన ఆమె పద్దెనిమిది భుజాలు కలిగి ఉంది. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు. బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని ఇచ్చాడు. ఆమెకు వాహనంగా సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. దేవతలందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించిన ఆమె మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. మహిషాసురుడి సేనతో భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి వారిని తుదముట్టించిన తర్వాత నేరుగా మహిషాసురుడితో తలపడింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత దశమి నాడు మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనాడు వేడుకలు జరుపుకున్నారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు.
వైవిధ్యభరితంగా వేడుకలు
దసరా నవరాత్రి వేడుకలను దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకొంటారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఊరూరా దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్‌కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. అదేరోజున కుమారీపూజ చేస్తారు. ఒడిశాలో ఊరూరా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజులూ పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున విజయదుర్గను ఆరాధిస్తే అపజయాలు ఉండవని ఒడిశా ప్రజల విశ్వాసం. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని విశ్వసిస్తారు.
రావణవధకు ప్రతీకగా విశాలమైన కూడళ్లలో, మైదానాల్లో భారీ పరిమాణంలోని రావణుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, బాణసంచాతో కాలుస్తారు. చాలాసేపు కాలుతూ ఉండే రావణకాష్టాన్ని తిలకించడానికి కూడళ్లలో, మైదానాల్లో జనాలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకొంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలో తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి. గుజరాత్‌లో దసరా వేడుకల సందర్భంగా ప్రధానంగా పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంటింటా శక్తిపూజ చేయడం గుజరాతీల ఆచారం. ఇంటి గోడలపై శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను పసుపుతో చిత్రించి, అలంకరిస్తారు. సమీపంలోని పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక ఏర్పాటు చేసి, దానిపై గోధుమలు, బార్లీ గింజలను చల్లి, దానిపై నీటితో నింపిన మట్టి కుండను పెట్టి, అందులో పోకచెక్క లేదా రాగి లేదా వెండి నాణేన్ని వేస్తారు. ఆ మట్టికుండనే దేవీ ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అష్టమి రోజున హోమం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. దశమి తర్వాత వచ్చే పున్నమి వరకు జరిగే ‘గర్భా’ వేడుకల్లో మహిళలు నృత్యగానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణానదిలో మూడుసార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దసరా రోజున ప్రభల ఊరేగింపు, ప్రభల ఊరేగింపులో జరిగే భేతాళ నృత్యం విజయవాడ దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల మొదటి రోజున ఏనుగు గుడిలో వయసైన బ్రహ్మచారిని భేతాళుడిగా నిలబెడతారు. తొమ్మిదిరోజులూ భేతాళుడే అమ్మవారి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురుకర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో తయారు చేసిన ఏనుగు బొమ్మను వివిధ అలంకరణలతో రూపొందించిన అంబారీతో అలంకరిస్తారు.
ఇదేరీతిలో మరో చిన్న ఏనుగు బొమ్మను తయారు చేసి, చివరి రోజున బోయీలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. విజయనగరంలో దసరా సందర్భంగా గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా తర్వాతి మొదటి మంగళవారం రోజున పైడితల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజారిని సిరిమాను ఎక్కించి, మూడు లాంతర్ల కూడలి నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మూడు రోజుల ముందుగానే విజయనగరం చేరుకుని, వీధుల్లోనే గుడారాలు వేసుకుని మకాం వేసి, ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. కృష్ణాజిల్లా రేవుపట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తిపటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తెలంగాణలో దసరా నవరాత్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు.
నవదుర్గల ఆరాధన
శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తారు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహపురాణ శ్లోకంలో చెప్పిన వరుస క్రమంలో ఆరాధిస్తారు.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ/ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం/ పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ/ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్
నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణలు చేసి, నిష్టగా పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. దేవీసప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ, భ్రామరి అనే నామాలను, వారి గాథలను ప్రస్తావించినా, ఈ అవతరాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే, దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవీసప్తశతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి, పూజలు జరుపుతారు.శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా, దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు.
విదేశాలలో దసరా
దసరా నవరాత్రి వేడుకలను భారత్‌తో పాటు హిందువుల జనాభా ఎక్కువగా ఉండే ఇతర దేశాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. నేపాల్‌లో విజయదశమిని ‘బడాదశైం’ అంటారు. నేపాల్‌లో బడా దశైం వేడుకలను హిందువులతో పాటు బౌద్ధులు, అక్కడి గిరిజన తెగకు చెందిన కిరాతులు కూడా వైభవోపేతంగా జరుపుకొంటారు. భారత్‌లో నేపాలీలు ఎక్కువగా ఉండే సిక్కిం, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లోను, డార్జిలింగ్ ప్రాంతంలోను కూడా ‘బడాదశైం’ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. భూటాన్‌లోని లోత్షంపా తెగకు చెందిన వారు, మయన్మార్‌లోని బర్మా గూర్ఖాలు కూడా ఈ వేడుకలను జరుపుకొంటారు.
నేపాల్‌లోని కఠ్మాండు లోయలోని నేవా ప్రాంతానికి చెందిన నేవార్లు దసరా వేడుకలను ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని పున్నమి నాటి వరకు జరుపుకొంటారు. ఈ వేడుకలను ‘మోహాని‘గా వ్యవహరిస్తారు. నేపాల్‌లోని శక్తి ఆలయాల్లో ‘బడాదశైం’, ‘మోహాని’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. బంధుమిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యేకమైన ఈ విందులను ‘నఖ్‌త్యా’ అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ‘ఘటస్థాపన’ చేయడంతో ‘బడాదశైం’ వేడుకలు మొదలవుతాయి. నవరాత్రులలో సప్తమి, మహాష్టమి, మహర్నవమి, దశమి రోజులలో విశేషమైన పూజలు చేస్తారు. సప్తమి రోజున ‘ఫూల్‌పత్తి’ వేడుకలను జరుపుతారు. ఈ వేడుకల కోసం కఠ్మాండు లోయకు చెందిన బ్రాహ్మణులు మూడురోజుల ముందే బయలుదేరుతారు. వారు రాచకలశాన్ని, అరటి గెలలను, ఎర్రటి వస్త్రంలో చుట్టిన చెరకు గడలను తీసుకువచ్చి సప్తమినాడు అమ్మవారికి సమర్పిస్తారు. మహాష్టమి రోజున అమ్మవారి ఉగ్రరూపమైన కాళీ రూపంలో అలంకరిస్తారు.
ఆ రోజు భారీ స్థాయిలో మేకలను, బర్రెలను బలి ఇస్తారు. మహర్నవమి రోజు విశ్వకర్మను ఆరాధిస్తారు. ఇదేరోజున కఠ్మాండులోని తలేజు ఆలయ ద్వారాలు తెరిచి, భక్తులను లోనికి అనుమతిస్తారు. ఏడాది మొత్తంలో ఈ ఆలయం తెరుచుకునేది మహర్నవమి రోజున మాత్రమే. విజయదశమి నాడు పెరుగన్నంలో సిందూరాన్ని కలిపి, పెద్దలు దానిని పిల్లల నుదుట తిలకంగా అలంకరిస్తారు. ఈ తిలకాన్ని ‘టికా’ అంటారు. తిలకధారణ తర్వాత పెద్దలు పిల్లలకు దక్షిణగా కొంత డబ్బు ఇస్తారు. విజయదశమినాడు మొదలయ్యే ‘టికా’ వేడుకలు ఐదురోజుల వరకు– అంటే పున్నమి వరకు కొనసాగుతాయి. పున్నమి నాడు లక్ష్మీదేవిని పూజించడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. శ్రీలంకలో కూడా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రావణుడు పరిపాలించిన లంకలో దసరా రోజున రావణ దహన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తారు.
ఈ వేడుకలు దాదాపు ఊరూరా జరుగుతాయి. ఆరుబయటి ప్రదేశాల్లో రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల భారీ దిష్టిబొమ్మలను నిలుపుతారు. ఈ దిష్టిబొమ్మల్లో ముందుగానే మందుగుండు దట్టించి ఉంచుతారు. రామలక్ష్మణుల వేషాలు ధరించిన వారు నిప్పు ముట్టించిన బాణాలను ఈ దిష్టిబొమ్మల మీదకు సంధించడంతో మందుగుండు అంటుకుని, ఇవి తగులబడతాయి. దసరా నవరాత్రులలో శ్రీలంకవాసులు అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపాలలో ఆరాధిస్తారు. బంగ్లాదేశ్‌లో దసరా నవరాత్రులు బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతాయి. రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు దేశంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఊరూరా వీధుల్లో దుర్గాదేవి మండపాలను ఏర్పాటు చేస్తారు. చివరి రోజున వేడుకలు ముగిసిన తర్వాత మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మట్టి విగ్రహాలను నదులలో నిమజ్జనం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment