బడిని గుడి చేసిన గురుదేవుళ్లు.. | Sakshi Special Cover Story On Government Teachers Their Teaching And Collaboration | Sakshi
Sakshi News home page

బడిని గుడి చేసిన గురుదేవుళ్లు..

Published Sun, Sep 1 2024 12:29 AM | Last Updated on Sun, Sep 1 2024 12:29 AM

Sakshi Special Cover Story On Government Teachers Their Teaching And Collaboration

బతకలేక బడిపంతులు అనే నానుడి పోయింది.. బతకనేర్చిన బడిపంతులు అనే అపవాదును మోయాల్సి వచ్చింది.. కానీ ఇప్పుడు.. బతుకు నేర్పుతున్న బడిపంతులుగా ఆ బాధ్యతను సమాజం పూజించే స్థాయికి తీసుకెళ్లారు కొందరు ప్రభుత్వోపాధ్యాయులు!

కాన్వెంట్లు, ఇంటర్నేషనల్‌ కరిక్యులమ్‌తో కార్పొరేట్‌ స్కూళ్లు.. పల్లెలు, టౌన్లు, సిటీలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఉద్యోగ భద్రత కోసమే సర్కారు బడి, భవిష్యత్తుపై భరోసాకు మాత్రం ప్రైవేట్‌ స్కూలే సరి అనేది ప్రాక్టిస్‌లోకొచ్చింది. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో తెలుసుకోవడం కన్నా కంఠస్థమే ఫస్ట్‌ వస్తోంది. నైతికవిలువల కన్నా ద్రవ్య విలువకే ఇంపార్టెన్స్‌ అందుతోంది. ఇంత మార్పులో కూడా తన ముద్రను ప్రస్ఫుటంగా చూపించుకుంటోంది ప్రభుత్వ పాఠశాల. గత వైభవాన్ని ప్రేరణగా మలచుకుంటోంది.

రామాయణ, భారత, భాగవతాల కథలతో రామకృష్ణులను, కౌరవపాండవ పాత్రలను కళ్లముందు నిలబెట్టే గురువులు, ఇంగ్లిష్‌ అంటే ఇష్టమున్నా కన్‌ఫ్యూజ్‌ చేసే టెన్సెస్‌తో భయపెట్టే ఆ భాషను సింపుల్‌గా బుర్రకెక్కించి.. అయ్యో ఇది ఎంత వీజీ అనుకునేలా చేసే టీచర్లు, అమ్మో లెక్కలా.. గొట్టు అనుకునే పిల్లల లాజిక్‌ సెన్స్‌కు రెక్కలు తొడిగి.. లెక్కల మీద మోజును పెంచే మాష్టార్లు, సైన్స్‌ అంటే పళ్లు తోముకోవడం, సైన్స్‌ అంటే ఏడ్వడం, నవ్వడం, ఆకలవడం, పరుగెత్తడం, గెంతడం, అలసిపోవడటం, ఉత్సాహపడటం, నిద్రపోవడమే.. ఒక్కమాటలో ‘సైన్స్‌ అంటే బతుకురా’ అంటూ తేల్చేసి ఆ కొండను పిండి చేయించే సార్లు, ఊరి సర్పంచ్‌ ఎవరు, వార్డ్‌ కౌన్సిలర్‌ ఏం చేస్తాడు?, గాంధీ తాతా చాటిందేంటి?, చాచా నెహ్రూ చెప్పిందేంటి.. ఇట్లా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సాంఘిక శాస్త్రం అంటూ లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ పెంచిన నాటి బోధకులు.. నేటి ప్రభుత్వోపాధ్యాయులకు స్ఫూర్తిప్రదాతలవుతున్నారు. నిజమే! తెలివిడితనాన్నే ప్రోగ్రెస్‌గా పరిగణిస్తున్న గురువులతో ప్రభుత్వ పాఠశాలలు పాఠాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో ఇదిగో ఈ టీచర్లున్నారు. వాళ్లు అందుకుంటున్న గౌరవాభిమానాలు తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణలను చదవాల్సిందే!

సొంత డబ్బుతో ప్రొజెక్టర్‌ను అమర్చిన టీచర్‌..
రామగిరి దిలీప్‌ కుమార్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కోపుగూడ ప్రభుత్వ పాఠశాలలో బోధన వృత్తిని ప్రారంభించారు. తర్వాత మంచిర్యాల జిల్లా, కొమ్ముగూడేనికి బదిలీ అయ్యారు. తర్వాత పదమూడేళ్లు మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట, క్లబ్‌ రోడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ప్రతిచోట తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థిక సాయం నుంచి స్కూల్లో సౌకర్యాల పెంపునకు కృషి, సొంత డబ్బుతో ప్రొజెక్టర్లను తెచ్చి డిజిటల్‌ బోధన వరకు చదువు మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. స్కూల్‌కు ఒక గంట ముందే వెళ్లి, ఒక గంట ఆలస్యంగా వస్తుంటారు.

4, 5 తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు చెబుతూ గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ టీచర్‌పై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే అతను ఎక్కడికి బదిలీ అయితే అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. 11 మందే విద్యార్థులున్న స్కూళ్లను 250 మంది విద్యార్థుల స్ట్రెంత్‌కి చేరుస్తోంది. గత జూలైలో ఆయన లక్సెట్టిపేట నుంచి ముల్కల్లగూడకు బదిలీ అయ్యారు. ‘సారు వెంటే మేమ’ంటూ 105 మంది విద్యార్థులు అంతకుముందు స్కూల్లోంచి టీసీ తీసుకుని ముల్కల్లగూడ స్కూల్లో చేరారు. దూరభారాన్ని  లెక్కచేయక ఆటోలో వెళ్తున్నారు.

"ఫీజులు కట్టలేని  ఎంతోమంది విద్యార్థులు సర్కారు బడిని ఎంచుకుంటున్నారు. వారికి సరైన బోధన అందిస్తే, బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు. వాళ్లను పట్టించుకోకపోతే దేశానికి భవిష్యత్‌ లేకుండా చేసినవాళ్లమవుతాం. టీచింగ్‌ అనేది ఉన్నతమైన వృత్తి. నిబద్ధతతో ఉంటూ నేను చేయగలిగినంత చేయాలనేదే నా తాపత్రయం!" – రామగిరి దిలీప్‌ కుమార్‌.

బదిలీ రద్దుకై పిల్లలు ధర్నాకు దిగేంత ప్రభావం చూపిన సార్లు..
"కాతలే గంగారాం.. ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆ బడిలో ఆయనది తొమ్మిదేళ్ల సర్వీస్‌. అంకితభావంతో పనిచేసి పిల్లలు, పెద్దల మనసులను గెలుచుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వాళ్లకు ప్రత్యేకంగా మరోసారి క్లాసులు తీసుకుంటారు. ఆ కర్తవ్యదీక్ష  పిల్లలకు ఆయన మీద గౌరవాభిమానాలను పెంచింది. అందువల్లేమో మొన్న జూలైలో.. తమ సర్‌కి బదిలీ అవుతోందని తెలిసి.. ఆ స్కూల్‌ పిల్లలంతా రోడ్డు మీద ధర్నాకు దిగారు సర్‌ బదిలీ రద్దు చేయాలని కోరుతూ! ఊరి పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అంతెందుకు స్వయానా గంగారాం సర్‌ వచ్చి చెప్పినా ససేమిరా అన్నారు. దాంతో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పితే ధర్నా విరమించుకున్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో విషయంలో చురుకుదనాన్ని, ఆసక్తిని, ఉత్సుకతను చూపిస్తూంటారు. ఎవరూ ఎవరికి తీసిపోరు. ఎవరికి ఏ విషయంలో ప్రోత్సాహం అవసరమో గ్రహించి అందించాలి. కోపం, కరుకుదనంతో కాకుండా వాత్సల్యంతో వాళ్లను దారిలో పెట్టాలి. పిల్లలు ఉన్నతంగా ఎదగాలనేది మా ప్రయత్నం!" – కాతలే గంగారాం.

  • మంచిర్యాల జిల్లా, పొనకల్‌లో ప్రధానోపాధ్యాయుడైన జాజల శ్రీనివాస్‌ మీద కూడా ఆయన విద్యార్థులకు గౌరవాభిమానాలు మెండు. పొనకల్‌ స్కూల్‌తో ఆయనది 12 ఏళ్ల అనుబంధం. గత జూ¯Œ లో శ్రీనివాస్‌ సర్‌కి  అక్కపల్లిగూడకు బదిలీ అయింది. వెంటనే పొనకల్‌ స్కూల్‌లోని 141 మంది పిల్లలు అక్కపల్లిగూడ బడిలో చేరిపోయారు. అప్పటి వరకు 11 మందే ఉన్న ఆ స్కూల్లో శ్రీనివాస్‌ రాకతో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, 4, 5వ తరగతి విద్యార్థులకు గురుకుల, నవోదయ ప్రవేశం దొరికేలా బోధించడంతో శ్రీనివాస్‌ సర్‌ ఉన్న చోటే చేరాలని పట్టుబట్టి మరీ ఆ స్కూల్లో చేరారు పిల్లలు.

వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్‌ బోర్డ్స్‌తో పాఠాలు చెబుతున్న స్టార్లు..
ముద్దాడ బాలరాజు.. నల్లగొండ జిల్లా, వావికొల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయుత అందించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలకు ఉచితంగా టై, బెల్ట్, షూస్‌ని పంపిణీ చేస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి కావల్సిన సౌకర్యాలను కల్పిస్తూ వావికోల్‌ గవర్నమెంట్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ మనసుల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు ఇటీవల కొత్తతండాకు బదిలీ కావడంతో తమ స్కూల్‌ని వదలి వెళ్లద్దంటూ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.

  • జీనుగపల్లి సుధాకర్, రామగిరి సందీప్‌లకు వీరబోయనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పదకొండేళ్ల అనుబంధం. ఆ ఇద్దరూ సొంత డబ్బును వెచ్చించడంతో పాటు దాతల సహకారంతో ఆ స్కూల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించారు. డిజిటల్‌ బోధనాసౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల 50 మంది విద్యార్థులతో ఉన్న ఆ బడి 150 మందికి చేరుకుంది. అయితే ఇటీవల ఈ ఇద్దరు కూడా వరుసగా వావికోల్‌కు, నల్లగొండకు ట్రాన్స్‌ఫర్‌ కావడంతో ‘మాష్టార్లూ.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ’ కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు. ఆ ఇద్దరు టీచర్లు అందించిన సేవలను విద్యార్థుల తల్లిదండ్రులే కాదు గ్రామస్థులూ కొనియాడారు.

  • కట్టెబోయిన సైదులు..  శిల్గాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆకవరపు శివప్రసాద్‌ కూడా అదే స్కూల్లో టీచర్‌. సర్కారు బడుల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టక ముందే.. ఆ ఇద్దరూ సొంత ఖర్చులతో ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాలు కొని, తమ స్కూల్లో  ఇంగ్లిష్‌లో బోధన మొదలుపెట్టారు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాక ఆ ఊర్లో ఏ విద్యార్థీ ప్రైవేట్‌ స్కూల్‌ మెట్లెక్కని శుభపరిణామం చోటుచేసుకుంది. పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ టీచర్లిద్దరూ పూర్వ విద్యార్థుల సహకారంతో వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్‌ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పారు. ఆ గురుద్వయం కృషి వల్ల అయిదేళ్లుగా ఆ స్కూల్‌ గురుకుల పాఠశాల పోటీ పరీక్షల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ఈ కీర్తి శిల్గాపురం చుట్టుపక్కల ఊళ్లకూ వ్యాపించి అక్కడి పిల్లలూ ఈ స్కూల్లో చేరుతున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరికీ వరుసగా పెద్దమునిగల్, రామడుగులకు బదిలీ అయింది. ఊరు ఊరంతా ఆ ఇద్దరికీ కన్నీటి వీడ్కోలు పలికింది. వాయిద్యాలతో సాగనంపి.. ఆ టీచర్ల మీద తమకున్న గౌరవాన్ని చాటుకుంది.

  • గురిజ మహేశ్‌.. పదమూడేళ్లుగా టీచర్‌ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ఏ బడిలో ఉన్నా దాని మౌలిక వసతుల కల్పనకై శ్రమిస్తారు. అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తారు. విద్యార్థుల గైర్హాజరుపై ప్రత్యేక దృష్టిపెడ్తారు. పిల్లలు బడి ఎగ్గొట్టి బావులు, పొలాల చుట్టూ తిరుగుతుంటే వెళ్లి వాళ్లను తన బైక్‌ మీద ఎక్కించుకుని స్కూల్‌కి తీసుకొస్తారు. చదువు ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రస్తుతం ఆయన దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ బడికి ఆయన 2023లో డిప్యుటేషన్‌పై వచ్చారు. ఇటీవల జరిగిన బదీలీల్లోనూ ఆయన అదే బడిలో కొనసాగుతున్నారు.  

వృత్తిని ప్రేమిస్తూ, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతూ.. బోధన గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న గురువులు అందరికీ వందనాలు! - సాక్షి నెట్‌వర్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement